• search

శివారెడ్డి కవిత్వం-గ్రామీణ చిత్రణ-పరాయికరణ

By Staff
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  శివారెడ్డి కవిత్వంలోని గ్రామీణ జీవన స్మరణకు, బాల్యానుభవాల చిత్రణకు పరాయికరణ కూడా ఒక కారణం. 'నగరంలో తెల్లారగట్ట' (అజేయం, పుట-62) అనే కవితలో వేకువజాము గ్రామీణ వాతావరణాన్ని అద్భుతంగా వర్ణిస్తాడు. ఇంకా పూర్తిగా మెలకువ రాని స్థితిలో వినిపించే శబ్దాల ద్వారా అనుభూతమయ్యే దృశ్యాలను రూపు కట్టించటం ఇక్కడ ప్రత్యేకత.

  పశువులు మేకు చుట్టూ తిరుగుతున్న సవ్వడులు, మేత కొరుకుతున్న శబ్దాలు, బక్క రైతులో, జీతగాళ్లో పశువుల్ని అదిలిస్తున్న శబ్దాలు, ఏ తల్లో శిశువుని లాలించటం, కొమ్మల్లో పక్షుల కదలికలు, వెల్తురు ముద్దల్లాంటి కోడి కూతల పరంపరలు- 'అర్థనిద్రావస్థ' మెలకువగా పర్యవసించడంలో ఈ శబ్దాల పాత్ర ఎంతటితో గ్రామీణ జీవితంతో పరిచయమున్న వారందరికీ తెలిసిందే. ప్రకృతితోను, పశు పక్ష్యాదులతోను ఉండే నిరంతర సహజ సంబంధం గ్రామీణులలోని హృదయ మార్దవాన్ని, సానుభూతిని నిలిపి వుంచగలుగుతుంది.

  వాతావరణంలోని మార్పులు అనుభవంలోకి రాక ముందే రుతు పరిణామం ప్రకృతిలో ప్రతిబింబిస్తుంది. వ్యవసాయం, ఆహార విహారాలు, జరుపుకునే వేడుకలు రుత పరిణామాన్న నుసరిస్తాయి. ఈ విధంగా ప్రకృతికి మానవ జీవితానికి గల నిరంతర పారస్పర్యత గ్రామీణ జీవన విశిష్టత. గ్రామీణ జీవితంలోని నిత్యనూతనతకు, నిసర్గ సౌందర్యానికి పారస్పర్యతే మూలం. ప్రకృతికి మనిషికి ఉన్న సహజ సంబంధమే మానవ సంబంధాలలోను కనిపిస్తుంది.

  1. మనుషులూ పశువులూ ప్రతిదీ చలికి తమలోని వేడి
  కాడుపాడుకుంటున్నట్టు మునగడ దీసుకొని మొగ్గలైపోవటాలు.

  2. తెల్లారగట్ట చీకట్లో- మోకాళ్ల చుట్టూ చేతులు బిగించి
  కొద్దిగా వెనక్కీ ముందుకీ ఊగుతూ ఒకే ఒక్కడు
  కోడిగుడ్డు బుడ్డి ముందు ఒక్కొక్క అక్షరాన్నే ఆరగిస్తూ-

  3. తెల్లారగట్ట పల్లెటూరి చెరువు ఆవిర్లు కక్కుతూ ఆవిరి కుడుంలా వుంటుంది
  నిన్నే నువ్వు బహు మృదువుగా పిలుచుకుంటున్నట్టు
  చిటుకు చిటుకు మంటూ చేపలు ఎగిరిపడటాలు-
  4. చెరవు కట్ట దండ కడియంలా, కడియంలో ఒక పిచ్చిరాయిలా దేవుని గుడి.

  మొదటి దృశ్యంలో 'తమలోని వేడి'ని అనేది కవిత్వపరంగానే కాక, శాస్త్రపరంగానూ సత్యమే. 'మొగ్గలై' అనే ఉపమానం దృశ్యానికి మరింత స్పష్టతనిస్తున్నది. రెండో దృశ్యం కూడా, చలికాలపు వేకువన దీపం ముందు కూర్చొని 'ఊగుతున్న పిల్లాడు' కూడ గొప్ప స్వభావోక్తి. ఒక్కొక్క పదాన్ని కూడబలుక్కుంటూ కంఠస్తం చేయటాన్ని 'ఆరగించటం' అంటాడు.

  మూడవ దృశ్యంలో చెరువును పల్లెటూరి వంటకంతో పోల్చటమూ గడుసుదనమే. అంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు పరిసరాల్లో నుంచి వచ్చిన చిన్న శబ్దం కూడా నిజమేనా, భ్రమా అనే సంశయాన్ని కలిగిస్తూ వుంటుంది.

  నాలుగవ దృశ్యం- చేతికి పెట్టుకునే వెండి కడియం సగభాగమే కనిపిస్తుంది. అర్థ వృత్తాకారంలో కనిపించే చెరువుకు (వర్ణంతో పాటు) చక్కగా అమరిన ఉపమానం. పల్లెటూళ్లలో చెరువులకు సమీపంలో అసంపూర్ణంగా ఆగిపోయినవో, శిథిలమైనవో గుడులు కనిపించడం సహజమే. సాధారణంగా వీటికి నిత్య నైవేద్యాలలాంటివేమీ వుండవు. వాటిలో ఏ విగ్రహమూ లేకనూ పోవచ్చు. 'పిచ్చిరాయి' ద్వారా ఈ భావాన్నంతటినీ సూచిస్తాడు.

  -డొంకల మీద కాలకృత్యాలు తీర్చుకునేందుకు కదలిపోతున్న మానవాకారాల నిశ్శబ్దం కదలికలు.
  -కొమ్మల్లో పక్షుల కదలికల మనకర్థం కాని సంభాషణలు.
  -తెల్లారగట్ట చీకటి ఎంత లలితంగా, కొంచెం తడిగా, కొంచెం యిష్టంగా, కొంచెం అయిష్టంగా జారిపోతున్న ముసుగులా.
  -మా నాయనమ్మ పక్కలోంచి కొద్దిగా దుప్పటి ఒత్తిగించి ఉదయించినట్టు.
  శుద్ధ వచనంలా కనిపించే పై వాక్యాల చివరి ప్రయోగాలు కొసమెరుపుల్లా దీప్తిమంతం చేస్తున్నాయి. అందరూ అనుభవించినవే అయినా నిశితంగా పరిశీలించవనివి ఈ కవితలోని దృశ్యపరంపర.

  గత స్మృతులు పాఠకుని కళ్ల ముందు కదలాడుతుండగా ఆశ్చర్యానందాలలో మునిగి పోతాడు. అలంకారికతపై దృష్టి నిలవదు. ఆయనే చెప్పినట్టు ''నాగరికతను తిరస్కరించడం కాదు కాని- అన్ని విలువల్ని ఖండించుకుంటున్న ఏకాకి యాంత్రిక జీవనాన్ని ఆహ్వానించలేకనే'' గ్రామీణ జీవితాన్ని ఆనందంగా తలచుకోవడం."one must not forget that apart from everything else, a love for one's native countryside engenders a love for one's country too''

  ''అంతరాత్మ అట్టడుగున యింకా పల్లెటూరి వాడిగానే మిగిలిపోయి ఇంకా దృఢంగా నూతనోత్సాహ పోరాట శక్తితో విజృంభించటానికీ ఇంకా ఇంకా జీవన లాలిత్యాన్నీ కాపాడుకోవడానికీ'' ఈ బాల్యమే కారణమై ఉండవచ్చునంటాడు. ''నా శరీరాన్ని కుళ్లకుండా కాపాడుతున్నవి ఆ బాల్యానుభవాలే''నంటాడు మరో చోట. వర్తమానంలో చైతన్యశీలిగా, వివేకశీలిగా ఉండడానికి తన మూలాలను గూర్చిన, బాల్యాన గూర్చిన స్పృహ కూడా దోహదం చేస్తుంది. కుహనా సభ్యతలను లెక్క చేయని సంభాషణాధోరణి, మాండలిక ముద్ర చెరగని భాష, ఆయన మిత్రుల పట్ల చూపే ప్రేమాభిమానాలు శివారెడ్డితో ప్రత్యక్ష పరిచయమున్న వారందరికీ తెలిసినవే. ''పల్లెటూరి వాడిగా మిగిలిపోవడం'' ప్రతీకాత్మకమేమీ కాదు వాస్తవమే.

  "పాతికేళ్ల తర్వాత నగరంలో తెల్లారగట్ట నిదుర లేచి
  నే కనుగొన్నా నేనింకా బతికే వున్నానని- బతికే వున్నానని"

  బాల్యానుభవాలు మరిచిపోలేకపోవడం వల్లనే యాంత్రిక జీవనానికి అలవాటు పడలేకపోయానని గ్రహిస్తాడు. 'బతికే వుండడం' ద్వారా నగర జీవనం మనిషిని జీవచ్ఛవంగా మారుస్తున్నదని ధ్వనిస్తాడు. ఈ కవితాశీర్షిక 'నగరంలో తెల్లారగట్ట' కాని నగరంలోని వేకవ వాతావరణం వస్తువు కాదు. అదే ఈ శీర్షికలోని చమత్కారం. నగరంలో తెల్లారగట్ట నిదుర లేచినపుడు తన మదిలో మెదిలిన పల్లెటూరిలోని తెల్లవారు జాము వాతావరణమే ఇక్కడ వస్తువు. ఇలాంటి వస్తవుల వల్ల, వర్ణనల వల్ల 1990 తర్వాత రాసిన కవితలలో 'ప్రాదేశికత' (nativity) బాగా ప్రతిఫలించింది.

  వస్తువుకు ఉపయోగ విలువ, మారకపు విలువలతో పాటు ఆధునికాంతర వాదులు గుర్తించిన సంకేత విలువ కూడా ప్రాధాన్యం వహిస్తోంది. వస్తువు హోదాకు, స్థాయికి సంకేతంగా మారింది. మనుషులు వస్తు వ్యామోహానికి లోనుకావడానికి ఈ సంకేత విలువే కారణం. సంకేత విలువ ద్వారా వస్తు వ్యామోహం, దాన్ని తీర్చుకోవడానికి ధనదాహం పెరిగాయి. భూస్వామ్య వ్యవస్థ వైయక్తిక మోక్షాన్ని బోధిస్తే ప్రస్తుత వ్యవస్థ వైయక్తిక సుఖమే పరమావధి అంటుంది. దీనితో స్వార్థం ప్రబలి సర్వ విలువలూ విధ్వంసమవుతూ, మానవ సంబంధాలు విచ్ఛిన్నమవుతూ, మనిషి తనకు తానే పరాయివాడవుతున్న దారుణ స్థితి పట్ల వేదన, నిరసనలు ఈయన కవిత్వమంతటా అల్లుకొని వుంటాయి.

  ఎవరి బాధలూ, ఎవరి మరణాలూ, ఎ సంక్షోభాలు, ఏ సంచలనాలూ కదిలించలేని 'రాతి జీవితాని'కి మనలను అలవాటు చేస్తున్న స్వచర్మపరీవృతుల్ని చేస్తున్న వ్యవస్థ పట్ల క్రోధమే (వస్తువు ఏదైనా) ఆయన కవిత్వానికి నేపథ్యం.

  వ్యవస్థలోనే కాక, వ్యక్తి అంతరంగంలో జరుగుతున్న విధ్వంసానికి ప్రాకృతిక సౌందర్యంతో పాటు, మనిషి స్వాప్నిక ప్రపంచానికి సమగ్ర చిత్రణ ఈయన కవిత్వం. మనిషి అంతర్‌ బాహిర్‌ యుద్ధారావమే శివారెడ్డి కవిత్వం.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  ఎన్నికల ఫలితాలు 
  మధ్యప్రదేశ్ - 230
  Party20182013
  CONG11358
  BJP109165
  IND43
  OTH34
  రాజస్థాన్ - 199
  Party20182013
  CONG9921
  BJP73163
  IND137
  OTH149
  ఛత్తీస్‌గఢ్ - 90
  PartyLW
  CONG167
  BJP015
  BSP+07
  OTH00
  తెలంగాణ - 119
  Party20182014
  TRS8863
  TDP, CONG+2137
  AIMIM77
  OTH39
  మిజోరాం - 40
  Party20182013
  MNF265
  IND80
  CONG534
  OTH10
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more