• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నవలల్లో వస్తుధ్వని

By Staff
|

వస్తువు మరో వస్తువును స్ఫురింపజేస్తే అది వస్తుధ్వని. శబ్దార్థాలు గౌణమైపోయి భిన్నమైన అంశాలను, అర్థాలను, వస్తువును బోధిస్తే అది వస్తుధ్వని. ధ్వని రసరూపంగానూ, అలంకారరూపంగానూ ఉండవచ్చు. కవి, రచయిత వర్ణించిన పాత్రలు, సన్నివేశాలు, భావాదులు, శృంగారాదుల్లో ఏదైనా ఒక రసాన్ని వ్యంగ్యం చేయవచ్చు. అంటే పాఠకునిలో ఆ రసస్ఫూర్తిని కలిగించవచ్చు. కవి, రచయిత వర్ణించిన అంశాలు ఒక్కొక్కసారి ఉపమాది అలంకారాలను ధ్వనింపజేయవచ్చు. అట్లా ధ్వని వస్తు, రస, అలంకార భేదాలతో మూడు రకాలుగా ఉండవచ్చు. ఆధునిక ప్రక్రియ నవలను తీసుకుంటే అలంకార ధ్వని పనికి రాకపోవచ్చు. కాని రసధ్వని, వస్తుధ్వని మాత్రం నవలకు అన్వయిస్తాయి. ప్రస్తుత విషయం వస్తుధ్వని. రచయిత నవలలో స్పష్టంగా వాచ్యంగా చెప్పే విషయాల కంటే అతీతమైన భావాలు, విషయాలు పాఠకునికి గోచరించినప్పుడు, స్ఫురించినప్పుడు అది వస్తు ధ్వని అవుతుంది. కొందరు రచయితలు తాము చెప్పదలుచుకున్న భావాలను, ఉద్దేశాలను, సిద్ధాంతపరమైన భావజాలాన్ని ప్రత్యక్షంగా చేసే కథనంలోనో లేదా పాత్రల సంభాషణల్లోనో వాచ్యంగా చేప్తారు. కాని కొందరు రచయితలు తమ ఉద్దేశాలను, సిద్ధాంతపరమైన విశ్వాసాలను, విమర్శలను ప్రత్యక్షంగా చెప్పకుండా పాత్రలు, పాత్రల చరిత్ర, కథనం, సన్నివేశాలు, సంభాషణల్లో ధ్వనింపచేస్తారు. అదే వస్తుధ్వని! వాచ్యంగా, ప్రత్యక్షంగా ఉపన్యాసధోరణిలో, ఉపదేశ ధోరణిలో చెప్పే పద్ధతి కన్నా ధ్వని లేదా వ్యంగ్యరూపంగా స్ఫురింపజేసే పద్ధతి ఉత్తమమైంది. శిల్పపరంగా శ్రేష్టమైంది. ఇది పాఠకున్ని ఆలోచింపజేస్తుంది. కాబట్టి మేధావి పాఠకులకు ఈ శిల్పం నచ్చుతుంది. దాన్ని వాళ్లు మెచ్చుకుంటారు. ఆ శిల్పం ఎన్నో ఆలోచనలకు, వ్యాఖ్యానాలకు అవకాశాన్ని ఇస్తుంది. విషయ అవగాహనాపరంగా, సిద్ధాంతాల పరిజ్ఞానం పరంగా పాఠకునికి ఈ శిల్పం పరీక్ష పెడుతుంది. పాఠకుడు ఎంత లోతైన జ్ఞానం, అవగాహన కలిగి వుంటే ఆ రచన అంత ఎత్తుగా ఎదుగుతుంది. మన దురదృష్టమేమంటే వ్యంగ్యంతో కూడిన నవలల కంటే వాచ్యార్థాలు గల నవలలు ఎక్కువ సంఖ్యలో ఉండడం. వస్తుధ్వని గల నవలలను సామాన్య పాఠకులు మెచ్చుకోలేకపోవడంతో అటువంటి రచనలకు ప్రోత్సాహం లేకుండా పోతున్నది. ముఖ్యంగా పత్రికల్లో ధారావాహికంగా వచ్చే నవలల్లో రచయిత ప్రతిరోజూ, ప్రతివారం పాఠకులను ఆకట్టుకునే జిమ్మిక్కులనే ప్రయోగిస్తాడు గాని వ్యంగ్య వస్తువుతో కూడిన ఆలోచింపజేసే రచనలను చేయలేడు. ఉత్తమ నవలా శిల్పం మీద దృష్టిని నిలిపి ఆలోచింపజేసే నవలలు తెలుగులో వచ్చాయి. వ్యంగ్య వైభవం వస్తుధ్వనితో ఆలోచింపజేసే నవలలను రచయితలు తెలుగులో రాశారు.

కవులందరూ, రచయితలందరూ రసపోషణ, రసధ్వని మీదనే దృష్టి నిలపరు, దాన్ని గౌణంగా చేసిన రచనలూ ఉన్నాయి. ప్రాచీనకాలంలో భాసుడు సంఘటనలు ప్రధానమైన వస్తుధ్వని కలిగిన చక్కని నాటకాలు రచించాడు. ప్రతిభ మౌలికతలు గల కవిగా కీర్తిని సంపాదించాడు. అదే కాళిదాసు రస సిద్ధాంతంలోకి ఒదిగే నాటకాలు రచించాడు. కవికులగురవనిపించుకున్నాడు. కాని కాళిదాసు రఘువంశాన్ని ఉదాత్త చరిత్రలను, మానవ ప్రవర్తనలను ధ్వనింపజేస్తూ వస్తుధ్వని గల కావ్యంగా రచించాడు. అదే విధంగా ఆధునిక నవలల్లో రసమే ప్రధానమైందని చెప్పలేం. సంఘటనలు ప్రధానమైన వస్తుధ్వని కలిగిన నవలలు అనేకం ఉన్నాయి. ఆ నవలలు పాఠకుల్ని ఆలోచింపజేసి చైతన్యవంతుల్ని చేసేటట్లుగా ఉన్నాయి.

వస్తువు, శిల్పం రెండూ ప్రధానమైనవే అయినా కొందరు శిల్పం గౌణమని- అంటే దానికి అంత ప్రాధాన్యం ఇవ్వవలసిన అసవరం లేదంటారు. శిల్పాన్ని చెక్కడంలో రచయిత వస్తువును మరచిపోతున్నాడని, వస్తువు ప్రధానంగా ఉండాలని వాళ్ల అభిప్రాయం. వస్తువును మరీ శిల్పహీనంగా, వాచ్యంగా చేసినట్లయితే నవలగాని, కథగాని ఉపన్యాసం లాగా, వ్యాసంలాగా తయారవుతుంది. పాతతరం రచయితల నవలలు చాలా మట్టుకు ఈ విధంగా వాచ్యంగా విషయాన్ని ప్రస్తుతీకరించడం కన్పిస్తుంది. పాత్రల సంభాషణల్లో, రచయిత తన కథనంలో తన ఉద్దేశాలను, విశ్వాసాలను, తను మెచ్చే విషయాలను వాచ్యంగా చెప్పడం కనిపిస్తుంది. రాజశేఖర చరిత్రలో రచయిత తను ఆశించే సంస్కరణ భావాలను వాచ్యంగానే పాఠకులకందించాడు. ఒక్కొక్కసారి రచయితలు ఉపదేశంగా తమ అభిప్రాయాలను చెప్పడం ప్రాచీన నవలల్లో కన్పిస్తుంది.

వస్తుధ్వనిని సాధించాలంటే రచయిత తానుగా ఎక్కడా ప్రవేశించకూడదు. ఒక నాటకంగా నవలను నడపాలి. పదాలు, శైలి పాత్రోచితంగా చక్కగా చిక్కగా ఉండాలి. తాను చెప్పదలుచుకున్న భావాలను, సిద్ధాంతాలను వాచ్యంగా చెప్పకూడదు. పాత్రలు, పాత్రల చరిత్రలోనే ధ్వనించాలి. రచయిత చెప్పే పద్ధతిలో నైపుణ్యాన్ని చూపించాలి.

1. రాముడు రోజు వస్తున్నాడు.

2. రాముడు రోజూ వస్తున్నాడు.

అని రెండు వాక్యాలు ఒక్కలాగే కనిపించవచ్చు. కాని రెండో వాక్యంలో 'రోజూ'లో దీర్ఘం ఊనికలు రాముడు ప్రతిరోజు, తప్పకుండా ప్రతిరోజు వస్తున్నాడనే అర్థం స్ఫురిస్తుంది. అట్లా ఒక్క వాక్యంలో వ్యంగ్యార్థ స్ఫురణలు ఎట్లా చేయవచ్చునో చాపించాను. కాని రచయితలు పదభాగం, పదం, వాక్యం, పేరా, పేజీయే కాదు, మొత్తం నవలలోనే వస్తుధ్వని సాధించవచ్చు. దీనినే కుంతకుడు 'ప్రబంధ వక్రత' అని పేర్కొన్నాడు. అట్లా రచయిత తాను రాసే భాష, పదాలు,శైలిలో తాను చెప్పదలుచుకున్న ఉద్దేశాలను పొదగాలి. పాత్రలు, పాత్రల చరిత్రలను చెక్కాలి. రచయితకు తాను చెప్పదలుచుకున్న విషయాన్ని గురించి మంచి అవగాహన, పరిజ్ఞానం ఉండాలి. కేవలం జీవితాలను చిత్రించడం కాక ఒక మహదుద్దేశం ఆ జీవితాల కథనం నుంచి ధ్వనించాలన్న దృష్టి రచయితకు ఉండాలి. ఆ రచనాశిల్పాన్ని సాధించే రచనాకౌశలం ఉండాలి. అప్పుడే ఆ నవల గొప్పదవుతుంది. ఆ రచయిత గొప్ప రచయిత అవుతాడు.

1950 దశకంలో తెలుగులో నవలా రచయితలు వస్తువుతో పాటు శిల్పానికి ప్రాధాన్యం ఇచ్చారని చెప్పవచ్చు. చెప్పదలుచుకున్న విషయాన్ని మరీ వాచ్యం చేయకుండా ధ్వనింపచేసే వ్యంగ్య ధోరణిని పాటించారు. జి.వి. కృష్ణారావు, గోపీచంద్‌, బుచ్చిబాబు, శ్రీదేవి, వుప్పల లక్ష్మణరావు మొదలైన నవలారచయితలు వస్తు వ్యంగ్యం రచనలు చేశారు. స్వాతంత్ర్యానంతరం వెంటనే వ్యక్తుల్లో ప్రవేశించిన స్వార్థచింతనను, అవినీతి, అసత్య ధోరణులను, పడిపోయిన విలువలను వ్యంగ్యం చేస్తూ జి.వి.కృష్ణారావు 'కీలుబొమ్మలు', వుప్పల లక్ష్మణరావు 'అలడు- ఆమె' నవలలను రచించారు. మెదడుకు పదును పెట్టే నవలలు ఇవి. కొడవటిగంటి కుటుంబరావు 'చదువు' నవల చదవడానికి సాదాసీదాగా ఉంటుంది. కాని ఆ నవల మన స్వాతంత్ర్యోద్యమం నడిచిన తీరులో ఉన్న లోపాలను, విద్యావిధానం సక్రమంగా లేకపోవడం వంటి విషయాలను వ్యంగ్యం చేస్తుంది.

1950 దశకంలో వచ్చిన మనస్తత్వ చిత్రణలు గల నవలలు వస్తువును ధ్వనింపజేసే నవలలు. గోపీచంద్‌ 'అసమర్థుని జీవయాత్ర' నవలలో సీతారామారావు పాత్ర ఆచరణలో మనకు వింతగా అనిపిస్తుంది. అర్థం కాదు. కాని మనస్తత్వ శాస్త్రం ఆధారంగా ఆ పాత్రను విశ్లేషిస్తే మనకెన్నో విషయాలు ధ్వనిస్తాయి. ఆనాటి సామాజిక పరిణామం వ్యక్తి మీద చూపిన ప్రభావం అర్థమవుతుంది. అంతేకాకుండా గోపీచంద్‌ వ్యక్తిగత జీవితాన్ని తెలుసుకుంటే అతని, అతని తండ్రి జీవితాలు, సిద్ధాంతాల ఘర్షణలు తెలుస్తాయి. గోపీచంద్‌ వ్యక్తిగత జీవితం ఈ నవలలో ధ్వనిస్తే 'పండిత పరమేశ్వరశాస్త్రి వీలునామా'లో అతనిలోని సిద్ధాంతపరంగా వచ్చిన ఘర్షణలు, అతని విశ్వాసాలు ధ్వనించాయి. నవ్యమానవతావాదం వైపు అతడు మొగ్గు చూపాడు. దాన్ని ఈ నవలలో ప్రబోధించాడు. అదంతా వస్తుధ్వనిగా పాఠకుల ఆలోచనల్లోకి చొరబడుతుంది.

చైతన్యస్రవంతి శైలి గల నవలల్లో బుచ్చిబాబు 'చైతన్యస్రవంతి', నవీన్‌ 'అంపశయ్య'ల్లో సామాజిక పరిణామం మనకు అవగతమవుతుంది. ఒక విద్యార్థి జీవితం, పట్టణ పల్లె జీవితాల్లో ఉన్న అంతరాలు, వ్యక్తి మీద ప్రభావాన్ని చూపే ఆర్థిక స్థితులు, న్యూనతాభావాలు ఏర్పడడానికి గల కారణాలు- ఎన్నో మనకు అంపశయ్య నవలలో వస్తుధ్వనిగా గోచరిస్తాయి. తవ్వుతూ పోతూ ఉంటే అర్థాలకు తరగని గనుల వంటివి మనస్తత్వ శాస్త్ర సంబంధమైన చిత్రణలు గల నవలలు. లత 'ప్రేమరాహిత్యంలో స్త్రీ' నవలలో ప్రేమ వాత్సల్యాలు లోపించిన స్త్రీ జీవితం ఎట్లా పరిణమిస్తుందో వ్యంగ్యంగా మనకు గోచరిస్తుంది. అదే విధంగా ఆమె రాసిన 'మహానగరంలో స్త్రీ' ఎన్నో ఆలోచనలను రేకెత్తించే నవల. ఎందరో స్త్రీల జీవితాలకు భాష్యాలు చెప్పే వస్తు వ్యంగ్య వైభవం ఈ నవలలో ఉంది.

రాజకీయోద్యమాలను చిత్రించే నవలలో ఎంతో వస్తుధ్వని కనిపిస్తుంది. 'మాలపల్లి' నవల ముగింపు రామదాసు పాత్ర ప్రాధాన్యంతో శాంతరసం ప్రధానంగా గల నవలగా రూపొందింది. కాని వట్టికోట ఆళ్వారుస్వామి 'ప్రజల మనిషి'లో ఒక మనిషి ప్రజల మనిషిగా ఉద్యమస్ఫూర్తితో ఎదగడం వస్తువ్యంగ్యంతో చిత్రింపబడింది. దాశరథి రంగాచార్య 'చిల్లరదేవుళ్లు'లో చివర సారంగపాణి దొర కూతురు తన మేనమరదలని తెలుసుకొని వివాహం చేసుకోవడంతో 'విశాలాంధ్ర' భావన ధ్వనించింది. అదే విధంగా సుజాతారెడ్డి 'మలుపు తిరిగి రథచక్రాలు' నవలలో రమేశ్‌ అనే విప్లవ వీరుడు నవల చివర ఒక చిన్న పాపను సాదడానికి పూనుకోవడంతో అతను ప్రజాస్వామ్యంవైపు మలుపు తిరగడం ధ్వనించింది. ఈ విధంగా ఎన్నో నవలల్లో ముగింపు వస్తుధ్వని స్ఫోరకంగా ఉండడం కనిపిస్తుంది. వాసిరెడ్డి సీతాదేవి 'మట్టిమనిషి' నవలలో నవల చివర సాంబయ్య మనుమడు తుపాకి పట్టడం అవినీతి దోపిడీలకు వ్యతిరేకంగా ఉద్యమించాడనే వస్తువు ధ్వనిస్తున్నది.

చారిత్రక నవలలను తీసుకుంటే అవి ఎక్కువగా రసపోషకంగా కనిపిస్తాయి. అడవి బాపిరాజు చారిత్రక నవలలు శృంగార వీర రసస్ఫోరకంగా ఉంటాయి. కానీ పాతతరం చిలకమర్తి మొదలైన రచయితలు రాసిన చారిత్రక నవలలు సంఘటనలు ప్రధానమైన నవలలు. వీటిల్లో దేశప్రేమ, జాత్యభిమానం, బానిసత్వం మీద తిరుగుబాటు చేయాలనడం, స్వేచ్ఛ స్వాతంత్ర్యేచ్ఛలు వస్తుధ్వనిని సాధించడానికి, పాఠకుల్లో దేశాభిమానాన్ని నింపి ఉత్తేజితులను చేయడానికి ఆ కాలంలో రచయితలు చారిత్రక నవలలు రచించారు. అయితే తాము చెప్పదలుచుకున్న విషయాలను వాచ్యం చేయకుండా పాత్రల చరిత్రల ద్వారా వ్యంగ్యంగా చెప్పారు. తమ సందేశాలను పాఠకులకు చేరేట్లుగా చేశారు. ఆ పనిలో విజయం సాధించారు. బ్రిటిష్‌ పాలకుల కన్నెర్రను, నిషేధాలను తప్పించుకున్నారు.

విశ్వనాథ 'ఏకవీర', 'ధర్మచక్రం' నవలల్లో హిందూ సంప్రదాయాల గొప్పతనాన్ని ధ్వనింపచేశాడు. తరవాత విప్లవవాదం, స్త్రీవాదం, దళితవాదాలతో వచ్చిన నవలల్లో వస్తువు వాచ్యంగానే కనిపిస్తుంది. అక్కడ దాగుడుమూతలు లేవు. ఇక వ్యాపార నవలలో వాచ్యం తప్ప వేరే ఏం కనిపించదు.

ఇకపోతే, ఈ మధ్యకాలంలో వచ్చిన కొన్ని నవలల్లో నాటకీయతను, వస్తుధ్వనిని సాధిస్తున్నారు. చిలుకూరి దేవపుత్ర తన 'పంచమం'లో పంచముల ఐక్యత అవసరం, సిద్ధాంతాల ఆవశ్యకతలు వస్తుధ్వని రూపంగా చిత్రించారు. అదే విధంగా సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి 'కాడి' నవలలో వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు సమాజపు తక్కెడలను వ్యక్తులనూ ఎట్లా మార్చేస్తున్నాయో చక్కగా ధ్వనింపజేస్తుంది.

ప్రతీకాత్మకత గల నవలల్లో వస్తుధ్వని తప్పక కనిపిస్తుంది. ప్రతీకల వెనుక రచయిత చెప్పదలుచుకునే ఉద్దేశాలు దాగిఉంటాయి. పైకి ఒకలాగ కనిపించే ఈ నవలల్లో అసలు అర్థాలు వేరే ఉంటాయి. ఆ అసలు అర్థాలు దొరికించుకోవడం పాఠకుని ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది. చలం నవలలన్నీ దాదాపుగా అతని మనస్సులో జరిగే ఆధ్యాత్మిక, సైద్దాంతిక ఘర్షణలను ధ్వనిస్తున్నాయి. ప్రతి పాత్ర ఒక ప్రతీకగా కన్పించి పాఠకులను వస్తు వ్యంగ్యాన్ని బోధిస్తుంటాయి.

ఈ మధ్యకాలంలో సల్మాన్‌రష్డీ, అరుంధతిరాయ్‌ వంటి వాళ్లు రాసే ఇంగ్లీషు నవలా సాహిత్యంలో ప్రతీకాత్మకత, అలిగర్‌, ఫాంటసీ ధోరణులు ఎక్కువగా ప్రవేశించి వస్తుధ్వనితో కూడి ఉండి పాఠకుల్ని ఆలోచింపజేసేవిగా ఉంటున్నాయి. ఆలోచనలకు కొత్త వ్యాఖ్యానాలకు తావిచ్చే వస్తువ్యంగ్య వైభవం గల నవలలే పాఠకులను ఆకట్టుకుంటాయి. వాళ్ల మేధస్సుకు పని పెడ్తాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X