అమెరికా 'కథా' పోషణ

Posted By:
Subscribe to Oneindia Telugu

వార్షిక కథా సంకలనాల ప్రచురణ తెలుగు సాహిత్య రంగంలో ఇటీవలి కాలంలో చర్చనీయాంశంగా మారింది. పదేళ్లుగా వాసిరెడ్డి నవీన్‌, పాపినేని శివశంకర్‌ యేటేటా కథా సంకలనాలు వెలువరిస్తున్నారు. జయధీర్‌ తిరుమల రావు నేతృత్వంలో కొన్నేళ్లుగా తెలుగు విశ్వవిద్యాలయం వార్షిక కథా సంకలానాలు వెలువడుతున్నాయి. వీటి రెంటికి మధ్య పోటీ లేకపోవచ్చు గానీ సాహిత్యకారులు మాత్రమే పోటీ సంకలనాలుగానే చూస్తున్నారు. అయితే, పోటీ వాతావరణ రావడానికి కారణం లేకపోలేదు. తాము ఉత్తమ కథలను ఎంపిక చేసి సంకలనాలు వేస్తున్నామని సంపాదకులు చెప్పుకోవడం వల్లనే పోటీ వాతావరణం ఏర్పడింది. ఆ సంకలనాలపై విమర్శలు వెల్తువెత్తుతున్నాయి. తెలంగాణ కథా రచయితలు వాసిరెడ్డి నవీన్‌, పాపినేని శివశంకర్‌ వేస్తున్న కథా సంకలనాలకు ప్రాంతీయ వివక్షను కూడా అంటగడుతున్నారు.

ఈ స్థితిలో వాసిరెడ్డి నవీన్‌, పాపినేని శివశంకర్‌లు 2001 కథా సంకలనాన్ని అమెరికాలోని ఒక తెలుగు సంస్థ ఆర్థిక సహాయంతో ప్రచురించే ప్రయత్నం చేస్తున్నారనే వార్త ఇక్కడ గుప్పుమంది. తమ ఆర్థిక సహాయంతో పుస్తకాన్ని అచ్చు వేసినట్లు కథా సంకలనంలో తప్పకుండా ప్రచురించాలని అమెరికాలోని తెలుగు సంస్థ నిబంధన విధించిందని వినికిడి. అందుకు సంపాదకులు అంగీకరించారని హైదరాబాద్‌ సాహిత్యకారులు అనుకుంటున్నారు. అయితే, నష్టమేమిటనే ప్రశ్న ఉదయించవచ్చు. వాసిరెడ్డి నవీన్‌, పాపినేని శివశంకర్‌లు ఉత్తమ కథల ఎంపికలో అనుసరించిన విధానాలే ఇప్పుడు సమస్యగా పరిణమించే వీలుంది. తెలంగాణ నుంచి చాలా వరకు విప్లవ కథను, సామ్రాజ్యవాద వ్యతిరేక కథను చెప్పాలంటే రాజకీయ కథను వారు ఎంపిక చేసుకున్నారు. మిగతా ప్రాంతాల నుంచి కాస్తా పట్టువిడుపులతో కథలను ఎంపిక చేశారు.

ఇప్పుడు అమెరికా సంస్థ నుంచి ఆర్థిక సహాయం అధికారికంగా పొందితే తమ కథలను ఇవ్వబోమని విప్లవ రచయితలు అంటున్నారని వినికిడి. దీని వల్ల సంపాదకులు ఇంత వరకు ఏ ప్రమాణాలనైతే కథల ఎంపికకు అనుసరించారో ఈ ప్రమాణాలను విడనాడాల్సి వస్తుంది. ఇది వార్షిక కథా సంకలనాన్ని ఏ మేరకు ఇక్కడ నిలబెడుతుందనేది ప్రశ్నార్థకమవుతుంది. ఇప్పటి వరకు విప్లవ సాహిత్య కారుల మౌన అంగీకారం వాసిరెడ్డి, శివశంకర్‌ల సంకలనాలకు వుంటూ వచ్చింది. దీన్ని వారు వదులుకోవాల్సి వుంటుంది. నిజానికి, వీరి కథలు ఇవ్వకపోతే వాసిరెడ్డి నవీన్‌కు గానీ, పాపినేని శివశంకర్‌కు గానీ వచ్చే నష్టం కూడా ఏమీ వుండకపోవచ్చు. నిరుడే వీరు తమ కథాసంకలనాన్ని అమెరికాలో అవిష్కరించుకుని వచ్చారు. ఇప్పుడు అక్కడి వారి అధికారిక ఆర్థిక సహాయంతో ప్రచురిస్తారు. మార్కెట్‌ చేసుకునే ప్రావీణ్యం ఉన్నంత వరకు దేన్నయినా చెలామణిలో పెట్టవచ్చు.

పైగా, విప్లవ శిబిరం ఇప్పుడు బలహీన పడింది కూడా. అయితే, చిక్కల్లా ఇప్పుడు తెలంగాణ సాహిత్యకారుల నుంచే వచ్చి పడింది. వీరిని ఏ మేరకు సంతృప్తి పరుస్తారనే చర్చ కూడా ఇప్పుడు జరుగుతోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి