వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాహిత్య దేవరాజు

By కాసుల ప్రతాప రెడ్డి
|
Google Oneindia TeluguNews


జీవమంటే కేవలం కదలిక కాదు
కవిత్వమంటే కేవలం వాక్య విన్యాసం కాదు
వాక్యంలో నాడి కొట్టుకోవడం కవిత్వం
కదలికలో స్పృహ ధ్వనించడం కవిత్వం - అని అంటారు దేవరాజు మహరాజు. ఆయన తాజాగా వెలువరించిన రాజముద్ర కవితా సంపుటిలో కవిత్వానికి సంబంధించి, జీవితానికి సంబంధించి ఇటువంటి అనేక నిర్వచనాలున్నాయి. కవిత్వం కేవలం వాక్యవిన్యాసంగా, ప్రతీకల గందరగోళంగా భావిస్తున్న తరుణంలో అత్యంత సరళమైన భాషలో కవిత్వాన్ని కవిత్వంగా వెలువరిస్తున్న కొద్ది మంది తెలుగు కవుల్లో ఆయనొకరు. గుండెలో కవిత్వం తడి ఆరిపోకుండా కాపాడుకుంటున్న సీనియర్ పోయెట్ కూడా. ఆయన కేవలం కవిత్వానికి పరిమితం కాలేదు. అత్యంత ప్రతిభావంతంగా వచనం రాయగల అరుదైన రచయిత కూడా. ఆయన కవి మాత్రమే కాకుండా కథా రచయిత, నాటకకర్త, అనువాదకుడు, పాపులర్ సైన్స్ రచయిత కూడా.

నల్లగొండ జిల్లా కోడూరులో 1951 ఫిబ్రవరి 21వ తేదీన జన్మించిన ఆయన హైదరాబాదులోని న్యూసైన్స్ కాలేజీలో జంతుశాస్త్రంలో పాఠాలు చెబుతున్నారు. తెలంగాణ భాషలో కవిత్వాన్ని, కథను రాసిన తొలి తరం రచయితల్లో ఆయనొకరు. భారతీయ భాషల్లోని కవిత్వాన్ని తెలుగు పాఠకులకు పరిచయం చేశారు. సమాంతర సినిమాను విశ్లేషించిన ఘనత కూడా దేవరాజు మహరాజుది. జానపద సాహిత్య విశ్లేషణను ఆధునిక వైజ్ఞానిక దృష్టితో అందించారు. పలు విజ్ఞాన శాస్త్రాలను కూడా పాఠకులకు అందించి శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించడానికి ప్రయత్నించారు. పిల్లల కోసం రచనలు చేశారు.

కడుపు కోత, బుడుంగు, గురువుకు ఎగనామం, పాలు ఎర్రబడ్డాయి, దేవరాజు మహరాజు కథలు మొదలైన కథా సంకలనాలు, గుడిసె గుండె, గాయపడ్డ ఉదయం కవితాసంకలనాలు వెలువరించారు. కవితా భారతి, మట్టిగుండె చప్పుళ్లు వంటి అనువాద కవితాసంకలనాలు ఆయన వెలువరించారు. మట్టిగుండెలు కవితల ద్వారా మరాఠీ దళిత కవిత్వాన్ని తెలుగు సాహిత్యకారులకు పరిచయం చేశారు. ఇది దళిత కవిత్వంలో ఒక మలుపు అని చెప్పవచ్చు. ఎయిడ్స్, మూఢనమ్మకాలు - సైన్స్ వంటి విజ్ఞాన శాస్త్ర గ్రంథాలను ఆయన అందించారు. ఆధునిక యుగంలో జానపద సాహిత్యం అనే పుస్తకం రాశారు.

ప్రముఖ రచయిత దండమూడి మహీధర దేవరాజు మహరాజును అభినవ కొడవటిగంటి కుటుంబరావు అని పిలిచేవారు. ఆయన ఒకప్పుడు సితార్ వాయించేవారట. హిందీ గజల్స్ ను పాడుతారు. ఒకప్పుడు వాటర్ కలర్ పెయింగ్స్ వేసేవారు. ఇప్పుడు నఖ చిత్రాలు వేస్తున్నారు. తన కృషికి గాను ఆయన అనేక గౌరవాలు పొందారు. హడావిడి లేకుండా రచనే ప్రాణంగా బతుకున్న ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి తెలుగువాడు కావడం గర్వించదగ్గ విషయం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X