వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మా అమ్మ రెక్కల కష్టమే...

By Pratap
|
Google Oneindia TeluguNews

Sangisetty Srinivas
తెలంగాణ సాహిత్య, చరిత్ర పరిశోధనతో సంగిశెట్టి శ్రీనివాస్ పేరు మమేకమైంది. పరిశోధనే ప్రధాన ధ్యేయంగా ఆయన అమూల్యమైన సాహిత్య, చారిత్రక సంపదను వెలికి తీసి తెలుగు సమాజానికి చేర్పును అందిస్తున్నారు. ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన ఆయన ఇవాళ ఆ స్థాయికి ఎదిగిన నేపథ్యాన్ని ఆయన మాటాల్లోనే చదువుదాం....

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రోద్యమానికి పునాదులు వేసిన వాండ్లు అడుగున ఉండి అందరికి అగుపడకుంట పోయిండ్రు. వాండ్లేసిన పునాదుల మీద నిర్మించిన సౌధాలే ఈనాడు కనబడుతున్నయి. దాదాపు 23 యేండ్ల కిందనే తెలంగాణ ఆవశ్యకతను గుర్తించి అందుకోసం పాటుబడ్డ అతి కొద్ది మందిలో నేనొకణ్ణి. నాట్యకళ తెలంగాణ ప్రభాకర్‌ 198889లో నారాయణగూడాలోని కేశవ మోమోరియల్‌ హైస్కూల్‌లో ఒక సభను ఏర్పాటు చేసిండు. ఇందులో హైదరాబాద్‌ చుట్టు పక్కల ప్రాంతాల్లోని రైతులు గొంగళ్లు భుజానేసుకొని చాలా మందే వచ్చిండ్రు. వచ్చినోళ్ళందరు బోర్లేసి బోర్లపడ్డ రైతులే. అందరు అస్సల్‌సిస్సల్‌ తెలంగాణ భాషల తమ గోసను గుడ్లళ్ల నీళ్లు నింపుకుంటూ మీటింగ్‌ల జెప్పిండ్రు. ఆ మీటింగ్‌ల నేను గూడ పాల్గొన్న. అప్పుడు నేను కాచిగూడలోని బద్రుకా కాలేజిలో బి.కాం చదువుతున్న. ఈ కాలేజ్‌ దేశంలోని టాప్‌ టెన్‌ కాలేజీల్లో ఒకటని ఇండియా టుడే సర్వే ఇటీవల చెప్పింది.

నారాయణగూడ మీటింగ్‌కు కొనసాగింపుగా చాలాసార్లు కాచిగూడలోని బసంత్‌ టాకీస్‌లో (అప్పటికే టాకీస్‌లు ఫంక్షన్‌ హాళ్లుగా మారే ప్రక్రియ షురువైంది) తెలంగాణ మీటింగ్‌లు జరిగినయి. ఇది మా కాలేజికి దగ్గరుండేది. దీంతో ఇక్కడి మీటింగ్‌లకు హాజరయ్యెటోన్ని. ఈ మీటింగ్‌లల్ల పాల్గొన్న వాళ్లు మాట్లాడిరది మనసుల బాగ నాటుకుపోయింది. మన తెలంగాణ మనకు వస్తే గానీ బాధలు తీరయి అని సమజ్‌ అయింది. ఆ సోయి తోటే 1990లో ఉస్మానియాలో చేరిన తర్వాత తెలంగాణ స్టూడెంట్స్‌ ఫ్రంట్‌లో యాక్టివ్‌గా ఉండేది. ఇందులో ఇప్పుడు రామానంద యూనివర్సిటీలో పనిచేస్తున్న మిత్రులు కిషోర్‌ రెడ్డి, అంబేద్కర్‌ ఓపెన్‌ వర్సిటీలో ఉన్న వెంకన్న, రైల్వేస్‌లో ఉన్న బొజ్జ అనిల్‌కుమార్‌, ఎ.వి. కాలేజికి చెందిన జలంధర్‌ రెడ్డి, నిజాం కాలేజి ప్రేమ్‌, నేనూ అందరం తెలంగాణ గురించి మాట్లాడేది. పోస్టర్లేసేది. యూనివర్సిటిలో లోకల్‌నాన్‌ లోకల్‌ గొడవలో 30శాతం సీట్లను నాన్‌ లోకల్స్‌కు రిజర్వ్‌ చేసి ఇంజనీరింగ్‌ సీట్లను నింపడాన్ని వ్యతిరేకిస్తూ కోర్టుకు పోయినము. పీజీ అడ్మిషన్లలో ఇదే పద్ధతి కొనసాగడాన్ని వ్యతిరేకించినం.

మేము చేసిన పోరాట ఫలితంగా ఇది రద్దయింది. ఈ పనులకు మాకు అప్పటి ఆర్ట్స్‌ కాలేజి ప్రిన్సిపాల్‌ మధుసూధన్‌రెడ్డి, ఫిలాసఫీ ప్రొఫెసర్‌ లక్ష్మణ్‌ తదితరులు అండదండలందించేటోళ్లు. ఒక సారి ఆర్ట్స్‌ కాలేజిలో అలిశెట్టి ప్రభాకర్‌ ఫోటో ఎగ్జిబిషన్‌ గూడ పెట్టించినం. అట్లనే తెలుగు డిపార్ట్‌మెంట్‌ సెలబస్‌లో తెలంగాణ పాఠ్యాంశాలు పెట్టేలా ఒత్తిడి తెచ్చి సక్సెస్‌ అయినం. వీటి కొనసాగింపుగా మొదటి సారిగా ఆర్ట్స్‌ కాలేజి బిల్డింగ్‌ మీద నవంబర్‌ ఒకటి (1991)ని బ్లాక్‌డేగా పాటిస్తూ పెద్ద నల్ల జెండా ఎగరేసినం. అర్ధరాత్రి ఎన్‌ఆర్‌ఎస్‌హెచ్‌ హాస్టల్‌ నుంచి బయలుదేరి ఆర్ట్స్‌ కాలేజి పైకి చీకట్లనే ఎక్కి నల్ల జెండా పాతినం. మాటీమ్‌ల నేనొక్కణ్ణే బక్కగుండడంతోటి పైకి నేనే ఎక్కి జెండా పాతిన. అట్ల అయ్యాల్టి సంది ఇవ్వాల్టి వరకు ఎత్తిన తెలంగాణ జెండాను దించలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు దించే ప్రసక్తి కూడా లేదు. ఆనాటి నుంచి ఏది చేసినా తెలంగాణ దృక్కోణం నుంచే ఆలోచించి చేయడం అలవాటుగా మారింది. ఆ అలవాటు మూలంగానే పరిశోధనప్రచురణకార్యాచరణ సంస్థల నిర్వహణ సాధ్యమయ్యింది. మరెందరితోనో సావాసం చేయించింది.

నేను పుట్టింది, 1314 ఏండ్లు పెరిగింది మా ఊరు రఘునాథపురంలో. ఇది నల్లగొండ జిల్లా ఇప్పటి రాజాపేట మండలంలో ఉంది. మా ఊరికి ఇటు యాదగిరిగుట్ట, అటు ఆలేరు రెండు పది కిలోమీటర్ల దూరంలోనే ఉండేది. నిజానికి మా ఊరు మండల కేంద్రం కావాల్సింది. అప్పటి ఎమ్మెల్యే చల్లూరి పోచయ్యది మా ఊరే అయినా ఒక్క మండల కేంద్రాన్ని కూడా సాధించ లేకపోయిండు. అందుకే మొదటి సారి, చివరి సారి మా ఊరి నుంచి ఎమ్మెల్యే అయిన వ్యక్తిగా ఆయన రికార్డుల్లోకెక్కిండు. మా ఊరు చుట్టు ప్రక్కల ఎక్కడ లేని విధంగా భారతదేశానికి స్వాతంత్య్రంతో పాటే మా గ్రామానికి హైస్కూలు వచ్చింది. ఒక డజనుకు పైగా ఊర్ల విద్యార్థులు ఇక్కడ సదువుకునేందుకు వచ్చేది. హైస్కూల్లో సదువు చెప్పే పంతుల్లు అమరలింగం, జనార్ధన్‌గౌడ్‌ ఇద్దరూ బీసీలే. మా ఊర్లె నూటికి 70శాతం ఇండ్లు మా శాలొల్లవే. అమరలింగం సార్‌ శాలయిన. అటు తర్వాత నక్సలైట్‌ ఉద్యమంలో అమరుడైన కటుకం అంజయ్య కూడా మా ఊరయిన్నే. ఈయన యాక్టివ్‌గా ఉన్న కాలంలో ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాట అయి పరుచుకున్న బండ్రు విమల, ఆమె తండ్రి బండ్రు నర్సింలు సభలు, సమావేశాలు పెట్టి పాటలు పాడి పార్టీ ప్రచారం చేసేటోళ్లు. వీళ్లందరికన్నా ముందు చెప్పాల్సింది మా కాకయ్య సంగిశెట్టి శంభయ్య. ఈయన సాయుధ పోరాటంలో స్వయంగా పాల్గొన్నడు. తుపాకి పట్టిండు. ఆలేరు ప్రాంతంలో నల్లా నర్సింలు లాంటి వారితో కలిసి తిరిగిండు. మా కాకయ్యకు సద్దులు మోసినందుకు మా నాయిన సంగిశెట్టి స్వామి కూడా చానా ఇబ్బందులు పడ్డడు. సాయుధ పోరాటంలో పాల్గొన్న మా ఊరాయిన ఇంకొకాయన మంగలి ఎంకట్రాములు. ఇట్లా తొలితరం బీసీలు జాగృతమైన ఊరి నుంచి వచ్చిన నేను మళ్ళీ మా ఊరికి గత 35 ఏండ్లలో ఒకట్రెండు సార్లే పోయినా మా ఊరు జ్ఞాపకం ఎప్పటికీ తాజాగానే ఉంటది.

English summary
Sangisetty Srinivas name was mingled with the the research of Telangana literature and history. He writes the back ground of his personal evolution.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X