వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మా అమ్మ రెక్కల కష్టమే పార్ట్ 2...

By Pratap
|
Google Oneindia TeluguNews

Sangisetty Srinivas
పరిశోధన చేస్తే మా ఊరు కూడా చరిత్రకెక్కదగినదే అని తెలిసొచ్చింది. 1934లో సురవరం ప్రతాపరెడ్డి వెలువరించిన గోలకొండ కవుల సంచికలో మా ఊరికి చెందిన ‘పూజారి సోమలింగం' రాసిన పద్యాలు చోటు చేసుకున్నవి. ధర్మబోధ పేరిట రాసిన మూడు పద్యాలివి.

గీ. పరుల కుపకార మొనరించుకొఱకెమనమ
తనవు దాల్చితి మని యెంచి ధర్మబుద్ధి
నెప్పుడును మనోవాక్కుల నెట్టిజీవ
రాసులకు హింస గల్గింప రాదుసుమ్ము

గీ. సజ్జనుల యందు లేని దోషముల బన్ని
నింద పాల్జేయ బూనెడి నీచులెల్ల
కాలిపోదు రసూయాగ్ని కీలలందు
ముందు గూడ దుర్గతులనే చెందగలరు.

గీ. తెగ బొగుడుకొను తనుదానె తెలివి లేని
మానవుడు గొప్ప వారల గాన లేడు
గర్వమున నెంచు దనవంటి ఘనుడు లోక
మందు నెందును గనరాడటంచు మదిని.
ఈ పూజారి సోమలింగం గురించి మా ఊర్లె ఎవ్వరికి తెలియదు. బహుశా ఆయన పద్మశాలి అయి ఉంటడు. ఎందుకంటే మా ఊర్లె బాపనోల్లు (పూజారి) ఎవ్వలు ఈ పేరుతోటి లేరట!

తెలంగాణ తత్వ కవుల్లో ప్రసిద్ధిగాంచిన మరపురాని వ్యక్తి జొన్న యెల్లారెడ్డి. ఆయనది మా పక్కూరే. మా నాయినకు, అమ్మకు ఆయన తత్వాలు నోటికి వస్తయంటే అప్పటి సామాన్య జనంపై ఆయన ప్రభావం అర్థంచేసుకోవచ్చు. జొన్న యెల్లారెడ్డిది మా ఊరిని ఆనుకొని ఉన్న గౌరాయపల్లె. 1874లో పుట్టిన యెల్లారెడ్డి 1934 నాటికి కాళీశతకము, శ్రీగురు మానస పూజా విధానము, శివపుజా విధానము, సద్బ్రాహ్మణ శతకము అనే పుస్తకాలు వెలువరించాడు.పేరు యెల్లారెడ్డి అని ఉన్నప్పటికీ అందరూ ఆయన్ని యెల్లయ్య గారు అనే పిలిచేవారట.

ఆయన రాసిన తత్వాలు మొన్న మా అమ్మ రాగ యుక్తంగా పాడి వినిపించింది. జొన్న యెల్లారెడ్డి రఘునాథపురంలో మా యింటికి వచ్చి వాస్తులో చేసిన మార్పుని కూడా మా నాయిన చెప్పిండు. ఆయనకు మా ఊర్లె చాలా మంది శిష్యులుండేదట. బల్ల యెంకయ్య, బోగ రామదాసు లాంటి వాండ్లు ఆయన దగ్గర ఉపదేశం తీసుకొని భజనలు, సమాగమాలు నిర్వహించేవారట.

నిజానికి ఇన్ని పుస్తకాలు రాసిన జొన్న యెల్లారెడ్డి గురించి తెలంగాణలోనే చాలా మందికి తెలియదు. గోలకొండ కవుల సంచికలో ‘కాళీ' మీద రాసిన ఆయన పద్యాలు చోటు చేసుకున్నాయి. అవి గాకుండా మా అమ్మ పాడి వినిపించిన తత్వాలు ఆలోచింపచేసేవిగా ఉన్నాయి. అవి

1. కలువ పోదాము వస్తారమ్మా!
మీరు కలిసేటి వాండ్లయితే కలువరాండ్రమ్మా!!

2. నడుమ దొంగాలభయమమ్మా!
మీరు పెయిమీద నగలుంటె తీసిరాండ్రమ్మా!!
అంటు చనిపోయినప్పుడు ఏది వెంటరాదు. ఇది మాయాలోకమని విప్పిచెప్పిండు. అలాగే

1. ఉండబోదీ దేహము
కుండవంటిది మోహము!

2. ఉండబోదీ లండుజన్మము
పండు వలె పడిపోతదెన్నడో! అని జొన్న యెల్లారెడ్డి తత్వాలను వినిపించింది. మా నాయిన గొంతు కలిపిండు.

మా నాయిన ఐదారు తరగతి కంటె పెద్దగా సదువుకోలేదు. కాని లెక్కలు చెయ్యడంలో ఎక్స్‌పర్ట్‌. గొలుసుకట్టు రాత ఎంత గొట్టుగున్నా డెసిఫర్‌ చెయ్యగలడు. మా కాకయ్య గుంటూరు దనుకపోయి మెడిసిన్‌ సదువుకుండు. సాయుధ పోరాట ఉద్యమం కారణంగా దాన్ని మధ్యల ఒదిలేసిండు. మా నాయిన సదువుకోకున్నా ఇప్పటి ఏ ఫ్యాషన్‌ డిజైనర్‌కు తీసిపోని విధంగా బట్టలను డిజైన్‌ చేసెటోడు. ఏదారం, ఏ కలర్‌వి ఎలా రావాలో కాలుక్యులేట్‌ చేసి చెప్పెటోడు. వాటిని మా అమ్మ అడ్డలు పోసేది. తెల్లారి లేస్తే ఇరాము లేకుండా మా అమ్మ శాలపన్జేసేది. ఆసు పోసుడు, కండెలు సుట్టుడు, లడీలకు రంగులద్దుడు, సరిచేసుడు ఇట్లా పనులన్నీ చేసుకునేది. ఇంటి పని, శాల పనే గాకుండా ఇంట్లో మగ్గాలు నేసే నేతగాళ్ల పెండ్లిళ్లు చేయించేది కూడా. తన బంగారు కడెం అమ్మి కూడా వాండ్ల పెండ్లిళ్లు చేసిందంటే ఆమె గుణం అర్థం చేసుకోవచ్చు. అన్నీ తానే అయి సూసుకున్న మా అమ్మ వజ్రమ్మ మూలంగానే నేను, మా అయిదుగురం అన్నదమ్ములం ఎవ్వరి కాళ్ల మీద వాళ్లు నిలబడేవిధంగా ఎదిగనం.

ఇగ మా ఊరి నుంచి హైదరాబాద్‌ కొస్తే 1991లో ఉస్మానియాలో ఉన్న ‘తెలంగాణ స్టూడెంట్‌ ఫ్రంట్‌' విద్యార్థులమే జనసభ సమావేశాలకు ఆసరయినం, హాజరయినం. ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం విద్యార్థులుగా ఉన్నప్పుడు ‘గోల్డ్‌ మెడల్‌'పేరిట షోయెబుల్లా ఖాన్‌ పేరిట అవార్డు ఇచ్చేవారు. అది ఇప్పటికీ కొనసాగుతుంది. అయితే షోయెబుల్లాఖాన్‌ ఎవ్వరో ఏమో ఎవ్వరికీ తెలిసేది కాదు. దీంతో తవ్వకాల పనికి దిగితే ఆయన పోరు చరిత్ర వెలుగులోకి వచ్చింది. రజకార్లకు ఎదురు నిలిచి ప్రాణత్యాగం చేసిన తొలి జర్నలిస్టు అమరుడనే విషయం తెలియ వచ్చింది. మాకు పాఠ్యంశంగా చెప్పే విషయాలన్నీ ఆంధ్రప్రాంతానికి, ఆంధ్రప్రాంత పత్రికలకు సంబంధించినవి కావడంతో మరి తెలంగాణ ప్రాంతంలో పత్రికలు లేవా? అని వేసుకున్న ప్రశ్నకు జవాబుగా వచ్చిన నా పరిశోధనే ‘షబ్నవీస్‌ తెలంగాణ పత్రికా రంగ చరిత్ర'. ఆ తర్వాత ‘దస్త్రమ్‌' పేరిట విస్మరణకు గురయిన తొలినాటి వెయ్యి కథల్ని లెక్కగట్టి చెప్పడం జరిగింది. ఇది పరిశోధకుడిగా నా తొలి ప్రస్థానం. అటు తర్వాత తొలి తెలుగు కవయిత్రి ‘కుప్పాంబిక' అని, తొలి తెలుగు కథకురాలు ‘భండారు అచ్చమాంబ' అని సాక్ష్యాధారాలతో నిరూపించడంతో అప్పటి వరకు తెలుగు సాహిత్యంలో నిర్మించిన పీఠాలకు బీళ్ళు పడ్డయి. అచ్చమాంబ తొలి తెలుగు కథకురాలుగా అంగీకరించక తప్పని పరిస్థితి ఏర్పడిరది. ఇది నేను ప్రచురించిన ‘తొలి తెలుగు కథకురాలుభండారు అచ్చమాంబ' ద్వార మాత్రమే సాధ్యమయింది.

1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని సమర్ధిస్తూ సాహిత్యం అంతగా రాలేదు అని తెలంగాణ, తెలంగాణేతర విమర్శకులు లోతుల్లోకి పోకుండా వ్యాఖ్యానాలు చేయడంతో మిత్రుడు సుంకిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి రెండేండ్లు శ్రమపడి ‘1969 తెలంగాణ ఉద్యమ కవిత్వా'న్ని వెలువరించాం. ఇప్పటి వరకు ఇది మాత్రమే 1969 తెలంగాణ ఉద్యమ ఆత్మను పట్టుకున్న సాహిత్యమంటే ఆశ్చర్యం కలుగక మానదు.

తెలంగాణ ఉద్యమంపై సిపిఎం వైఖరిని నిరసిస్తూ మిత్రులతో కలిసి‘‘కమ్యునిజమా? కోస్తావాదమా?'' అనే పుస్తకాన్ని వెలువరించడం మరిచిపోలేని సంఘటన. అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణను సిద్ధాంత పరంగా వ్యతిరేకిస్తున్న ఏకైక పార్టి సిపిఎం. దాని వైఖరిని ఎండగడుతూ ఈ పుస్తకాన్ని వెలువరించడమైంది. ఈ పుస్తక ప్రచురణ తర్వాత సిపిఎం దూకుడుకు కొంత మేరకు కళ్ళెం వేయగలిగామనే సంతృప్తి మిగిలింది. అలాగే శ్రీకృష్ణ కమిటీ తప్పుల తడక నివేదికను ఎండగడుతూ ఆ నివేదిక వెలువడిన 15 రోజుల్లోనే ‘ఛీ! కృష్ణ కమిటి' పేరిట పుస్తకాన్ని వెలువరించడమైంది.

English summary
Sangisetty Srinivas name was mingled with the the research of Telangana literature and history. He writes the back ground of his personal evolution.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X