నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్
గామా నామిడ్స్ ఉల్కాపాతం.. ఓ అద్భుత, అరుదైన ఖగోళ దృగ్విషయం. రాత్రివేళ ఆకాశంలో షూటింగ్ స్టార్స్ ఆవిష్కృతం కానుంది. లెక్కలేనన్ని ఉల్కాపాతాలు కళ్ల ముందు రాకెట్లల్లా రివ్వుమంటూ దూసుకెళ్తాయి. క్షణాల్లో మటుమాయమౌతాయి. దీన్ని చూడటానికి లక్షలాదిమంది స్కైగేజర్లు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తుంటారు.. ప్రపంచవ్యాప్తంగా. తమ కెమెరాలతో రెడీ ఉంటారు. సెకెన్ల వ్యవధిలో నేలరాలిపోయే ఉల్కాపాతాన్ని క్లిక్ మనిపించడానికి సిద్ధంగా ఉంటారు.
ఆ క్షణం రానేవచ్చింది. నేడు, రేపు అంటే.. అంటే శని, ఆదివారాల్లో రాత్రివేళ నిశ్శబ్దాకాశంలో ఈ ఉల్కాపాతం కనువిందు చేయబోతోంది. సాధారణంగా మెజారిటీ ఉల్కలు తోకచుక్కల నుండి రాలిపోతుంటాయి. గ్రహశకలాలు కామెట్‌ల ధూళిని పోలి ఉంటాయి. గామా నామిడ్స్ ఉల్కలు మాత్రం వాటి కంటే ప్రకాశవంతంగా, కాస్త నెమ్మదిగా కదులుతాయి. వీటిని చూడటం సులభం. దృశ్యపరంగా మరింత ఆకర్షణీయంగా ఉంటాయి.

గామా నార్మిడ్స్ ఉల్కాపాతం వీక్షణకు సూర్యోదయానికి కొన్ని గంటల ముందు వేకువ జామున 2 నుండి 4 గంటల సమయం అత్యుత్తమం. చీకటి ఆకాశం అత్యంత అనుకూలంగా ఉంటుంది వీటి సందడిని తిలకించడానికి. దక్షిణ ఆకాశంలో, క్షితిజానికి దగ్గరగా ఉల్కలు కనిపించవచ్చు. space.com నివేదిక ప్రకారం- గామా నార్మిడ్స్ ఆకాశంలో దక్షిణ దిశగా క్షితిజానికి పైన ఉన్నప్పుడు ఉల్కలు చాలా ప్రకాశవంతంగా కనిపిస్తాయి.
ఈ శిథిలాలు ధూళి, చిన్న గులకరాళ్ల సైజులో ఉంటాయి. సౌర వ్యవస్థలో అంతటా వ్యాపించి ఉంటాయి. ఆకాశం స్పష్టంగ, తక్కువ కాంతి కాలుష్యంతో ఉన్నట్లయితే ఈ ఉల్కలను చూడవచ్చు. దక్షిణ దిశగా అడ్డంకులు లేని వీక్షణకు అనువైన ప్రదేశాలను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పట్టణ కాంతికి దూరంగా ఉంటే వీటిని స్పష్టంగా తిలకించడానికి వీలవుతుంది. ఉల్కాపాతానికి టెలిస్కోప్ లేదా ప్రత్యేక పరికరాలు అవసరం లేదు.
అనుకూల వాతావరణంలో టెలిస్కోప్, బైనాక్యులర్లు వంటివేవీ అవసరం లేకుండా వీటిని నేరుగా వీక్షించవచ్చు. దట్టమైన చీకట్లు అలముకుని, కాంతి రహితంగా ఆకాశం కనిపించే ప్రదేశాలను ఎంచుకోవాలి. 15-20 నిమిషాలు చీకటికి కళ్ళు అలవాటు పడేలా చేయాలి. ఇది మసక కాంతి రేఖలను సులభంగా గుర్తించేందుకు సహాయపడుతుంది. జెమినిడ్స్ తరహాలో అతిపెద్ద ఉల్కాపాతం కాకపోయినప్పటికీ, గామా నార్మిడ్స్ స్కైగేజర్లకు ఓ అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది.












Click it and Unblock the Notifications