వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మా అమ్మ రెక్కల కష్టమే పార్ట్ 3...

By Pratap
|
Google Oneindia TeluguNews

Sangisetty Srinivas
తొలి తరం తెలంగాణ వైతాళికుడు వట్టికోట ఆళ్వారుస్వామిని వెలుగులోకి తెచ్చి ఆయన జీవిత చరిత్రను ఎన్‌.వేణుగోపాల్‌తో కలిసి వెలువరించడమే గాకుండా ఆయన రాసిన రామప్ప రభసను కూడా ప్రచురించడమయింది.

ఇటీవల వెలువరించిన ‘హైదరాబాద్‌ సిర్ఫ్‌ హమారా!' సీమాంధ్ర పాలక వర్గం చేస్తున్న ‘అభివృద్ధి జపం'లోని డొల్లతనాన్ని బహిర్గతం చేసింది. హైదరాబాద్‌ని మేమే అభివృద్ధి చేసినం అని వారు చేస్తున్న వాదనలోని ఒక్కొక్క అంశాన్ని పూర్వ పక్షం చేసే విధంగా రాయడమయింది. ఈ పుస్తకం రాజకీయ నాయకులందరికి చేరవేయడం ద్వారా వారు తమ ప్రసంగాల్లో అనివార్యంగా వారు మాట్లాడేప్పుడు ఇందులోని విషయాల్ని కోట్‌ చేసే స్థితిని ఈ పుస్తకం కల్పించింది.

ప్రచురణ, అధ్యయన సంస్థలుగా ‘కవిలెతెలంగాణ రీసెర్చ్‌ అండ్‌ రెఫరాల్‌ సెంటర్‌', ‘ముల్కీ స్టడీ సెంటర్‌', ‘తెలంగాణ ప్రచురణలు', ‘తెలంగాణ హిస్టరీ సొసైటీ'లో బాధ్యతలు పంచుకుంటూ వాటి తరపున చాలా పుస్తకాలను వెలువరించడమైంది. ముఖ్యంగా కవిలె తరపున ఆళ్వారుస్వామి జీవిత చరిత్ర, హైదరబాద్‌ సిర్ఫ్‌ హమారా, షబ్నవీస్‌, దస్త్రమ్‌, ఆవుల పిచ్చయ్య కథలు తెలంగాణ పాఠకులకు తెలియని ఎన్నో కొత్త విషయాల్ని తెలియజేశాయి. ‘కవిలె' సంస్థను మిత్రుడు ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్‌తో కలిసి స్థాపించడమైంది. అలాగే మరో మిత్రుడు అనిల్‌ కుమార్‌తో కలిసి స్థాపించిన ‘ముల్కీ స్టడీ సెంటర్‌' తరపున కె.శ్రీనివాస్‌ రాసిన తెలంగాణ వ్యాసాల్ని ‘గాయపడ్డ తెలంగాణ' పేరిట ప్రచురించడమైంది. ఈ పుస్తకం 2006లో వెలువడిరది. ఇటీవలి కాలంలో పెద్దలు బి.నరసింగరావు, కాసుల ప్రతాపరెడ్డి, సుంకిరెడ్డి నారాయణరెడ్డిలతో కలిసి నడుపుతున్న సంస్థ ‘తెలంగాణ ప్రచురణలు'. ఈ సంస్థ తరపున ఇప్పటికే మూడు ప్రామాణికమైన గ్రంథాల్ని వెలువరించడమైంది. అందులో ‘ముంగిలి', ‘తెలంగాణ చరిత్ర' పుస్తకాలు సాహిత్య, సాంస్కృతిక, చరిత్ర విషయాల్ని ప్రామాణికంగా రేపు తెలంగాణ వచ్చిన తర్వాత పాఠ్యాంశాలుగా నిర్దేశించే విధంగా వెలువరించడమైంది. అలాగే సురవరం ప్రతాపరెడ్డిని సమైక్యాంధ్ర వాదిగా చూపుతూ, తెలంగాణ నుంచి ఆయన్ని విడదీసేందుకు సీమాంధ్ర సమైక్య పండితులు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టే ఉద్దేశ్యంతో మిత్రుడు, సహ పరిశోధకుడు సుంకిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి ‘సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణ వ్యాసాలు' పుస్తకాన్ని అచ్చేయడమైంది.

తెలంగాణ హిస్టరీ సొసైటీ ప్రారంభం నుంచి దాంట్లో భాగస్వామినై ఆ సంస్థ తరపున అచ్చేసిన అన్ని పుస్తకాలకు సహసంపాదకత్వం వహించడమైంది. ఈ సొసైటీ ద్వారా ‘1948 భిన్న దృక్కోణాలు', ‘ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు విద్రోహ చరిత్ర', ‘1969 ఉద్యమ చారిత్రక పత్రాలు' వెలువరించడమైంది. ఈపుస్తకాలు తెలంగాణలో ఉద్యమ వ్యాప్తికి, ఇంటలెక్చువల్స్‌కు వివిధ విషయాలపై అవగాహన కలిగేందుకు తోడ్పడ్డాయంటే అతిశయోక్తి కాదు. వ్యక్తులుగా ముదిగంటి సుజాతారెడ్డి గారితో కలిసి తెలంగాణ కథకు సంబంధించిన అమూల్యమైన కథా సంకలనాన్ని వెలువరించాము. అలాగే ఇటీవల తెలుగు విశ్వవిద్యాలయం కోసం సుజతా రెడ్డిగారితో కలిసి దాదాపు 1150 పేజీల్లో 110 యేండ్ల తెలుగు కథా సాహిత్యంలోని మెరుగైన ఆణిముత్యాల్లాంటి కథలను 120 సేకరించి సంకలనం చేయడం జరిగింది. ఇందులో మొత్తం తెలుగు సాహిత్యంలో తెలంగాణ కథకులకు సాధికారికమైన వాటా దక్కిన గ్రంథమిది. అలాగే కథా సాహిత్యానికి సంబంధించినదే మరో పుస్తకం ‘కథాత్మ'. ఇందులో మొత్తం కథా సాహిత్యంలో తెలంగాణ కథకులకు న్యాయంగా దక్కాల్సిన స్థానాన్ని చర్చించడమైంది. ఈ పుస్తకాన్ని సిరిసిల్ల రంగినేని ట్రస్ట్‌ వారు ప్రచురించిండ్రు.

ప్రచురణ సంస్థలతో పాటు సాహిత్య సంస్థలతో కూడా సాన్నిహిత్య సంబంధముంది. మొదట తెలంగాణ సాంస్కృతిక వేదిక, తెలంగాణ రచయితల వేదిక, ఇప్పుడు ‘సింగిడి' తెలంగాణ రచయితల సంఘంతో సంబంధముంది. సింగిడి తరపున అస్తిత్వవాదాల వెలుగులో తెలంగాణ ఉద్యమ వ్యాప్తికి సాహిత్య సృజన ద్వారా కృషి జరుగుతోంది. ఇందులో మిత్రులు సుంకిరెడ్డి, స్కైబాబ, పసునూరి రవీందర్‌, జిలుకర శ్రీనివాస్‌, ఏశాల శ్రీనివాస్‌, వనపట్ల సుబ్బయ్య లతో కలిసి పనిచేయడం ద్వారా నేర్చుకోవడం, నేర్పడం రెండూ జరుగుతున్నాయి. సింగిడి తరపున వెలువరించిన సాహిత్య సంచికలకు సంపాదకత్వం వహించే అవకాశం లభించింది. ఈ సంచికల ద్వారా ఎన్నో అంశాలను వెలుగులోకి తీసుకురావడమే గాకుండా, కొత్త విషయాల్ని, ప్రాతినిధ్యం లేని అంశాల్ని ప్రాధాన్యం కల్పించి ప్రచురించడమైంది. మిత్రుడు వేముగంటి మురళీకృష్ణ, పసునూరిలతో కలిసి ‘దస్కత్‌' కథా వేదికను నిర్మించడంలోనూ, నిర్వహణలోనూ పాల్గొని తెలంగాణ కథా సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

ఇన్ని చేస్తూ బీసీల అస్తిత్వానికి ఎసరొచ్చే ప్రమాదం కనపడడంతో ‘ఫోరమ్‌ ఫర్‌ కన్సర్న్‌డ్‌ బీసీస్‌' సంస్థను ఏర్పాటు చేయడమైంది. అది ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. దీన్ని పటిష్ట పరుచుకోవడమేగాకుండా, విస్తృతం చేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

భిన్న విషయాలపై ఇంటరెస్టు, అవగాహన కలగడానికి జర్నలిజం దోహదం చేసింది. ఉస్మానియాలో మొదట జర్నలిజంలో చేసిన మాస్టర్స్‌ డిగ్రీ ప్రవృత్తికి తోడ్పడగా, లైబ్రరీసైన్స్‌లో చేసిన మాస్టర్స్‌ డిగ్రీ ఉద్యోగానికి ఉపయోగ పడిరది. అంతకు ముందు అఫ్జల్‌ గంజ్‌లోని స్టేట్‌ సెంట్రల్‌ లైబ్రరీలో రోజూ రాత్రి పన్నెండు గంటలవరకు చదువుకోవడం కూడా నా అధ్యయనానికి మెరుగులు దిద్దింది.

జర్నలిస్టుగా నా ప్రస్థానం 1991లో ‘ఉదయం' దినపత్రికలో కె.రామచంద్రమూర్తి శిక్షణలో జర్నలిస్టుగా చేరడంతో ఆరంభమయింది. ఆనాడే పాశం యాదగిరి, కె.శ్రీనివాస్‌, కాసుల ప్రతాపరెడ్డి, అమరుడైన జర్నలిస్టు గులాం రసూల్‌తో కలిసి పనిచేశాను. తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న తర్వాత ఎన్నో విషయాల్ని, ఎందరో వైతాళికుల్ని వివిధ పత్రికల ద్వారా వెలుగులోకి తీసుకురావడమైంది. సోయి సాహిత్య పత్రికతో పాటు, వివిధ దినపత్రికల్లో వ్యాసాలు అనేకం రాయడమైంది. అలాగే గతంలో తెలంగాణ టైమ్స్‌, చర్చ పత్రికలో రెగ్యులర్‌ కాలమ్‌ నిర్వహించి తెలంగాణ వెలుగుల్ని, సామాజిక/రాజకీయ అంశాల్ని వరుసగా ఆ రెండు పత్రికల్లో వెలువరించాను.

నిజాంకు న్యాయంగా దక్కాల్సిన గుర్తింపు దక్కలేదని కేసీఆర్‌ వ్యాఖ్యానించిన సందర్భంగా లెఫ్ట్‌, రైట్‌ అన్ని పార్టీలు మూసగా వ్యతిరేకించాయి. అయితే నేను ఆయన చేసిన వ్యాఖ్యల్లోని వాస్తవాన్ని ఆధారాలతో సహా వ్యాసంగా వెలువరించాను. ఈ వ్యాసాన్ని లక్షలాది కరపత్రాలుగా ముద్రించి, పంచి తెలంగాణ వాదులు మంచి గుర్తింపు తీసుకు వచ్చారు.

రెండు దశాబ్దాల తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో విద్యార్థి సంఘంతో ప్రారంభమైన నడక కొనసాగుతూనే ఉంది. విస్మరణకు గురైన విషయాల్ని, తెలంగాణ ప్రజలు గర్వంగా చెప్పుకోవాల్సిన సంగతుల్ని, మన ఎరుకలో లేకుండా పోయిన తెలంగాణ వెలుగుల్ని అందరికీ అందించే ప్రయత్నం నిరంతరం సాగుతూనే ఉంది. ఈ పనిని ఒక్కడిగా, కొంత మంది మిత్రులతో కలిసి చేస్తూనే ఉన్నాం. నేను వెలుగులోకి తెచ్చిన విషయాలపై ఇప్పటికే వివిధ విశ్వవిద్యాలయాల్లో కొత్తగా పరిశోధనలు జరుగుతున్నాయి. సీనా తనాయించి నాది తెలంగాణ అని చెప్పుకొని గర్వపడి, తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసేందుకు ఎవ్వరేవిధంగా కొట్లాడినా వారందరికీ ముడిసరుకులైన విషయాల్ని అందించేందుకు, ఇంకా చెప్పాలంటే పునాదిగా ఎవ్వరికీ కనిపించకుండా ‘తెలంగాణ సౌధా'న్ని నిలబెట్టేందుకు నా ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది అని ఆత్మధైర్యంతో చెబుతున్నాను.

సాహిత్య, చరిత్ర, సాంస్కృతిక రంగాల్లో చేయాల్సిన కృషి ఇంకా చాలా ఉంది. ఆ పనిని తెలంగాణలోని యూనివర్సిటీలు, అకాడెమీలు, సంస్థలు సంయుక్తంగా చేయాలి. అయితే సంస్థలుగా చేయాల్సిన పనిని వ్యక్తులు, వ్యక్తులుగా చేయాల్సిన పనులు సంస్థలు చేస్తూ ఉండడంతో అసలు అంశాలకు గుర్తింపు లేకుండా పోతోంది. ఈ లోటు తీర్చడానికి వ్యక్తిగా నా ప్రయత్నం కొనసాగుతూనే ఉంటది. బహుశా నా కృషికి గుర్తింపుగా కేంద్ర సాహిత్య అకాడెమీ వారు ‘వట్టికోట ఆళ్వారుస్వామి జీవిత చరిత్ర' రాయడానికి నాకు అవకాశం కల్పించారు. బహుశా ఈ అవకాశం దక్కిన వాళ్లలో నేనే పిన్నవయస్కుణ్ణి అయ్యుంటా! అలాగే బి.ఎస్‌.రాములు గారి షష్టిపూర్తి సందర్భంగా విశాలసాహితి పురస్కారం అందించారు. కథా సాహిత్య సంకలనకర్తగా ఇది నాకు దక్కిన గౌరవంగా భావిస్తాను.

ఎన్నో వ్యయప్రయాసాల కోర్చి ఒక రెండు దశాబ్దాలుగా సెర్చ్‌ చేసి సేకరించిన తెలంగాణ సాహిత్యంలో ఇంకా చాలా విషయాలు వెలుగు చూడాల్సినవున్నాయి. వీటిలో మొదటిది వట్టికోట ఆళ్వారుస్వామి సమగ్ర రచనలు, భాగ్యరెడ్డి వర్మ రచనలు, సురవరం ప్రతాపరెడ్డి కవిత్వం ముఖ్యమైనవి. అలాగే నిజాం చరిత్ర చీకటి వెలుగులు, హైదరాబాద్‌పై పోలీస్‌ యాక్షన్‌అసలు చరిత్ర, తెలంగాణ సాంస్కృతిక చరిత్ర, తెలంగాణ సామాజిక చరిత్ర, సుజాత సూచి (బిబ్లియోగ్రఫీ), వీటితో పాటు గత 20 యేండ్లుగా వివిధ వ్యక్తుల గురించి రాసిన వందల కొలది రైటప్స్‌, వ్యాసాలు పుస్తకాలుగా వెలువడాల్సిన అవసరముంది. ఆ ప్రయత్నం కూడా కొనసాగుతుంది. ఈ ప్రయత్నం ఇలా నిరంతరాయంగా కొనసాగడానికి నా సహచరి స్వర్ణమంజరి, నా పిల్లలు సిరి, శివ అందించే సహకారం నాకెప్పటికీ టానిక్‌లాగా ఉపయోగపడుతది.

ఈ రెండు దశాబ్దాల ప్రస్థానంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా నా వెన్నెముఖ వంచకుండా, జీ హుజూర్‌ అనకుండా, వంచకులకు దాసోహం అనకుండా ఉన్నందునే నన్ను నేను నిలబెట్టుకున్నాను అనుకుంటున్నాను. ఈ ప్రస్థానం ఇలాగే కొనసాగించే ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం ఇవ్వాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు.

- సంగిశెట్టి శ్రీనివాస్‌

English summary
Sangisetty Srinivas name was mingled with the the research of Telangana literature and history. He writes the back ground of his personal evolution.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X