విప్లవోద్యమ నవలలు

BS Ramulu on revulutionary novel
విప్లవోద్యమ నవలల గురించి, వరవరరావు, కాత్యాయనీ విద్మహే, తిరునగరి దేవకీదేవి, ఎన్‌. వేణుగోపాల్‌, కాలువ మల్లయ్య, ముదిగంటి సుజాతారెడ్డి, అనుమాండ్ల భూమయ్య వంటి సాహితీవేత్తలు అనేక కోణాల్లో వ్యాసాలు, పరిశోధనలు, సిద్ధాంత గ్రంథాలు వెలువరించారు. ఒక్కొక్కరు ఇచ్చిన విప్లవోద్యమ నవలల లిస్టులో కొన్ని తేడాలున్నాయి. తిరునగరి దేవకీదేవి తన పి.హెచ్‌డి. లో ఇరవైవొక్క నవలలను పేర్కొన్నారు. వరవరరావు తెలంగాణ రైతాంగ నవలల్లో ఆరు మాత్రమే తీసుకొని పి.హెచ్‌డి. చేశారు. కాత్యాయనీ విద్మహే అనేక నవలలను చర్చకు తెచ్చారు. ఎన్‌. వేణుగోపాల్‌ ఇరవై నవలలను విప్లవ నవలలుగా పేర్కొన్నారు.

విప్లవం గురించి రాసే మరికొన్ని నవలల గురించి కూడా చెప్పుకోవడం అవసరం. ఈ నవలలు విప్లవోద్యమం గురించి అవగాహన పెద్దగా లేకపోయినా కొన్ని చదివి, కొన్ని పత్రికల వార్తలు, సంఘటనలు, చూసి, విని తమకు తోచిన కాల్పనిక సంఘటనలతో, సన్నివేశాలతో కాల్పనిక పాత్రలతో రాసిన నవలలు. వీటిని విప్లవోద్యమ ప్రభావంతో వెలువడిన సాధారణ నవలలు, కాల్పనిక నవలలు అని చెప్పవచ్చు. వీటిలో విప్లవోద్యమాన్ని వ్యతిరేకించే కోణంతో రాసే నవలలు కూడా ఉంటాయి.
నేను రాసిన 'బతుకుపోరు' నవల విప్లవోద్యమంలో భాగంగా రాశాను. జగిత్యాలలో విప్లవోద్యమం విస్తృతంగా సాగుతున్న క్రమంలో అందులో విరసం సభ్యుడిగా, పౌరహక్కుల సంఘం కార్యదర్శిగా, క్రియాశీల కార్యకర్తగా పనిచేస్తూ, బీడీ కార్మిక రంగంలో విప్లవోద్యమం ప్రవేశించి పనిచేసిన క్రమాన్ని ఈ నవలలో చిత్రించాను. ప్రజల జీవితం, సంస్కృతి చిత్రిస్తూ, అందులో భాగంగా సి.పి.ఐ. నాయకత్వంలో ఉన్న కార్మికులను ఎలా విప్లవ నాయకత్వంలోకి తీసుకువచ్చారో చిత్రించడం జరిగింది. అయితే ఈ నవలలో ప్రజలు ప్రధానం. వారి జీవితంలో విప్లవ నాయకత్వం, విప్లవ చైతన్యం ప్రవేశించడం పర్యవసానంగా చిత్రించబడింది. 'అడవిలో వెన్నెల' కథలో కూడా నేను గోండు గిరిజన జీవితాన్ని, సంస్కృతిని చిత్రిస్తూ అందులో భాగంగా ఉద్యమకారులు వారి జీవితాల్లోకి ఎలా ప్రవేశించారో, పర్యవసానంగా చిత్రించాను.

విప్లవోద్యమంలో పనిచేసే ఎందరో నాతోపాటు దాశరథి రంగాచార్య, తాడిగిరి పోతరాజు, అంపశయ్య నవీన్‌, ఎం.వి. తిరుపతయ్య, అల్లం రాజయ్య మొదలైన రచయితలెందరికో సహచరులు, క్లాస్‌మేట్స్‌, మిత్రులు, పరిచయస్థులు, ఉండటంవల్ల వారు వారిగురించిన పరిణామాలు చైతన్యం పెంచుకున్న తీరు, ఉద్యమాల్లో పాల్గొన్న తీరు, అతి సమీపంగా పరిశీలించే అవకాశం సహజంగా ఉంటుంది. ఇది వీరి నవలలకు వాస్తవికతను మరింత పెంచుతుంది. సామాజిక పరిణామాల ఉద్యమ పరిణామాల చిత్రణలో సామాజిక చరిత్రగా ఆయా నవలలకు ప్రాధాన్యత పెరుగుతుంది.

దాశరథి, అంపశయ్య నవీన్‌, కాలువ మల్లయ్య, పి. చంద్‌ యాదగిరి మొదలైనవారి నవలలను, నేను రాసిన 'బతుకుపోరు' నవలను, అవి విప్లవోద్యమ ప్రభావంలో వెలువడిన నవలలు అని వర్గీకరించడంతోపాటు సామాజిక పరిణామాల, సామాజిక చరిత్ర, మానవ సంబంధాల పరిణామాలను, చిత్రించిన సామ్యవాద వాస్తవికత నవలలు అని పేర్కొంటారు.

స్త్రీల కోణంలో విప్లవ నవలల గురించి మరికొంచెం:

జయధీర్‌ తిరుమలరావు ఉద్యమ నవలల గురించి, ప్రత్యేకదృష్టితో ఇలా పరిశీలించారు. 'తెలంగాణా రైతాంగ పోరాటం ప్రభావంతో మొత్తం 21 నవలలు వచ్చాయి. ఒక సంఘటనని ఆధారం చేసుకొని ఇన్ని నవలలు రావడం విశేషమే. అంటే ఈ పోరాటం తెలంగాణా, తెలంగాణేతర ప్రాంత రచయితలను అంతగా ఆకట్టుకొంది. కొన్ని నవలల్లో కొన్ని ఉదంతాలు కల్పితాలు కాగా కొన్ని చాలా వాస్తవికంగా ఉన్నాయి. వాటిలోని సంఘటనలు నిజజీవితంలో జరిగినవే. ఒకటీ అరా నవలలు స్త్రీలు రాయగా మిగిలినవన్నీ పురుషులు రాసినవే. స్త్రీలు రాసిన నవల పూర్తిగా స్త్రీ దృక్పథం నుండి రాసినదని చెప్పలేం. ఇకపోతే ఈ నవలల్లో పురుష స్వామ్య దృక్పథమే అధికం. అందుకే పోరాట వీరులలో విద్యాధికులు, ఉన్నత కులవర్గాలకి సంబంధించిన వారే ఎక్కువగా కనిపిస్తారు. ఆనాడు పై చదువులు చదువుకున్న స్త్రీలు ఎక్కువగా లేరు. పైగా ఈ పోరాటంలో త్యాగాలు చేసి మరణించినవారు ఎక్కువగా అట్టడుగు వర్గాల స్త్రీలే. వీరిలో మరణించిన చాలామంది స్త్రీల జీవితాలు అజ్ఞాతమే. అలాంటి వారిలో చిలకమ్మ ఒకరు. ఆవిడ చరిత్ర స్త్రీలు పాడుకునే ఒక ఉయ్యాల పాటవల్ల మాత్రమే తెలుస్తున్నది. ఉజ్జ్వలమైన పోరాటంలో సద్యఃస్ఫూర్తితో పాల్గొన్న అటువంటి అనేకమంది స్త్రీల గురించి ఇంకా సమాచారం సేకరించవలసే ఉంది. ఆయా పార్టీలు / గ్రూపులు / నాయకులు తమకు తెలిసిన లేదా తమకు అందిన సమాచారం మాత్రమే ఇచ్చారు. 'అన్వేషి' వంటి సంస్థలు కొద్దిమంది మహిళల వద్దకు వెళ్ళి ఇంటర్వ్యూలు చేసారు. అదొక మంచి ప్రయత్నం. నిజానికి ఈ మహిళల సమగ్ర పోరాట చరిత్ర నిర్మించవలసే ఉంది.

ఉద్యమంలో ఇలాంటి స్త్రీలు నెరపిన పాత్ర మూడు రకాలుగా కనిపిస్తుంది.

1. వైయక్తిక పోరాటం, 2. సామూహిక పోరాటం, 3. ఆయుధ పోరాటం.

చాలామంది స్త్రీలు భూమి భుక్తి కోసం పోరాడారు. తరతరాల దొరల ఆగడాలను ప్రతిఘటించారు. కరణాల వంటి గ్రామాధికారుల అసలు రూపాన్ని బట్టబయలు చేశారు. సాటి స్త్రీలపై అత్యాచారాల్ని ఆపారు. పదిమంది కలిసి ఐక్యంగా శత్రువుని దెబ్బతీశారు. కొరియర్లుగా పనిచేశారు. డెన్నులు నడిపారు. వంటలు చేసి వడ్డించారు.

స్త్రీలు భూస్వాముల, వారి బంటుల నడ్డి విరిచారు. కాని భూస్వామ్య సంస్కృతిని ఎలా దెబ్బకొట్టాలో వారికి పార్టీ నిర్మాణం గాని, మార్క్సిస్టు మేధావులు గాని రచనల ద్వారా, కరపత్రికల ద్వారా ఇతరత్రా ఎక్కడా చెప్పలేదు. ఎవరైనా చెప్పి వుంటే ఈనాటికి కొంత ఫలితం సాధించి ఉండేవారు. గ్రామీణ పెత్తందారీ విధానాన్ని ఆచరణరీత్యా బలహీనపరచడానికి ఆస్కారం ఉండేది. కొన్నిచోట్ల ఈ ప్రయత్నం అప్రయత్నంగా జరిగినా పురుష రచయితలు వాటిని పట్టించుకోలేదు. పైగా ఈ రచయితలు పురుషుల పోరాటానికి కాల్పనికవీరత్వం జోడించారు. స్త్రీల పాత్రని మాత్రం ఉన్నదానికన్నా తగ్గించి రాశారనిపిస్తోంది. అందుకు కారణం - స్త్రీలు నాయకత్వ స్థానంలో ఏనాడూ లేకపోవడం
'ప్రజల మనిషి'లో బ్రాహ్మల పొలం కౌలు చేసుకుంటుంటే జప్తు చేయాలని ప్రయత్నించినప్పుడు అంతమ్మ చాకలి ఐలమ్మలా ఎదురు తిరిగి పోరాడుతుంది. 'చిల్లరదేవుళ్ళు'లో కరణం వెంకటరావు తన భార్య మంగమ్మపై మొదటి మూడు రాత్రులు వరసగా బలత్కారం చేస్తాడు.

'భోగం' వాళ్ళతో గడుపుతూ చెడు తిరుగుళ్ళు తిరిగే ఈ కరణం లాంటివారు - ''ఆనాటి గ్రామాధికారులు, దొరల విలాసవంతమైన జీవితాన్ని అక్షరాల అనుసరించడానికి గ్రామాధికారులు శ్రామిక స్త్రీలను అనుభవించడానికి'' ప్రయత్నించేవారు. ''కామంతో వేగిపోతున్న కరణం కొత్తగా పెళ్ళై వచ్చిన గౌండ్ల వీరిగాడి భార్య పుల్లితో అక్రమ సంబంధం కొనసాగించాడు. నవలల్లో చిత్రితమైన ఇలాంటి సంఘనలు ఆనాడు గ్రామాల్లో కరణాలు చేసిన దౌర్జన్యాలకి అద్దంపడుతాయి. నిజానికి జమీందార్లు, జాగీర్దార్లు, జాగీర్దార్లలో రెడ్లు, వెలమలే కాదు బ్రాహ్మలు కూడా ఉన్నారు. వీళ్ళను అంటిపెట్టుకుని ప్రజలపై దౌర్జన్యం చేసిన కరణాలు లెక్కకు మించి ఉన్నారు. భూమి రాతకోతలు, కొలతలు, పన్నుల వసూలు వంటి పనులు చేయడానికి నియుక్తమైన కరణీక వ్యవస్థ తెలంగాణాలో భూస్వామ్యానికి పట్టుగొమ్మలా పనిచేసింది. దొరలపేరుతో వీళ్ళు చేసిన అక్రమాల చిట్టా అనంతం. భూస్వామి ఏ కులం అయినా కరణానిది మాత్రం ఒక్కటే కులం. శ్రామిక వర్గాలని రాచిరంపాన పెట్టడం. భూస్వామి చేసే ప్రతి ఆగడానికి కరణం మద్దతు పూర్తిగా ఉండేది. ''భూస్వామి కోపం చారానా కరణం కసి బారానా'' వంటి నానుడులు కోకొల్లలు ఉన్నాయి. గ్రామాల్లో భూమిని, స్త్రీని పరాయి పాలు చేయడంలో వీళ్ళ పాత్ర అధికం.

''కమ్యూనిస్టు పార్టీలోని మితవాద బ్రాహ్మణ మేధావులు 'భూస్వామ్య వ్యవస్థ' అనే పదాన్ని తెలివిగా సాధరణీకరించి వాడారు. దానిని నిర్దిష్టంగా నిర్వచించకపోవడం వల్ల ఆ వ్యవస్థలో విడదీయరాని భాగాలైన కరణాలు, పటేలు, పట్వారీల వాస్తవ పాత్రని పక్కన పెట్టడం జరిగింది. అందువల్ల భూస్వామ్య గ్రామాధికార వ్యవస్థ దౌష్ట్యాన్ని నిర్దిష్టంగా, లోతుగా అర్థం చేసుకోలేకపోయాం. ఈ పెత్తందారీ కులాల స్వభావాన్ని కూడా బేరీజు వేసుకోలేక పోయాం. ఇలాంటి పోకడలకు స్వభావానికి పితృస్వామ్య భావజాలం తోడ్పడింది. శ్రామిక కులాల నుండి వచ్చిన అతికొద్ది నాయకులు కూడా ఆ వ్యవస్థలో దాగిన కఠోర వాస్తవాల్ని విప్పి చెప్పలేకపోయారు. ఆ రకంగా యథాతథ సామాజిక చట్రం అవగాహన నేటికీ అలాగే కొనసాగుతోంది. ఈ కారణాల వల్ల కరణాలకి, గ్రామాధికారులకి వ్యతిరేకంగా జరిపిన స్త్రీల పోరాట చరిత్ర నమోదు కాలేదు. ఆ విధంగా ఎన్నో సంఘటనలు నొక్కివేయబడ్డాయి. అజ్ఞాతం చేయబడినాయి. విచిత్రం ఏమంటే కమ్యూనిస్టులుగా, నాయకులుగా, చెలామణి అయిన ఈ వర్గాల నాయకులు తమ స్త్రీల పోరుపటిమని కూడా ఆ తరువాతి కాలంలో పట్టించుకోలేదు. ఎక్కడ తమ పురుషాధిపత్య అహంకారం గుట్టు బయట పడిపోతుందోనని భయపడ్డారు కూడా.

శ్రమశక్తుల వర్గం నుండి వచ్చిన స్త్రీల పోరాటం ఎంతో సాహసికమైనది. అసమాన త్యాగాలతో కూడినది. ఈ పోరాట చరిత్ర శిష్టవర్గాల వారు నమోదు చేయకున్నా తమ పాటల్లో స్త్రీలే నమోదు చేసుకుని నేటికీ మౌఖికంగా పాడుకుంటున్నారు. ఆ రకంగా వీరత్వం మూర్తీభవించిన నారీమణుల గురించి వారే ప్రచారం చేసుకోవలసి వచ్చింది.

రచయితలు, తత్వవేత్తలు, నాయకులు, శిష్టవర్గాల వారే కావడం వల్ల పోరాటాన్ని వాళ్ళ దృక్పథం నుండే ఎక్కువగా వీక్షించారు. సమీక్షించారు. గుణపాఠాలు తీసుకున్నారు. పైన పేర్కొన్న విభాగాల్లో శ్రమశక్తులు చాలా తక్కువ. స్త్రీలు అసలే లేరు. పోరాటం ఏ సామాన్య ప్రజల జీవనం బాగుకోసం జరిగిందో వాళ్ళకి సరైన ప్రాధాన్యత లభించలేదు. ఆ శక్తులు లేకపోవడం వల్ల సాంఘికరంగంలో విజయం సాధించలేకపోయామనే అతిచిన్న విషయాన్ని ఇంతకాలం తరువాత కూడా నాయకత్వం తెలుసుకోలేకపోయింది.

ఎన్నో పోరాటాల అనంతరం కూడా కమ్యూనిస్టు పార్టీల ధోరణుల్లో మౌలికంగా మార్పులేకపోవడం వల్ల సాధించిన విజయాల సంఖ్య తగ్గిపోతున్నది. ఎక్కడైతే పోరాటాలు జరిగాయో అక్కడే భూస్వామ్యం లోతుగా పాతుకుపోతున్నది. పెట్టుబడి ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నది. అక్కడే భూమి పరాయిదైపోతున్నది. లేదా పడావు పడిపోతున్నది. ఆ అడవులే గిరిజనేతరుల చేతుల్లోకి పోతున్నది. పోరాడిన స్త్రీలపై లైంగికాంశాల విషవలయాలు ముసురుకుంటున్నాయి. ప్రజలపై అణచివేత మరింత అధికం అవుతున్నది.

విచిత్రం ఏమంటే అంతపెద్ద పోరాటం - ఏడేళ్ళపాటు నడిచినా పై వర్గాల నాయకులకి వందల ఏళ్ళ నుండి పాతుకుపోయిన దేవదాసి, జోగిని, మాతంగి, శివపార్వతులు, బసివి, అడబాప, దాసి వంటి వ్యవస్థలు కనిపించలేదు. అలాంటి వేలాదిమంది స్త్రీల ఆర్తనాదాలు వినిపించలేదు. ఆడబాప విధానాన్ని అంతమొందించడానికి కూడా నాయకులు ఎక్కడా ప్రయత్నించలేదు. రచయితలు నవలల్లో వారిని పాత్రలుగా మాత్రమే అక్కడక్కడ వర్ణించారు. కాని విధానాన్ని ఒక వ్యవస్థగా ఖండించలేదు.
'చిల్లరదేవుళ్ళు' నవలలో వనజ తల్లిని దొర బలవంతంగా ఆడబాప చేశాడు. ఆమె బతుకంతా లైంగికబానిసగా దొర గడిలోనే ఉండిపోయింది. ఆమె కూతురు వనజ కూడా ఆడబాపే. 'గంగు'లో నీలవేణి ఆడబాపే. 'మలుపు తిరిగిన రథచక్రాలు' నవలలో మాలతి, కస్తూరి వీరిద్దరు ఆడబాపలే. వీళ్ళంతా తక్కువ కులం స్త్రీలే. ఏకకాలంలో శ్రమ - లైంగిక హింసిక, దోపిడికి గురికావడం కన్నా మరో హింస ఏముంది. అలాంటి వ్యవస్థను పట్వారీలు, కరణాలు కూడా ప్రోత్సహించారు. 'విప్లవ జ్వాల' నవలలో రజాకారు నాయకులు రాజమ్మ, తాహేరాబీలను బలవంతంగా ఉంపుడు కత్తెలుగా మార్చారు. 'మృత్యుంజయలు' నవలలో తాము వెళ్ళిన ఒక ఊళ్ళో చూడమ్మ అనే ఆవిడని దేశ్‌ముఖ్‌ బలవంతంగా తన ఉంపుడుగత్తెగా చేసుకున్నాడు.

భూస్వామ్య విధానం సృష్టించిన స్త్రీ వ్యతిరేక వ్యవస్థలని నిర్మూలించడానికి పార్టీలోని ప్రగతిశీల మార్క్సిస్టు తత్వవేత్తలు, రచయితలు ఎందుకు ముందుకు రాలేదో ఈనాటికీ అర్థంకాదు. పోరాటానికి ముందో, తత్కాలమో, ఆ తరువాతో వీటిని సంస్కరించడానికో, తుదముట్టించడానికో లేదా ఆ సమస్యపై చర్చించడానికో ప్రయత్నించక పోవడం శోచనీయం. అసలీ వ్యవస్థల వల్ల వేలాది మంది స్త్రీల బతుకులు ఛిద్రమవుతున్నాయన్న ధ్యాస లేకపోవడం మరీ విచిత్రం. సాంఘిక, సామాజిక రంగంలోని పలు సమస్యలను గుర్తించడంలో, పరిష్కరించడంలో ఎందుకు మౌనం వహించాల్సి వచ్చిందో అర్థం కాదు. ఆర్థిక సమస్యలను చర్చించడంలో, ఉద్యమించడంలో గల సౌలభ్యం సాంఘిక రూపాలలో సాగే శ్రమ - ఆర్థిక దోపిడీ రూపాలను గుర్తించడంలో లేదు.

సాఘింక, సాంస్కృతిక రంగంలోని ఆధిపత్య భావజాల శక్తుల సుదీర్ఘ నాయకత్వం భారతీయ గ్రామీణ వ్యవస్థలోని సాంఘిక దోపిడీ వ్యవస్థ రూపాలను పసిగట్టడంలో సఫలం కాలేదు. నిజానికి ఈ భూస్వామ్య దోపిడీ చట్రాన్ని అతి తెలివిగా నిర్మించింది. తిరిగి అదే వర్గాలకు చెందిన ప్రగతివాదులు దాన్ని గుర్తించి కూలదోయడానికి ప్రయత్నించలేదు. రాగలిగిన దళిత, శ్రమశక్తులను నయానో భయానో అడ్డుకున్నాయి. వారి ఆలోచనలను అటుగా పోనివ్వలేదు. అలాంటి శక్తుల చేష్టలపై రాజకీయ నాయకులకి ఏనాడూ పట్టులేకపోవడం గుర్తించాలి.

గ్రామీణ రంగంలో పనిచేస్తూ ఇలాంటి అంశాలను పార్టీ దృష్టికి తీసుకురావాల్సిన సాంస్కృతిక రంగ మేధావుల సుదీర్ఘ నిర్వీర్యతను గుర్తించలేదు. ఈ కారణాల వల్ల స్త్రీల సమస్యలని పోరాటానంతరం శిష్ట పరిశోధకులు కూడా గుర్తించడంలో విఫలమయ్యారు. కేవలం అకడమిక్‌ మార్క్సిస్ట్‌ చట్రంలో మునిగితేలడం వల్ల తెలుగు నవలా పరిశోధనలు రాజకీయ దృక్పథానికే, పైపై సామాజిక కోణాలకే పరిమితమయ్యాయి. ఇటువంటి సామాజిక కోణాలను, సమస్యలను గుర్తించే దార్శనికత శిష్టవర్గ పరిశోధకుల్లో, నవ్య ప్రజాస్వామిక సాంస్కృతిక రంగం గురించి మాట్లాడే శక్తుల్లో కుంటువడింది. అందువల్లే భారతదేశంలో విప్లవం సాఫల్యం కాలేదు. అసలు సిసలు భావవిప్లవం కూడా మొదలు కాలేదు. ఈ శక్తుల ప్రమేయం ఉన్నంతకాలం అది సాధ్యం కాదు కూడా''. (తెలంగాణ విమోచనోద్యమ నవలల్లో స్త్రీ చైతన్యం, తిరునగరి దేవకీదేవి పి.హెచ్‌డి., ముద్రణ 2008లోని జయధీర్‌ తిరుమలరావు ముందుమాట)

- బియస్ రాములు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+