భాషోద్యమ నేత ధర్మారావు మృతి

సి ధర్మారావుగా అందరికీ సుపరిచితులైన ఆయన హైదరాబాదులోని చైతన్యపురిలో నివాసం ఉంటున్నారు. ఆయన కృష్ణా జిల్లా పెద్దఅవుటపల్లిలో 1934 మార్చి 30వ తేదీన జన్మించారు. ఆయన రవ్వలుపువ్వులు, ప్రేమించుకుందాం రండి పుస్తకాలు తెచ్చారు. గోరాశాస్త్రి, ఇస్మాయిల్, ఎఆర్ కృష్ణ షష్టిపూర్తి ఉత్సవాల సంచికలు, మనస్వి చలం శత జయంతి సంఘం ప్రత్యేక సంచికను ప్రచురించారు. జనహిత సంస్థ తరఫున ఆయన 1990లో 103 మంచి తెలుగు పుస్తకాల జాబితాను రూపొందించారు.
ప్రముఖ రచయిత్రి కమలాదాస్ మై స్టోరీని దేవీప్రియ సంపాదకత్వం వహించిన తెలుగు ప్రజాతంత్రలో ధారావాహికగా వెలువరించారు. ధర్మారావు రాష్ట్ర సచివాలయంలో పనిచేశారు. అధికార భాషా సంఘం కార్యదర్శిగా పనిచేశారు. గన్నవరం హైస్కూలు, ఏలూరు కాలేజీ, ఆంధ్ర, ఉస్మానియా విశ్వవిద్యాలయాల్లో ఆయన విద్యాభ్యాసం సాగింది. కాలమిస్టుగా, వ్యాసకర్తగా తెలుగు పత్రికా ప్రపంచంలో ఆయన చిరపరిచితులు. ఆయన భౌతికకాయానికి బుధవారం అంబర్‌పేట శ్మశానవాటికలో అంత్యక్రియలు జరుగుతాయని కుమారులు సి శ్రీనివాసరావు, సి. రామోహన్ రావు చెప్పారు.
ఎమ్మెల్సీ చుక్కా రామయ్య ఆయన మృతదేహాన్ని సందర్శించి, నివాళులు అర్పించారు. అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ సి. ధర్మారావు భౌతిక కాయాన్ని సందర్శించి, సంతాపం ప్రకటించారు. ప్రముఖ కవి యాకూబ్ సి. ధర్మారావు మృతికి సంతాపం ప్రకటించారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!