వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మన 'తెలుగు' భాష : మనిషికోమాట

By Pratap
|
Google Oneindia TeluguNews

"అసమాన ప్రియ నీతివర్తనము, ప్రాణాంతంబునందు౯ మలీ
మనమగ్రాహ్య, మదుష్టయాచన, మసంపత్ప్రార్థనాభావము౯,
వ్యసనావాప్తిని ధైర్యముం, బుధజనాత్యంతానుకూలత్వ; మీ
యసిధారావ్రతచర్యయెవ్వడు మహార్యశ్రెణికిం దెల్పెనో"!
నీతివంతమైనజీవితం గడుపుట, ప్రాణాపాయస్థితిలోనైనా చెడ్డపనులు చేయకుండుట, చెడ్డవారి సహాయం కోరకుండుట, మంచివాళ్ళకు అనుకూలముగానుండుట మొదలైనవి 'మహార్యశ్రేణికిన్" అంటే 'జెంటిల్మెన్ (పెద్దమనుషుల)'కి సహజంగా ఉండే లక్షణాలని సంస్కృతంలో భర్తృహరి చెప్పినదానిని ఏనుగులక్ష్మణకవి పైపద్యంలొ తెలుగున అందరికీ అర్ధమయ్యేలా చెప్పాడు.

"తెలుగువాళ్ళకే స్వంతమైన పద్యాలను పెద్దలు నేర్చుకోండి, పిల్లలకి నేర్పించండి" తద్వారా "తెలుగుతల్లి ఉనికిని కాపాడండి" అని గానగంధర్వుడు మన యస్ పి బాలసుబ్రహ్మణ్యం వారంవారం తీయగా పాడుతూ చెబుతూ ఉంటారు. తెలుగుభాష మనుగడే ప్రశ్నార్థకం కావడానికి ముఖ్యకారణం మన 'డైలీలైఫ్'లో, క్షమించాలి, మన దైనందిన జీవితంలో తెలుగు వాడకం క్రమక్రమంగా తగ్గిపోతూరావడమే.

అందుకే చాలామంది పండితులు కూడా తెలుగులోనే మాట్లాడుతూ మనభాషను బతికించండి అని మనందరికి చెబుతూంటారు. ఈసమస్య మన తెలుగుకే పరిమితం కాలేదు. ప్రపంచంలో చాలాభాషలు దీనావస్థలో ఉండటం గుర్తించి ఐక్యరాజ్యసమితి ఫిబ్రవరి 21ని మాతృభాషాదినంగా ప్రకటించింది. గత పదిహేనేళ్ళుగా ఈ అంతర్జాతీయ మాతృభాషాదినాన్ని జరుపుకుంటున్నా మిగతాభాషల సంగతేమోగాని, తెలుగువారిమీద దాని ప్రభావమేమీలేదనే చెప్పాలి. దీనికి తార్కాణం ఈమధ్య నాకెదురైన అనుభవాలే.

ఒకసారి ఒక 'మహాంగడి' (సూపర్ మార్కెట్)కి వెళ్ళి కందిపప్పు కావాలని అక్కడున్నఅమ్మాయి (తెలుగుపిల్లే) నొకెత్తెను అడిగితే, ఆపిల్ల "ఓ తూర్ దాలా సార్, ఇదిగోండి" అని తీసి ఇచ్చింది. ఇంకొకసారి అలాంటి అంగడిలోనే బీరకాయలు కొని 'గల్లాబల్ల' (క్యాష్ కౌంటర్) దగ్గర డబ్బు ఇవ్వబోయాను.

అప్పుడక్కడున్నపిల్ల (మళ్ళీ తెలుగుపిల్లే) నా చేతిలోని కాయల ధర తెలియక "ఈ రిట్జ్ గోర్డ్" (Ridge gourd) ‘రేటెంతో' చెప్పమని పక్కనున్న తన సహోద్యోగినిని అడిగింది. నేను అవాక్కయ్యాను. ఇక కుతూహలం చంపుకోలేక అక్కడ గోడలకమర్చిన అరలలో చూశాను. పప్పులు, ఉప్పులు ప్లాస్టిక్ పొట్లాలలో అందంగా అమర్చి ఉన్నాయి. వాటిలో కొన్నిటి మీద 'మూంగ్ దాల్' (Green gram) అని, కొన్నిటి మీద 'ఊరద్ దాల్' (Black gram-split) అని, మరి కొన్నింటి మీద 'చన్నా దాల్' (Bengal gram) అని ఆయాపొట్లాలలో ఉన్న వస్తువుల హిందీపేర్లు, ఇంగ్లీషుపేర్లు రోమన్ లిపిలో రాసి ఉన్నాయిగాని ఒక్కపొట్లం మీదా పెసరపప్పు అనిగాని, మినపపప్పు అనిగాని, శనగపప్పు అనిగాని రాసిలేదు. ఇక కూరగాయల సంగతి సరేసరి, 'ఓక్రా'లు, 'బైంగన్'లు ఉన్నాయిగాని, మన బెండకాయలు, వంకాయలు లేవు.

 Madhusudan Rao on the usage of Telugu languager

ఒక్క మాట్లాడే భాషేకాదు మనం పెట్టుకొనే పేర్లు, వేసుకొనే బట్టలు, మనం తినే తిండి కూడా అన్యదేశ్యాలై పోతున్నాయి. సుబ్బలక్ష్మి, కనకదుర్గలు పోయి మౌనిక, అనూషలు; సుబ్బారావు, సత్యనారయణలు పోయి నిహాల్, రోహితులు వచ్చాయి. చీరకట్టు, పంచచుట్టు పోయి పంజాబీడ్రెస్సులు, కాశ్మీరీ షేర్వాణీలు వచ్చాయి. చిరుతిళ్ళైన పుణుగులు, బజ్జీలు పోయి ధోక్లాలు, చాట్ మసాలాలు వచ్చాయి. అలాగే పెళ్ళిపేరంటాలలో పప్పన్నంబదులు 'ఫ్రైడ్ రైస్', పనీర్ మసాలాలు, ముఖ్యమయ్యాయి. ఆఖరికి తెలుగు సినిమాలలో పాటలు సైతం ఇంగ్లీషు, హిందీపదాలతో నిండిపోతున్నాయి. ఈవిధంగా ఇంగ్లీషు, హిందీల తాకిడికి తట్టుకొని మనభాష అనవసరమైన అన్యపదాలతో సంకరం కాకుండా, తెగులు పట్టని తెలుగులాగా బతికి బట్టకట్టాలంటే గట్టిప్రయత్నమే చేయాలి. ఒక్క వ్యక్తులే కాకుండా మన ప్రసార మాధ్యమాలుకూడా సహకరించాలి. అసలు ఈ సమస్య కొత్తగా వచ్చిందేమీ కాదు. సుమారు యాభై అరవై ఏళ్ళ క్రితమే ప్రముఖ రచయిత కొడవటిగంటి కుటుంబరావు ఒక సందర్భంలో, "ఆశీర్వదించడానికి సంస్కృతమూనూ, తిట్టడానికి ఇంగ్లీషూ అయితే మరి మన తెలుగెందుకు? కూరలు బేరం ఆడుకోడానికా'? అని బాధపడ్డారు. ఆయన ఇప్పుడు ఉండిఉంటే సంస్కృతంకూడా పోయి శాపనార్థాలకే కాకుండా దీవెనలకీ ఇంగ్లీషే వాడుతున్నందుకు సంతోషించేవాడో, లేక తెలుగు మరింతగా వెనకబడుతున్నందుకు విచారించేవాడో తెలియదు.

పెనుప్రమాదంలో ఉందనుకుంటూన్న తెలుగును రక్షించుకోవాలంటే తెలుగువారికే స్వంతమైన పద్యాలవల్లే సాధ్యమని, ఆ పద్యాలను ముందస్తుగా పెద్దలు నేర్చుకోవాలని మన 'పాటలమేటి' ఆలోచన కాబోలు. కారణాలేమైనప్పిటికీ, ఒకప్పటి పెద్దలకిలాగా నేటి పెద్దలకి పద్యఙ్ఞానం దరిమిలా భాషాజ్ఞానం అంతగా అబ్బినట్లులేదనటంలో అతిశయోక్తిలేదేమో.

అలాంటప్పుడు వీరి పిల్లల, అంటే నేటి బాలబాలికలు, రేపటి పౌరుల సంగతి చెప్పేదేముంది? వారి తెలుగు కలగూరగంపలాగా ఉండటంలో ఆశ్చర్యమేముంది? అందుకే కాబోలు పెద్దల్ని ముందర నేర్చుకోమన్నది. పిల్లలదేముంది ఏమిచెబితే అదివింటారు, ఏమినేర్పితే అది నేర్చుకొంటారు. వాళ్ళు వట్టి అమాయకులు. విన్నదే నిజమనుకొంటారు, చూసిందే సత్యమనుకొంటారు. ఈమధ్య ఒక మూడునాలుగేళ్ళపిల్ల వీధిలో పాలవాడు గేదెనుంచి పాలు పితుకుతూండటం చూసి తన తల్లిని 'అమ్మా గేదెలు కూడా పాలిస్తాయా' అని అమాయకంగా అడిగింది. ప్లాస్టిక్ సంచుల్లోంచీ, అట్టపెట్టెల్లోంచీ మాత్రమే పాలురావడం చూసిన ఆపిల్ల అలాఅడగడంలో ఆశ్చర్యమేముంది?(వెనకటికి అలాంటి పిల్లవాడే ఒకడు వెన్న తెల్లగా కూడా ఉంటుందా అని అడిగాడట). దానికి ఆ పిల్లతల్లి అవునమ్మా ఒక్క గేదెలే కాదు ఆవులూ, మేకలూ కూడా పాలిస్తాయి; ఆపాలుతాగి పెరిగిపెద్దయిన మనుషులలో కొంతమంది 'పెద్దమనుషులు'గా చలామణి అవుతూ పెత్తనం చలాయిస్తూ ఉంటారు అని అంది.

అసలీ పెద్దమనుషులంటే ఎవరు? విద్యావంతులై, నాగరకత కలిగి మర్యాదకల (educated, civilized and well-mannered gentlemen) వారిని పెద్దమనుషులని అంటారని నిఘంటువులు చెబుతున్నాయి. అలాంటి 'మహార్యశ్రేణికి' నీతివర్తనము, మలీమనమైన(పాపపు) పనులు చేయకుండుట లాంటి లక్షణాలు సహజంగానే ఉండి ఉండాలని పైనఇచ్చిన పద్యంలో చెప్పబడింది. అలాగైతే మరి మనచుట్టూ పెద్దమనుషులుగా తిరుగుతూ పెత్తందారులైన అనేకమంది పాలనాధికారులకి, వ్యాపారవేత్తలకి, రాజకీయనాయకులకి ఈ మహార్యశ్రేణికి ఉండవలసిన గుణాలు వారు మాట్లాడే మాటలవల్లగాని, చేస్తున్నారనుకుంటూన్న చేష్టలవల్లగాని ఉన్నట్లుగా అనిపించటంలేదని అందరూ అనుకుంటున్నదేగా! శతకకర్త పెద్దమనుషులకుండవలసినట్లు చెప్పిన లక్షణాలు లేని ఈ పెద్దమనుషులని సినిమాకవి కొసరాజుగారు
"పరమ గురుడు చెప్పినవాడు
పెద్దమనిషి కాడురా,
పెద్దమనిషి అంటేనే
బుద్ధులన్ని వేరురా"
అని వర్ణించారు. అలాగే వీరి బుద్ధులన్నీ పైకికనపడినట్లుగా ఉండవు. ఆమాటకొస్తే న్యాయంగానూ, ధర్మంగాను ఉండటం 'అసిధారావ్రతచర్య' అని పైపద్యంలోనే ఉంది. అంటే నీతిగానూ, నిజాయితీతోనూ ఉండటం కత్తిమీదసాములాంటిది. ఈమాట 'మంచిగా(ధర్మంగా) ఉండటంలో కష్టం' (Difficulty of being good) అనే గ్రంథంలో గురుచరణ్ దాస్ గారు చాలా వివరంగా విశ్లేషించారు. అందుకనే కాబోలు మన పెద్దమనుషులు, నూటికినూరుపాళ్ళు ధర్మంగా ఉండటం ఆ ధర్మరాజుకే సాధ్యం కాలేదు, మనమనగా ఎంత అనుకుని దాని జోలికే పోదల్చుకోనట్లుగా ఉంది. వెనకటికి ఒకాయన న్యాయస్థానంలో సాక్ష్యం ఇవ్వడానికి వెళ్ళి అంతా నిజమే చేప్తానని ప్రమాణం చెయ్యమంటే, 'మేమందరం ఇలా పెమానికాలూ అవీ చేసేసి నిజాలు చెప్పేస్తూ ఉంటే మీరెందుకు, ఈకోర్టులెందుకు; అసలు యవ్వారాలెల్లా నడుస్తాయి' అని విసుక్కున్నాడుట. అలా అందరూ నీతిగా, నిజాయతీతో ఉండి, ధర్మం నాలుగుపాదాలతో నడుస్తూంటే నీతిశతకాలూ అక్కరలేదు, పురాణప్రవచనాలూ అవసరం లేదు. భూతలం స్వర్గం అయిపోదూ!

కాని పరిస్థితి వేరేవిధంగా ఉంది. "ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం" అన్నట్లుగా దేశంలో ఏపత్రిక తెరచిచూసినా మూడు కుంభకోణాల, ఆరు అవినీతి, అత్యాచార వార్తలు లేని రోజు ఉండటంలేదు. "కావేవీ కవితకనర్హం" అని అన్నట్లుగా, అక్రమసంపాదనకి పనికిరానిదేదీ లేదని, తృణమూలం(గడ్డిపరక)నుంచి తరంగదైర్ఘ్యాల(స్పెక్ట్రం)దాకా, బొగ్గుగనులనుంచి గగనయానందాకా, ఆట వస్తువలనుంచి అణుశక్తిదాకా ఉన్న వివిధ పథకాలలో దేనినుంచైనా డబ్బు చేసుకోవచ్చని మనవాళ్ళు నిరూపించారు. చివరకి ఈ అవినీతి జాడ్యం ఉన్నతన్యాయస్థానాలను, అందులోని న్యాయమూర్తులను కూడా వదలిపెట్టట్లేదని ఆమధ్య వార్తలుకూడా వచ్చాయి. "సత్యమసత్యమనునూతకోల లేక నడువలేదని నమ్మినట్లున్నారు. ప్రతిప్రక్కలో మాయ; న్యాయాధికారి కలములో మాయ; న్యాయవాది నాలుకలో మాయ; వణిజుని త్రాసులో మాయ; ...., ఎక్కడజూచిన మాయ; ప్రపంచముననెవ్వరు సత్యవంతులు యోగ్యులు లేరా"? అని ఇప్పటికి సరిగా నూటరెండేండ్ల క్రితం పానుగంటివారు తమ సాక్షి ద్వారా ప్రశ్నించారు. అంటే ఈ సమస్య ఇప్పటిది కాదన్నమాట. అందుకే కాబోలు "మంచివారుగను, నిజాయితీపరులగను నిరూపణ అయ్యేంతవరకు అందరిని దోషులు"గానే పరిగణించేటట్లు (Presumed guilty until proven innocent) శిక్షాస్మృతిని తిరగరాయాలని కొందరంటూంటారు.

మనది ప్రజాస్వామ్యం. మనల్ని మనమే పరిపాలించుకుంటున్నాం. ఈ స్వయంపాలనలో దేశం సక్ర్రమంగా నడవాలంటే 'స్వ' పరిపాలన ముందుగా జరగాలని (self government should be preceded by governing the self) రాజాజీ ఒకసారి అన్నారు. అంటే ప్రభుత్వం చెయ్యదలచుకొన్నవాళ్ళు ముందుగా తమని తాము అదుపులో ఉంచుకోవాలి. అయితే, "రవిగాంచనిచో కవిగాంచునే" అనే నానుడి నిజమేమోనని అనిపించేట్లు అరవై ఏళ్ళ క్రితమే, స్వాతంత్ర్యం వచ్చిన ఐదారేళ్ళకే, కవి కొసరాజుగారే
"స్వారాజ్య యుద్ధాన జయభేరి మోగించి
శాంతమూర్తులు అంతరించారయా,
స్వాతంత్ర్యం గౌరవం సంతలో తెగనమ్ము
స్వార్ధమూర్తులు అవతరించేరయా"
అని అంటూ, "గుళ్ళు మింగే వాళ్ళు, నోళ్ళుకోట్టేవాళ్ళు ఊళ్ళో చలామణి అవుతారయా" అని మన పెద్దమనుషుల తరహా ఇలా ఉంటుందని చూసినట్టూ, బ్రహ్మంగారు కాలఙ్ఞానం చెప్పినట్టు చెప్పారు. వీళ్ళే "పగలె చుక్కలు మింట మొలిపించునంటారని" కూడా అన్నారు. ఈ మాటలు చాలావరకు సత్యమేనని ఎన్నికల ప్రచారాలనూ, పత్రికలలో వస్తున్న వార్తలనూ చూసి అనుకోవచ్చు. అలాంటి పెద్దమనుషుల బుద్ధులే వేరుగా ఉంటాయి. వారి విషయాలు వేరు, వాళ్ళు వాడే భాష వేరు, వాళ్ళు చేసే పనులే వేరుగా ఉంటాయి. వాటిని పిల్లలు వినకూడదు, చూడకూడదు. అందుకనే ఈనాటిపెద్దలు చేసేవి పిల్లలకి హానికరమని టివిలో కొన్ని సినిమాలు ప్రసారం చేసేముందు ఒక హెచ్చరిక చేస్తారు; ఏమనంటే,
'ఈ కార్యక్రమంలోని విషయం పెద్దలది (Adult Content), భాష పెద్దలది (Adult Language)', పిల్లల బుద్ధిని ఇవిచెరుస్తాయి కావున వారికి నిషిద్ధం అని. ఇక ఈ పెద్దవాళ్ళు నేర్చుకొనేదేమిటి? పిల్లలకి నేర్పేదేమిటి?
ఒకప్పటి భయంకరమైన అంటువ్యాధులైన ప్లేగు, కలరాలు రాకుండా టీకాలు, వస్తే నయంజేయడానికి మందులు కనిపెట్టారు. ఇటివలే పిల్లలకిసోకే పోలియో కూడా మసూచినిలాగే నిర్మూలించారు. మందు లేదనుకొంటున్న ఎయిడ్స్, కాన్సర్లకి కూడా జన్యుమార్పిడి ద్వారా నయంజేయడానికి పరిశోధనలు జరుగుతున్నాయని వింటున్నాం; కాని ఈ అవినీతి అనే మహమ్మారిని ఆపడానికిగాని, ఆ జబ్బుపట్టుకొంటే నయమవడానికిగాని, పూర్తిగా నిర్మూలించడానికిగాని మందుకనిపెట్టడానికి ఎవరూ ఇష్టపడుతున్నట్లు లేదు.

మన చట్టాలన్నీ ఎప్పుడో నూరు, నూటపాతికేళ్ళక్రితం బ్రిటిష్ వాళ్ళు చేసినవని, ముసలివైపోవడాన 'పళ్ళు'లేవని, అందుకనే అవినీతి నిర్మూలన సరిగా జరగట్లేదని, వాటికి సవరణలు చేసి, బలమైన పళ్ళేకాదు పదునైన కోరలు కూడా ఇస్తేతప్ప ఇది సాధ్యంకాదని కొంతమంది వాదన. ఇలా చేసిన చట్టాలను అమలు చేయడానికొక అవినీతి నిరోధకశాఖ, అది తీరుగా పనిచేస్తోందో లేదో చూడడానికి ఒక నిఘాసంఘం, దానికొక ప్రధానాధికారి; ఈ అధికారుల నియామకానికి, వారి పనితీరు నిర్దేశించడానికి మరికొన్ని చట్టాలు; ఈ చట్టాలు చేయడానికి చట్టసభలు అందులోకి సభ్యులు కావాలి. ఇలా మొదలుకొచ్చిన కథ ఎప్పుడు ముగుస్తుంది? అవినీతి ఎప్పుడు పోతుంది? ఇవన్నీ జరిగేపనులేనా? అందుకే
"నుతజల పూరితంబులగు నూతులు నూఱిటికంటె సూనృత
వ్రత! యొక బావి మేలు; మఱి బావులు నూఱింటికంటె నొక్క స
త్క్రతువది మేలు, తత్క్రతు శతంబున కంటె సుతుండు మేలు; త
త్సుత శతకంబు కంటె నొక సూనృత వాక్యము మేలు చూడగన్".
అని ఆదికవి నన్నయ్య అన్నట్లుగా ఇంత మందీ మార్బలంతో అవినీతినరికట్టే ప్రయత్నం చేసేబదులు, ఆ పని ఒక 'సూనృతవాక్యము' అంటే ఒకేఒక్క నిజమైన(మంచి)మాటతో సాధ్యపడుతుందేమో! సాధ్యంకావచ్చు. ఎందుకంటే (మంచిదారిలోపడడానికి) 'మనిషికోమాట' అనికదా సామెత. మన నీతిశతకాలలోనూ, పురాణేతిహాసాలలోను ఈ'సూనృతవాక్యాలు" పద్యాలరూపంలో కోకొల్లలుగా ఉన్నాయి.

దక్షిణాది రాష్ట్రాలలోని కేంద్రప్రభుత్వకార్యాలయాలలో హిందీభాషా ప్రచారంలోభాగంగా ఆయా కార్యాలయాలలోనికి ప్రవేశమార్గంలో ఒక నల్లబల్ల మీద 'ఈనాటిమాట' అని అనో లేక 'నేటిపదం' అనో రోజూ ఒక హిందీమాటని రాస్తారు. అ కార్యాలయంలోని ఉద్యోగులంతా రోజుకొక్కమాటచొప్పున నేర్చుకొని కొన్నాళ్ళకి హిందీలో ప్రావీణ్యం సంపాదించాలని సర్కారువారి అకాంక్ష. దానికిబదులుగా అన్నికార్యాలయాల్లోనూ 'భ్రష్టాచార్' అనేమాటని చెరిపేసి దాని స్థానంలో రోజుకొక తెలుగుపద్యం బోర్డుమీద రాస్తే, చదివినవాళ్ళకి భాషావికాసంతోపాటు ఒకింత ధర్మసూక్ష్మాలూ, నీతిసూత్రాలూ ఒంటబట్టటానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు చదివిన ఒక్కోక్కరూ ఇంకో నలుగురికాపద్యాలు చెప్తే, ఆనలుగురూ ఒక్కొక్కరుగా తలోనలుగురికి, ఇలా గొలుసుకట్టుగా, చెబుతూపోతూ ఉంటే కొన్నాళ్ళకి ఏదో కథలో చెప్పినట్ట్లు చదరంగపుగళ్ళలో పేర్చిన వడ్లగింజలు లేక దమ్మిడీకాసులలాగా ద్విగుణం బహుళం అయి న్యాయవర్తనులైన బుధజనశ్రేణి "ఇంతింతై, వటు డింతయై మరియు దానింతై; నభోవీధిపై నంతై .." అన్నట్లుగా పెరిగి బలోపేతమై, విరాట్ స్వరూపమై దేశంలో అవినీతి అనేది మళ్ళీతలెత్తకుండా పాతాళానికో అంతకన్నా క్రిందకో తొక్కివేయదానికి అవకాశముంటుంది. అప్పుడు పోలియో, మసూచి వంటి రోగాల నిర్మూలనతోపాటు అవినీతి అనే రుగ్మతని కూడా శాశ్వతంగా నిర్మూలించిన దేశాలలో ప్రప్రధమంగా 'స్వచ్చభారత్'ను నిలబెట్టవచ్చు. అప్పుడే మనం 'శ్కాము(ల)రాజ్యం' పోయి రామరాజ్యం స్థాపించామని నిజంగా తలెత్తుకొని "ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా", "నాదుజన్మభూమికంటె నాకమెక్కడుంది, సురలోకమెక్కడుంది" అని గర్వంతో ఎలుగెత్తి బృందగానం చేయవచ్చు.
ఇంత అర్ధముంది కాబట్టే అందరినీ తెలుగు పద్యాలు నేర్చుకోమంటున్నారేమో!

- దాసు మధుసూదన రావు

English summary
Dasu madhusudan Rao writes on the usage of Telugu language in daily life.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X