ఎన్ అరుణ కవిత ఉద్దీప్తి

ఓ కల మేలుకుంటుంది
నిద్రకు చిన్న చిన్న
కావ్యానువాదాలే స్వప్నాలు
మరి కలలు ఎప్పుడు నిద్రిస్తాయి?
నేను మేలుకున్నప్పుడా?
ఆ ఉద్రిక్త సరిహద్దు రేఖపై
నడువ వలసే ఉంది
నిద్ర చీకటి అయితే
మెలుకువ వెలుతురు
నిద్ర ఒక నిర్గుణ ప్రాకారం
స్వప్నం దాని సాకారం
అయితే
కలలు ఆకాశం నుంచి రాలిపడవు
సూదితో బావిని తవ్వలేము
తవ్వినా నీళ్లు పడవు
తవ్వే కొద్ది
పురివిప్పి నవ్వుతుంది మట్టి
అదే జీవితమంటే!
మట్టి నిండా జీవహరితం
బ్రతుకు చరితం దాని సృష్టే
శ్రమకు ఉండే స్పష్టత
భ్రమలకుండదు
భ్రమలు మిణుగురుల్లాంటివే గాని
ఇరుల కన్న నయం
కనురెప్పలు చిప్పల్లాంటివే కాని
ప్రతి బిందువూ మత్యం కాదు
తుఫానుకూ జపానుకూ మధ్య
ప్రళయానంతమైన అసంతృప్తి
చీకటి గడవనీ
రేపు అపురూపమైన దీప్తి












Click it and Unblock the Notifications