UAE.. ఈ క్యాబ్స్ కు డ్రైవర్ అవసరం లేదు భయ్యా
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.. సంచలనానికి కేంద్ర బిందువు అయింది. అబుదాబిలో డ్రైవర్‌లెస్ రోబోటాక్సీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఉదయం ఇవి ప్రారంభం అయ్యాయి. ఉబెర్ టెక్నాలజీస్, వీరైడ్ సంస్థల ఆధ్వర్యంలో పూర్తిగా డ్రైవర్ లెస్ టాక్సీ సేవలు ప్రారంభించిన మొదటి నగరంగా నిలిచింది.. అబుదాబి. అమెరికా వెలుపల డ్రైవర్ లెస్ టాక్సీ సేవలు అందుబాటులోకి రావడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
లెవెల్ 4 లేదా అంతకంటే ఎక్కువ ఆటోమేషన్ కలిగిన అటానమస్ వాహనాలు రాకపోకలు సాగించడానికి అనుమతించిన ప్రాంతాల్లో వీటి సేవలను పొందవచ్చు. మానవ ప్రమేయం లేకుండానే ఈ రోబో ట్యాక్సీలు నడుస్తాయి. ఇవి ఒక పరిమిత భౌగోళిక ప్రాంతం.. అంటే ఓ నిర్దుష్ట నగరం లేదా మార్గంలో తిరుగాడుతాయి. డ్రైవింగ్ కు సంబంధించిన అన్ని పనులను కూడా ఈ రోబో ట్యాక్సీలు స్వతంత్రంగా నిర్వహించగలవు. అక్కడి పరిస్థితులకు అనుగుణంగా స్పందించగలవు.

అబుధాబి సమీపంలోని యాస్ ఐలండ్ లో తొలిదశలో ఈ రోబో ట్యాక్సీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. పర్షియన్ గల్ఫ్ బీచ్, గోల్ఫ్ కోర్స్, అమ్యూజ్మెంట్ పార్క్, గ్రాండ్ ప్రిక్స్ కార్ రేసింగ్ ట్రాక్.. వంటివి ఉన్నయి ఇక్కడ. వీటిని తిలకించడానికి వచ్చే సందర్శకులు ఇక రోబో ట్యాక్సీ సేవలను పొందవచ్చు. యాస్ ఐలాండ్‌లో రోబో ట్యాక్సీ కమర్షియల్ కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయని వీరైడ్ సంస్థ వెల్లడించింది. ప్రయాణికులు ఉబెర్ కంఫర్ట్ లేదా ఉబెర్ ఎక్స్ ద్వారా వీరైడ్ రోబోటాక్సీలను పొందవచ్చని, అలాగే ఉబెర్ అటానమస్ రైడ్ ఆప్షన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చని సంస్థ వివరించింది.
ఈ వాహనాలకు మానవ డ్రైవర్ అవసరం లేదు. అత్యవసర పరిస్థితుల్లో అంటే బ్రేక్ డౌన్ కావడం వంటి సందర్భాల్లో ఈ ట్యాక్సీలను రోడ్ సైడ్ తీసుకెళ్లడానికి, పార్క్ చేయడానికి, వాటి కదలికలను నియంత్రించడానికి సెక్యూరిటీ ప్రోటోకాల్ అవసరం అవుతుంది. ఈ దిశగా రోబో ట్యాక్సీ సేవలను మరింత విస్తరించడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. పూర్తి స్థాయి డ్రైవర్ లెస్ రోబోటాక్సీ కామర్షియల్ ఆపరేషన్స్ కోసం ఫెడరల్ అనుమతి ఇదివరకే లభించింది.












Click it and Unblock the Notifications