Underwear Test: వ్యవసాయంలో కొత్త ట్రెండ్, మీ భూమి జాతకం మారాల్సిందే!
సాధారణంగా నేల సారాన్ని, అందులోని పోషకాలను తెలుసుకోవాలంటే సైంటిఫిక్ ల్యాబ్‌లకు వెళ్లడం లేదా రసాయన పరీక్షలు చేయడం పరిపాటి. కానీ, కెనడాకు చెందిన ఒక రైతు, స్విట్జర్లాండ్‌కు చెందిన వేలాది మంది సైంటిస్టులు ఒక వినూత్నమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. అదేంటంటే.. కొత్త కాటన్ అండర్వేర్ ను తీసుకెళ్లి మట్టిలో కొన్ని నెలల పాటు పూడ్చిపెట్టడం! వినడానికి ఇది చాలా వింతగా, కాస్త విచిత్రంగా అనిపించినప్పటికీ, నేల లోపల దాగివున్న కోట్ల జీవుల కదలికలను తెలుసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన మార్గంగా నిరూపితమైంది.
పదేళ్ల కష్టం.. మారిన పొలం జాతకం!
కెనడాలోని ఆంటారియోకు చెందిన నార్మ్ లామోతే అనే రైతు తన 500 ఎకరాల పొలంలో నేల ఆరోగ్యాన్ని తెలుసుకునేందుకు 2015లో ఈ "సాయిల్ యువర్ అండీస్" (అండర్‌వేర్‌ను మట్టిలో పూడ్చే ప్రయోగం) అనే ప్రయోగాన్ని మొదలుపెట్టాడు. మొదట ఒక కాటన్ అండర్‌వేర్‌ను మట్టిలో పూడ్చిపెట్టి, కొన్ని నెలల తర్వాత తవ్వి చూస్తే అది ఏమాత్రం పాడవకుండా అలాగే ఉంది. దాంతో తన పొలంలో సూక్ష్మజీవుల జీవం లేదని గుర్తించి తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఆ తర్వాత పంటల మార్పిడి చేయడం, గొర్రెల ఎరువు వాడటం, సహజ పద్ధతులను పాటించడం వల్ల పదేళ్ల తర్వాత (2025లో) మళ్లీ అదే ప్రయోగం చేస్తే అండర్వేర్ పూర్తిగా మట్టిలో కరిగిపోయింది. అంటే నేల జీవకళతో ఉట్టిపడుతోందని స్పష్టమైంది.

నేలలో బిలియన్ల సూక్ష్మజీవులు.. అండర్వేర్ ఎందుకు కరిగిపోతుందంటే?
అసలు కాటన్ డ్రాయర్ మట్టిలో కరిగిపోవడానికి కారణం నేలలో ఉండే రకరకాల సూక్ష్మజీవులు, బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు. ఈ క్రిములు కాటన్ దారాలను తమ ఆహారంగా తీసుకుంటాయి. నేల ఎంత ససశ్యామలంగా, ఆరోగ్యంగా ఉంటే అక్కడ సూక్ష్మజీవుల సంఖ్య అంత ఎక్కువగా ఉంటుంది. ఒక చిన్న స్పూన్ పరిమాణంలో ఉండే మట్టిలో, ప్రపంచ జనాభా కంటే ఎక్కువ సంఖ్యలో జీవులు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. నేల ఎంత ఆరోగ్యంగా ఉందో చెప్పడానికి ఈ కాటన్ అండర్వేర్ ప్రయోగం ఒక సులువైన సూచికగా మారింది.
స్విట్జర్లాండ్‌లో సైంటిఫిక్ సంచలనం.. 2 వేల అండర్వేర్లతో భారీ పరిశోధన!
ఈ వినూత్న ప్రయోగం కేవలం ఒక రైతుకే పరిమితం కాలేదు. స్విట్జర్లాండ్‌కు చెందిన అగ్రోస్కోప్ సంస్థ, జ్యూరిచ్ యూనివర్సిటీ పరిశోధకులు కలిసి వెయ్యి మందికి పైగా వాలంటీర్లతో ఏకంగా 2,000 కు పైగా అండర్వేర్లను, 12,000 టీ బ్యాగ్‌లను వేర్వేరు ప్రాంతాల్లో మట్టిలో పూడ్చిపెట్టించి పెద్ద ఎత్తున అధ్యయనం చేశారు. ఈ పరిశోధన ఫలితాల్లో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ప్రైవేట్ తోటల్లో ఉన్న మట్టిలో కాటన్ చాలా వేగంగా కరిగిపోగా, పచ్చిక బయళ్ళలో చాలా నెమ్మదిగా కరిగినట్లు తేలింది.
'అండర్వేర్ ఇండెక్స్'.. అందరికీ అర్థమయ్యే సింపుల్ సైన్స్!
సంక్లిష్టమైన సైన్స్‌ను సామాన్య ప్రజలకు కూడా సులువుగా అర్థమయ్యేలా చెప్పడానికి ఈ "అండర్వేర్ ఇండెక్స్" బాగా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ల్యాబ్ పరీక్షలకు పూర్తి ప్రత్యామ్నాయం కాకపోయినప్పటికీ, నేల సారాన్ని, సూక్ష్మజీవుల పనితీరును కళ్లారా చూసి తెలుసుకోవడానికి ఇది ఒక సరదా, అద్భుతమైన పద్ధతిగా గుర్తింపు పొందింది. ఈ ప్రయోగం ద్వారా రైతులు తమ భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మెరుగైన సాగు పద్ధతులను అలవాటు చేసుకుంటున్నారు.














Click it and Unblock the Notifications
