T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ బాయ్ కాట్ ? బంగ్లా-పాక్ చర్చలు..!
భారత్-బంగ్లాదేశ్ మధ్య నెలకొన్న వివాదాల నేపథ్యంలో ఇప్పటికే అగమ్యగోచరంగా మారిన టీ20 వరల్డ్ కప్ లో మరో బిగ్ ట్విస్ట్.
భారత్ లో వేదికల్ని మార్చాలంటూ బంగ్లాదేశ్ ఐసీసీని పదే పదే కోరుతున్నా స్పందన లేకపోవడంతో మరో గ్రూప్ లో ఉన్న ఐర్లాండ్ తో గ్రూప్ మార్చుకోవాలంటూ బేరసారాలకు దిగింది. అయితే అది కూడా వర్కవుట్ కాకపోవడంతో ఇప్పుడు భారత్ లో వేదికల్ని మార్చే విషయంలో బంగ్లాదేశ్ పొరుగుదేశం పాకిస్తాన్ సాయం కోరింది.
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా భారత్ లో ఆడే విషయంలో బంగ్లాదేశ్ చేతులెత్తేస్తే.. తమకు అండగా పాకిస్తాన్ కూడా అక్కడికి వెళ్లకూడదని ఆ దేశం భావిస్తోంది. ఈ మేరకు కలిసి రావాలని పాకిస్తాన్ ను బంగ్లాదేశ్ కోరుతున్నట్లు తెలుస్తోంది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ పేర్కొంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బిసిబి) భారతదేశంలో తన ప్రపంచ కప్ మ్యాచ్‌లను ఆడటానికి నిరాకరించిన తర్వాత, దౌత్య, క్రికెట్ మద్దతు కోరుతూ పాకిస్తాన్ ను సంప్రదించిందని సమాచారం.

రాబోయే టి20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ పాత్ర గురించి అక్కడి అధికారులతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మాట్లాడింది. అలాగే పాకిస్తాన్ నుంచి దీనికి సానుకూల స్పందన కూడా వచ్చినట్లు క్రికెట్ వర్గాలు చెప్తున్నాయి. బంగ్లాదేశ్ సమస్యను పరిష్కరించకపోతే తాము కూడా వరల్డ్ కప్ లో ఆడబోమని పాకిస్తాన్ తమకు చెప్పినట్లు బీసీబీ వర్గాలు వెల్లడించాయి.ఈ పరిణామం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ పై మరింత ఒత్తిడి పెంచబోతోంది. ఇప్పటివరకూ బంగ్లాదేశ్ విజ్ఞప్తుల్ని తోసిపుచ్చుతున్న ఐసీసీ.. పాకిస్తాన్ కూడా వారికి తోడైతే ఏం చేయబోతోందన్నది ఉత్కంఠ రేపుతోంది.

ఈ ఏడాది ఫిబ్రవరి 7న టి20 ప్రపంచ కప్ భారత్-శ్రీలంక ఉమ్మడి వేదికలుగా ప్రారంభం కానుంది. బంగ్లాదేశ్ లో ప్రభుత్వ మార్పు తర్వాత పాకిస్తాన్ తో ఆ దేశ సంబంధాలు పెరిగాయి. ఇప్పుడు క్రికెట్ విషయంలోనూ ఇరుదేశాలూ కలిసి పనిచేస్తున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. భారత్-పాక్ మధ్య ఆసియాకప్ ట్రోఫీ వివాదం సమయంలోనూ బంగ్లాదేశ్ తమ ఇస్లామిక్ పొరుగుదేశానికి మద్దతిచ్చింది. ఇదే పరిస్ధితి కొనసాగితే ఉపఖండంలో పెద్దన్నగా ఉన్న భారత్ కు ఇబ్బందులు తప్పకపోవచ్చని క్రికెట్ విశ్లేషకులు చెప్తున్నారు.












Click it and Unblock the Notifications