టీమిండియాలో మెక్ గ్రాత్: ఆ పేసర్‌పై సునీల్ గవాస్కర్ ప్రశంసలు
Sunil Gavaskar: భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో పర్యటిస్తోంది. మూడు చొప్పున వన్డే, టీ20 ఇంటర్నేషనల్స్, రెండు టెస్ట్ మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది. టీ20 సిరీస్ ముగిసింది. భారీ వర్షం వల్ల తొలి మ్యాచ్ రద్దు కాగా.. చివరి రెండింట్లో తలొకటి గెలిచాయి. సిరీస్ సమం అయింది.
జొహాన్నెస్‌బర్గ్ వేదికగా తొలి వన్డే కొద్దిసేపటి కిందటే ఆరంభమైంది. టాస్ గెలిచి దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రారంభంలోనే రెండు వికెట్లను కోల్పోయింది దక్షిణాఫ్రికా. రీజా హెండ్రిక్స్, రస్సీ వాన్ డెర్ డుస్సాన్ డకౌట్ అయ్యారు. ఈ ఇద్దరి వికెట్లను అర్ష్‌దీప్ సింగ్ పడగొట్టాడు. వరుస బంతుల్లో వారిద్దరినీ పెవిలియన్ దారి పట్టించాడు.

కొత్త ప్లేయర్ టోరీ డీ జోర్జీ, కేప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్ క్రీజ్‌లో ఉన్నారు. టోనీ దూకుడుగా ఆడుతున్నాడు. 18 బంతుల్లో 28 పరుగులు బాదాడు. ఇందులో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. అతని ధాటికి తొలి అయిదు ఓవర్లల్లో రెండు వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది దక్షిణాఫ్రికా.
అర్ష్‌దీప్ సింగ్ పొదుపుగా బౌలింగ్ చేస్తోండగా.. మరో ఎండ్‌లో ముఖేష్ కుమార్ ధారాళంగా పరుగులను ఇచ్చుకుంటోన్నాడు. నాలుగు ఓవర్లల్లో 24 పరుగులను పిండుకున్నారు దక్షిణాఫ్రికా బ్యాటర్లు. దక్షిణాఫ్రికా గడ్డపై తొలి వన్డే ఆడుతున్న నేపథ్యంలో కాస్త ఒత్తిడికి గురైనట్టు కనిపించాడు. లైన్ అండ్ లెంగ్త్‌ను అందిపుచ్చుకోవడంలో తడబడుతున్నాడు.
అతని బౌలింగ్.. టీమిండియా లెజెండరీ ప్లేయర్ సునీల్ గవాస్కర్‌ను ఆకట్టుకుంది. అతని భవిష్యత్తు ఎలా ఉంటుందనేది అంచనా వేశారాయన. టీమిండియాకు మరో మంచి పేస్ బౌలర్ దొరికాడనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. జట్టులో సుదీర్ఘకాలం కొనసాగే శక్తి సామర్థ్యాలు అతనికి ఉన్నాయని ప్రశంసించాడు.
ముఖేష్ కుమార్ బౌలింగ్ చూస్తోంటే తనకు ఆస్ట్రేలియా లెజెండ్ మెక్ గ్రాత్ గుర్తుకొచ్చాడని సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించాడు. సమకాలీన క్రికెట్‌లో జోష్ హేజిల్‌వుడ్‌లా బౌలింగ్ చేస్తోన్నాడని కితాబిచ్చాడు. బౌలింగ్ యాక్షన్, బంతిని బౌన్స్ చేసే విధానం, సరైన ప్లేస్‌లో దాన్ని ల్యాండ్ చేయించడం వంటివి.. మెక్ గ్రాత్‌ను గుర్తు చేస్తోన్నాయని పేర్కొన్నాడు.












Click it and Unblock the Notifications