బెంగళూరులో చెలరేగిన కివీ బౌలర్లు-46కే భారత్ ఆలౌట్-చెత్త రికార్డుపై ట్రోల్స్..!
న్యూజీలాండ్ తో టెస్టు సిరీస్ ను భారత్ ఇవాళ పేలవంగా ఆరంభించింది. బెంగళూరులో నిన్న ప్రారంభమైన తొలిటెస్టులో తొలిరోజు వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయింది. ఇవాళ రెండో రోజు వర్షం కాస్త శాంతించడంతో టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన భారత్ ఆరంభం నుంచీ తడబడింది. కివీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారత్ కు అస్సలు అవకాశం దొరకలేదు
దీంతో 10 పరుగులకే టాప్ ఆర్డర్ లో మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా ఆ తర్వాత అస్సలు కోలుకోలేకపోయింది.
7 వికెట్లకు 36 పరుగులు చేసి లంచ్ కు వెళ్లిన భారత్.. ఆ తర్వాత మరో 10 పరుగులు మాత్రమే జోడించి మిగిలిన మూడు వికెట్లు కోల్పోయింది. భారత జట్టులో 20 పరుగులు చేసిన రిషబ్ పంత్ టాప్ స్కోరర్. పంత్ తో పాటు 13 పరుగులు చేసిన ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. ఏకంగా ఐదుగురు బ్యాట్స్ మెన్ డకౌట్ అయ్యారు. ఇందులో కొహ్లీ, కేఎల్ రాహుల్ కూడా ఉన్నారు. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీకి ఐదు వికెట్లు దక్కాయి. విలియం ఓ రూర్కీ 4 వికెట్లు తీశాడు. టిమ్ సౌతీకి మరో వికెట్ దక్కింది.

అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ కు ఓపెనర్లు డెవాన్ కాన్వే, టామ్ లేథమ్ మంచి ఆరంభమే ఇచ్చారు. భారత బౌలర్లపై పూర్తిగా ఎదురుదాడికి దిగిన కాన్వే ఈ క్రమంలో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. వీరిద్దరూ కుదురుకుంటున్న క్రమంలో టామ్ లేథమ్ ను కుల్దీప్ యాదవ్ ఎల్బీగా వెనక్కి పంపడంతో కివీస్ 67 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 46 పరుగులకు భారత్ తొలి ఇన్నింగ్స్ లో ఆలౌట్ కావడం స్వదేశంలో ఇదే తొలిసారి.
గతంలో 1987లో 75 పరుగులకు విండీస్ చేతిలో ఢిల్లీలో ఆలౌట్ అయింది. ఇలా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి 46 పరుగులకే భారత్ ఆలౌట్ కావడంపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో మీమ్స్ పెడుతున్నారు. భారత బ్యాటింగ్ ఆర్డర్ పై సెటైర్లు వేస్తున్నారు.












Click it and Unblock the Notifications