సిరీస్ పై కన్నేసిన టీమిండియా: తుదిజట్టులో మరో ఆల్‌రౌండర్ కు చోటు?
న్యూజిలాండ్‌తో జరుగుతున్న అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా ఇప్పటికే పూర్తి ఆధిపత్యాన్ని సాధించింది. 2-0 తేడాతో ముందంజలో ఉంది. సిరీస్ విజయంపై కన్నేసింది. ఇందులో గెలిస్తే.. ఇంకా రెండు మ్యాచ్ లు మిగిలివుండగానే సిరీస్ భారత్ వశమౌతుంది. భారత కాలమానం ప్రకారం.. ఈ మధ్యాహ్నం 12:30 గంటలకు ఆరంభమౌతుందిది. వెల్లింగ్టన్ దీనికి వేదిక. తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ న్యూజిలాండ్‌పై చెరో నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విజయాల పరంపరను ఇక్కడా కొనసాగించాలని భావిస్తోంది.
ఈ మ్యాచ్‌కు కూడా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ అందుబాటులో ఉండటం లేదు. తొడ కండరాల గాయం నుంచి కోలుకుంటున్న అతను మ్యాచ్ ఆడే స్థాయి ఫిట్నెస్ను ఇంకా సాధించలేదని బీసీసీఐ స్పష్టం చేసింది. అతని విషయంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకూడదని భావిస్తోంది. ఇషాన్ గైర్హాజరీతో వైభవ్ సూర్యవంశీకి మరో అవకాశం దక్కడం దాదాపు ఖాయమైంది. రెండో మ్యాచ్ లో విఫలమైన అతను.. ఇక్కడ ఎంత వరకు పుంజుకొంటాడనేది చర్చనీయాంశమైంది.

ఓపెనర్‌గా తనదైన ముద్ర వేసిన అతను మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి విఫలం అయ్యాడు. నాలుగు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. అతనికి అనుకూలంగా ఉండే ఓపెనింగ్ స్థానాన్ని కాదని, మూడో స్థానంలో ఆడించడం వల్లే క్రీజ్ లో కుదురుకోలేకపోయాడనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ నేపత్యంలో అతనికి అలవాటైన ఓపెనర్‌గానే పంపించే అవకాశాలను కూడా మేనేజ్మెంట్ పరిశీలిస్తోంది. అతను ఓపెనర్ గా వెళ్తే.. సంజు శాంసన్ బ్యాటింగ్ ఆర్డర్ మారుతుంది.
బ్యాటింగ్ డెప్త్ ను పెంచడంతో పాటు అదనపు పేస్ బౌలింగ్ ఆప్షన్ కోసం ఆల్‌రౌండర్ శివమ్ దూబెను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. దూబె చేరిక జట్టుకు అయిదో బౌలర్ స్థానం భర్తీ కావడమే మిడిలార్డర్ లో బ్యాటింగ్ బలోపేతమౌతుందని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. వరుసగా రెండు విజయాలు సాధించి ఊపుమీద ఉన్న జట్టు.. విన్నింగ్ కాంబినేషన్‌ను మార్చడానికి ఎంతవరకు మొగ్గు చూపుతుందనే విషయంపై ఇది ఆధారపడి ఉంది.
మరోవైపు ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఫామ్ జట్టు యాజమాన్యానికి కాస్త ఆందోళన కలిగిస్తోంది. నాలుగేళ్ల విరామం తర్వాత టీ20 జట్టులోకి పునరాగమనం చేసిన అతను మొదటి రెండు మ్యాచ్‌లలో కలిపి 99 పరుగులు సమర్పించుకున్నాడు. అతనికి ప్రత్యామ్నాయంగా మయాంక్ యాదవ్ అందుబాటులో ఉన్నప్పటికీ.. భువనేశ్వర్ కుమార్ కు మరో అవకాశం ఇవ్వడానికే మేనేజ్మెంట్ మొగ్గుచూపొచ్చు.
వెల్లింగ్టన్ పిచ్ సాధారణంగా ఫాస్ట్ బౌలింగ్, స్వింగ్‌కు అనుకూలించే అవకాశం ఉన్నందున అర్ష్‌దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్‌లతో కూడిన పేస్ దళం ప్రారంభ ఓవర్లలోనే ప్రత్యర్థి వికెట్లు తీయడం మ్యాచ్ ఫలితాన్ని శాసించనుంది. ఈ మూడో టీ20 మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్ ఖాయం చేసుకుంటే, మిగిలిన రెండు మ్యాచ్‌లలో బెంచ్ మీద ఉన్న ఇతర కొత్త ఆటగాళ్లను స్వేచ్ఛగా పరీక్షించే మంచి వెసులుబాటు లభిస్తుంది.
టీమిండియా తుదిజట్టులో.. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), వైభవ్ సూర్యవంశీ, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, అక్షర్ పటేల్, ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్ కు చోటు దక్కొచ్చు.















Click it and Unblock the Notifications
