ఐపీఎల్ 2027లో ముంబై ఇండియన్స్‌లో మరో కెప్టెన్సీ ట్విస్ట్?
రాబోయే ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం ఓ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు క్రీడా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా జట్టు ప్రదర్శన క్షీణించడం, డ్రెస్సింగ్ రూమ్‌లో కెప్టెన్సీ వివాదాలు తలెత్తడంతో ఫ్రాంచైజీ మళ్లీ మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ వైపే మొగ్గు చూపుతోంది. జట్టుకు పూర్వ వైభవం తీసుకురావడానికి రోహిత్ శర్మను తిరిగి కెప్టెన్‌గా నియమించడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది.
ఐదు టైటిళ్ల హిస్టరీ.. హార్దిక్ కెప్టెన్సీలో నిరాశ
రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ 2013, 2015, 2017, 2019, 2020లలో ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీలను గెలుచుకుని లీగ్‌లోనే మోస్ట్ సక్సెస్ఫుల్ జట్టుగా నిలిచింది. అయితే 2024 సీజన్‌కు ముందు గుజరాత్ టైటాన్స్ నుంచి తిరిగి వచ్చిన హార్దిక్ పాండ్యాకు అనూహ్యంగా సారథ్య బాధ్యతలు అప్పగించారు. హార్దిక్ పాండ్యా నేతృత్వంలో 2024లో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలవగా.. 2025లో ప్లేఆఫ్స్ కు చేరినప్పటికీ టైటిల్ గెలవలేకపోయింది. దీంతో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ మళ్లీ రోహిత్ శర్మ అనుభవంపైనే ఆధారపడాలని నిర్ణయించుకుంది.

కెప్టెన్సీ మార్పు తర్వాత జట్టులో ఆటగాళ్ల మధ్య సమన్వయం తగ్గడం, డ్రెస్సింగ్ రూమ్ స్ఫూర్తిపై ప్రశ్నలు తలెత్తడం యాజమాన్యాన్ని ఆందోళనకు గురిచేసింది. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, వంటి యంగ్ లీడర్స్ ప్రత్యామ్నాయంగా ఉన్నప్పటికీ.. జట్టులో స్థిరత్వం సాధించాలంటే ఐదు టైటిళ్లు గెలిపించిన రోహిత్ శర్మ అనుభవమే సరైనదని ముంబై యాజమాన్యం భావిస్తోంది.
హార్దిక్ పాండ్యా భవిష్యత్తు ఏమిటి?
రోహిత్ శర్మ తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉండటంతో హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ జట్టులో కొనసాగడం కష్టమేనని వార్తలు వస్తున్నాయి. హార్దిక్ పాండ్యాను వేరే ఫ్రాంచైజీకి ట్రేడ్ చేయడానికి ముంబై సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ జాబితాలో కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ముందు వరుసలో ఉన్నాయి.
ముంబైలోకి యశస్వి జైస్వాల్?
హార్దిక్ పాండ్యాను రాజస్థాన్ రాయల్స్ జట్టుకు పంపి దానికి ప్రతిఫలంగా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను ముంబై జట్టులోకి తీసుకోవడానికి చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. రోహిత్ శర్మ కెరీర్ చివరి దశలో ఉన్నందున, భవిష్యత్తు కోసం విధ్వంసకర ఓపెనర్ యశస్వి జైస్వాల్ ను తీసుకురావాలని ముంబై ఇండియన్స్ యోచిస్తోంది. అయితే ఈ ట్రేడ్ ఒప్పందంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.














Click it and Unblock the Notifications
