CSK లో భారీ మార్పులు
చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను రాజస్థాన్ రాయల్స్ కు ఇచ్చి, అతనికి బదులుగా వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్‌ను తీసుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ డీల్.. ఇంకా చర్చల దశలోనే ఉంది. తన వికెట్ కీపింగ్, బ్యాటింగ్ విభాగాలను బలోపేతం చేసుకోవడానికి సీఎస్కే వ్యూహాత్మకంగా సంజు శాంసన్ ను తీసుకోవచ్చని భావిస్తోన్నారు. రవీంద్ర జడేజా రూపంలో రాజస్థాన్ రాయల్స్ ఓ ఆల్‌రౌండర్ లభిస్తాడని చెబుతున్నారు.
చెన్నై సూపర్ కింగ్స్- రాజస్థాన్ రాయల్స్ మధ్య ఈ చర్చలు అంత సులభంగా సాగట్లేదు. రవీంద్ర జడేజాతో పాటు యువ సంచలనం డెవాల్డ్ బ్రెవిస్‌ను కూడా తమకు ఇవ్వాలని రాజస్థాన్ రాయల్స్ కోరినట్లు సమాచారం. బ్రెవిస్ తమ దీర్ఘకాలిక ప్రణాళికల్లో భాగమని, అతన్ని ఇవ్వడానికి తిరస్కరించింది. ఈ విషయంలో ఇరు జట్ల మధ్య ఈ మార్పిడి కోసం జరుగుతున్న ప్రయత్నాలు కొలిక్కి రావట్లేదని తెలుస్తోంది.

ఐపీఎల్ 2025లో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది చెన్నై సూపర్ కింగ్స్. దీంతో జట్టు పునర్నిర్మాణంపై ఫ్రాంచైజీ దృష్టి సారించింది. సంజు శాంసన్ వంటి డైనమిక్ వికెట్ కీపర్ బ్యాటర్‌ను చేర్చుకోవడం ద్వారా నిలకడతో పాటు అంతర్జాతీయ మ్యాచ్ లను ఆడిన అనుభవం ఉన్న ప్లేయర్ ను జట్టులోకి తీసుకున్నట్టవుతుంది. మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఎక్కువ రోజులు కొనసాగే అవకాశం లేకపోవడం వల్ల అతని వారసుడిగా, పూర్తిస్థాయి వికెట్ కీపర్ గా సంజు శాంసన్ సరిగ్గా సెట్ అవుతాడని భావిస్తోంది.
దీంతో పాటు ఇద్దరికీ ఆయా జట్లు చెల్లిస్తోన్న మొత్తం 18 కోట్ల రూపాయలు. ఈ క్రమంలో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను వదులుకోవడానికి కూడా చెన్నై సూపర్ కింగ్స్ సిద్ధపడిందంటే.. జట్టు పునర్నిర్మాణం విషయంలో మేనేజ్మెంట్ ఎంత కఠినంగా వ్యవహరిస్తోందో అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో డెవాల్డ్ బ్రెవిస్‌ను కూడా జట్టులో ఇంకొన్ని సీజన్ల పాటు కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది. అతన్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేదు. కాగా- సంజు శాంసన్ తో మార్పిడి వార్తలను రవీంద్ర జడేజా తోసిపుచ్చినట్లు సమాచారం.
నిలకడగా సత్తా చాటుతోన్న ప్లేయర్లల్లో ఒకడు.. సంజు శాంసన్. అటు టీమిండియా తరఫున టీ20 ఇంటర్నేషనల్స్ లోనూ అదరగొడుతున్నాడు. ఈ ఫార్మట్ లో ఇప్పటివరకు మూడు సెంచరీలు బాదాడు. ఈ రికార్డు అతి కొద్దిమందికి మాత్రమే ఉంది. దశాబ్దానికి పైగా రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నాడీ మలయాళీ క్రికెటర్. 2013లో రాజస్థాన్ రాయల్స్ తో టై అప్ అయ్యాడు. అప్పటి నుంచీ అదే జట్టులో కొనసాగుతున్నాడు. 2018లో అతన్ని రిలీజ్ చేసినప్పటికీ.. మళ్లీ అదే ఫ్రాంఛైజీ అతన్ని రిటైన్ చేసుకుంది.












Click it and Unblock the Notifications