బాక్స్ ఎఫెక్ట్: సిటీలో వినోదం బంద్, విశాఖకు ఊరట

ఫలితంగా జంట నగరాలలో యాభై శాతానికి పైగా టివిలకు కేబుల్ ప్రసారాలు నిలిచిపోయాయి. విశాఖపట్నంలో సెట్ టాప్ బాక్సుల ఏర్పాటుకు పదిహేను రోజుల గడువు ఇస్తూ అక్కడి జాయింట్ కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో అక్కడ అనలాగ్ ప్రసారాలు యథావిధిగా సాగాయి. జంట నగరాల్లో మాత్రం సింహభాగం ప్రజలు వినోద, వార్తా ప్రసారాలకు దూరమయ్యారు. సాధ్యాసాధ్యాలన్నీ పరిశీలించకుండా కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ తీసుకున్న కఠిన నిర్ణయంతో ఇంటింటా వినోదం సోమవారం దూరమైంది.
ఆదివారం అర్ధరాత్రి నుంచే ప్రసారాలు ఆగిపోతాయని తొలుత నిర్ణయించినప్పటికీ సోమవారం ఉదయం 7 గంటలకు కొన్నిచోట్ల, మధ్యాహ్నం 12 గంటలకల్లా మరికొన్ని చోట్ల ఆగిపోయాయి. తొలుత హైదరాబాద్ జిల్లా(పాత ఎంసీహెచ్, 100 డివిజన్లకే) డిజిటైజేషన్ అమలు అవుతుందని ప్రకటించినప్పటికీ దిల్‌సుఖ్‌నగర్, చంపాపేట్, అత్తాపూర్, కూకట్‌పల్లి, ఈసిఐఎల్, వనస్థలిపురం, ఉప్పల్ లాంటి ప్రాంతాల్లో కూడా టీవీలుమూగబోయాయి.
మరోవైపు సాయంత్రం 6 గంటల తర్వాత గ్రేటర్ పరిధిలోని కొన్ని ప్రాంతాలు కూకట్‌పల్లి, చైతన్యపురి లాంటి చోట్ల ప్రసారాలు పునరుద్ధరించారు. నెల రోజుల పాటు డిజిటైజేషన్ అమలుకు గడువు ఇవ్వాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లేఖ రాసినా కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ స్పందించలేదు. ప్రేక్షకుల గుండెచప్పుడుతో స్పందించిన కామ్రేడ్లు కూడా కేంద్రానికి లేఖ రాశారు. మూడునెలల పాటు డిజిటైజేషన్‌కు గడువు పొడిగించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. అయితే దీనిపై వారం రోజుల్లోగా కేంద్ర ప్రసారమంత్రిత్వ శాఖకు చెందిన టాస్క్‌ఫోర్స్ సమావేశం కానుంది.
హైకోర్టులో పిటిషన్
టివిలకు సెట్ టాప్ బాక్సులు బిగించుకునేందుకు విధించిన గడువును సవాల్ చేస్తూ హైదరాబాదుకు చెందిన చలసాని నరేంద్ర ప్రసాద్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. గడువు విధించడంతో సెట్ టాప్ బాక్సుల కోసం ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని, వీటిని విదేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు మరో ఎనిమిది మందిని ప్రతివాదులుగా చేర్చారు.
కాగా, టివిలు మూగబోవడంపై భిన్న రకాల స్పందనలు వస్తున్నాయి. పిల్లలకు పరీక్షలు ఉండటంతో పలువురు టివి ప్రసారాలు ఆగిపోవడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజులు సమయం ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సెట్ టాప్ బాక్సులు లేకపోవడంతో అన్ని చోట్ల ప్రసారాలు నిలిపివేసినప్పటికీ ఆందోళన కారణంగా కొన్నిచోట్ల పునరుద్ధరించారు. అలాగే పరీక్షల సమయంలో ప్రసారాలు నిలిచిపోవడంపై కూడా కొందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications