‘డేరా’లో ఎన్నో ఘోరాలు: రియాల్టీషోలు!, కోట్లిచ్చిన భక్తుడి ఆత్మహత్య

Subscribe to Oneindia Telugu
  Bigg Boss Show In Dera, Shocking ! ‘డేరా’లో ఎన్నో ఘోరాలు: రియాల్టీషోలు! బిగ్‌బాస్‌ కూడా | Oneindia

  చంఢీఘర్: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, ఇద్దరు సాధ్విలపై అత్యాచార కేసులో నిందితుడైన డేరాబాబా అలియాస్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ చేసిన దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. హర్యానా రాష్ట్రంలోని సిర్సా కేంద్రంగా ఉన్న డేరా సచ్చాసౌదాలోని ఆసుపత్రిలో అక్రమంగా అవయవాల మార్పిడి శస్త్రచికిత్సలు చేశారని వెల్లడైంది.

  డేరా బాబా అల్లర్లలో 'ఎర్ర సంచి'దే కీలక పాత్ర: ఏం జరిగిందంటే?

  అక్రమంగా అవయవాల మార్పిడి

  అక్రమంగా అవయవాల మార్పిడి

  డేరాలోనే 1.25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న షా సత్నాం జి స్పెషాలిటీ ఆసుపత్రిలో కార్నియల్, ఇతర అవయవాల మార్పిడి చికిత్సలు అక్రమంగా చేశారు. మానవ అవయవాల మార్పిడి చట్టం ప్రకారం అవయవాల మార్పిడి శస్త్రచికిత్సలు చేసే ఆసుపత్రులు, ఐ బ్యాంకులు తప్పని సరిగా నేషనల్ ఆర్గాన్ అండ్ టిస్యూ ట్రాన్స్ ప్లాంట్ ఆర్గనైజేషన్, రీజనల్ ఆర్గాన్ అండ్ టిస్యూ ట్రాన్స్ ప్లాంట్ ఆర్గనైజేషన్ లో నమోదు చేసుకోవాలి. కానీ, 400 పడకల సామర్ధ్యంతో నడుస్తున్న డేరాబాబా ఆసుపత్రి తమ వద్ద అవయవాల మార్పిడిపై పేరు నమోదు చేసుకోలేదని నేషనల్ ఆర్గాన్ అండ్ టిస్యూ ట్రాన్స్ ప్లాంట్ ఆర్గనైజేషన్ డైరెక్టరు డాక్టర్ విమల్ భండారీ చెప్పారు.

  అనుమతులు లేకుండానే..

  అనుమతులు లేకుండానే..

  డేరా ఆసుపత్రి డాక్టర్లు స్టెమ్ సెల్ చికిత్స ద్వారా బోన్ మ్యారో చికిత్స చేశామని, దీనిపై పరిశోధనలు చేస్తున్నట్లు ‘సేయింగ్ ట్రూత్' డేరా మాసపత్రికలో ప్రకటించారని కాని ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఈ వ్యవహారం సాగించారని వైద్య పరిశోధనామండలి కార్యదర్శి డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ చెప్పారు. సిర్సాలోని డేరా ఆసుపత్రిలో 150 మంది వైద్యులు పనిచేస్తుండగా కేవలం ఒకే ఒక్క డాక్టరు పేరును మాత్రమే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లో నమోదు చేశారు. మిగతా డాక్టర్ల వ్యవహారంపై తమకు సమాచారం లేదని సిర్సా ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ కేకే గోయల్ తెలిపారు. ఈ క్రమంలో డేరా ఆసుపత్రిలో అక్రమంగా సాగిన అవయవాల మార్పిడి బాగోతంపై వైద్యఆరోగ్యశాఖాధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

  కోట్లిచ్చిన డేరా బాబా భక్తుడి ఆత్మహత్య

  కోట్లిచ్చిన డేరా బాబా భక్తుడి ఆత్మహత్య

  గుర్మీత్ రామ్‌ రహీంకు 12 ఎకరాల భూమితోపాటు హోటల్ వ్యాపారం కోసం రూ. 3.10 కోట్ల సొమ్మును ఇచ్చిన డేరా భక్తుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు రోజులుగా అదృశ్యమైన సోమవీర్(48) మృతదేహం శుక్రవారం ఒక కుంటలో లభ్యమైంది. విలువైన భూమిని కోల్పోవడంతోపాటు బాబా జైలుకు వెళ్లడంతో డిప్రషన్‌కు గురై ఆత్మహత్య చేసుకున్నాడని భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న సదర్‌ప్రాంత పోలీసులు గ్రామస్థుల సాయంతో శవాన్ని కుంటలో నుంచి వెలికితీశారు. పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బల్కరా గ్రామానికి చెందిన సోమవీర్‌సింగ్ బుధవారం రాత్రి నుంచి ఇంటి నుంచి మాయమయ్యాడు. దీంతో బంధువులు చుట్టుపక్కల గాలించారు. ఫలితం లేకపోవడంతోవారు పోలీసులుకు ఫిర్యాదు చేశారు.

  డేరాలో రియాల్టీ షోలు.. హనీప్రీత్ స్పెషల్

  డేరాలో రియాల్టీ షోలు.. హనీప్రీత్ స్పెషల్

  ఇద్దరు సాధ్వీల రేప్ కేసులో 20 సంవత్సరాల జైలుశిక్ష అనుభవిస్తున్న డేరా గత జీవితానికి సంబంధించిన అనేక కోణాలు బయటపడుతున్నాయి. డేరాలో రియాలీటీ షో నిర్వహించేవారని తెలుస్తోంది. డేరా బాబా నిర్వహించే ఈ షోలో అతని దత్త పుత్రిక హనీప్రీత్ పాల్గొనేది. ఈ షోలో పాల్గొనేవారికి కొన్ని నియమనిబంధనలుంటాయి. అయితే హనీప్రీత్‌కు ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఉండేది. బాబా రామ్‌రహీం మాజీ భక్తుడు గురుదాస్ తూర్ ఒక టీవీ ఛానల్‌కు ఈ వివరాలు అందించాడు.

  అంతా డేరా బాబానే

  అంతా డేరా బాబానే

  ఈ రియాల్టీ షోకు జడ్జి, హోస్ట్‌గా బాబానే వ్యవహరించేవాడు. దీనికి సంబంధించిన నియమ నిబంధనలను బాబానే తనకిష్టమొచ్చినట్టు రూపొందించేవాడు. బిగ్‌బాస్‌లో మాదిరిగా ఈ షోలోనూ హౌస్‌లోనికి ఎవరు వెళ్లాలి? బయటకు ఎవరిని పంపాలి? అనేది బాబానే నిశ్చయించేవాడు. డేరా బాబా నిర్వహించే ఈ షోకు సంబంధించిన ఇంట్లో కంటెస్టెంట్స్ నెల్లాళ్లపాటు ఉండాల్సి ఉంటుంది. ఇందుకోసం బాబా 2009లో అద్భుతమైన ఇంటిని నిర్మించాడు. హనీ‌ప్రీత్ మాజీ భర్త గుప్తా కూడా ఈ షోలో పోటీదారుగా పాల్గొన్నాడు. షోలో పాల్గొన్నవారికి బాబానే టాస్క్ ఇస్తాడు. ఇంట్లో నలువైపులా సీసీ కెమెరాలుంటాయి. ఈ సందర్బంగా డేరా బాబాను కలుసుకునేందుకు పోటీదారులకు అవకాశం లభించేది.

  కొనసాగుతున్నా సోదాలు

  కొనసాగుతున్నా సోదాలు

  సిర్సాలోని డేరా సచ్చా సౌదా ప్రధాన కేంద్రం సముదాయంలో సోదాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం భద్రతా బలగాలు, అధికారులు భారీఎత్తున సోదాల్ని నిర్వహించారు. రిజిస్ట్రేషన్‌ లేని ఓ విలాసవంతమైన కారు, ఓబీ వ్యాను, రూ.7 వేల విలువైన పాత నోట్లు, రూ.12 వేల నగదును జప్తు చేశారు. కొన్ని గదుల్నీ మూసివేశారు. హార్డ్‌డిస్కులు, లేబుళ్లు లేని మందుల్నీ, వాకీటాకీ సెట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు హరియాణా సమాచార, ప్రజాసంబంధాల ఉపసంచాలకులు సతీష్‌మెహ్రా తెలిపారు. హైకోర్టు నియమించిన కోర్టు కమిషనర్‌ విశ్రాంత జిల్లా,సెషన్స్‌ జడ్జి ఏకేఎస్‌ పవార్‌ పర్యవేక్షణలో చేపట్టిన సోదాల్ని వీడియో తీశారు. డేరా కేంద్రానికి దారితీసే రహదారులపై కర్ఫ్యూ కొనసాగింది. అంతర్జాల సేవల్ని నిలిపివేశారు. పాత్రికేయుల్ని 7 కి.మీ. దూరంలోనే ఆపేశారు. రహదారులపై భద్రతా బలగాల్ని మోహరించారు. సోదా కార్యక్రమాన్ని సాఫీగా చేపట్టేందుకు తగిన వ్యూహంతో సిద్ధమైనట్లు డీజీపీ బీఎస్‌ సంధూ తెలిపారు. అందరూ సహకరించాలనీ, శాంతిభద్రతల్ని కాపాడాలని కోరుతున్నట్లు డేరా ఛైర్‌పర్సన్‌ విపాసన ఇన్సాన్‌ పేర్కొన్నారు.

  అత్యాచారాల గుహ

  అత్యాచారాల గుహ

  సోదా ప్రక్రియలకు సంబంధించిన మొత్తం వ్యవహారాన్ని కోర్టు కమిషనర్‌ హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించనున్నారు. డేరా కేంద్రంలో గుర్మీత్‌రాంరహీంసింగ్‌ ఆవాసంగా చెబుతున్న గుహలో ఫోరెన్సిక్‌ నిపుణుల బృందం పరీక్షలు నిర్వహించింది. ఈ గుహను గుర్మీత్‌ మహిళలపై అకృత్యాలకు ఉపయోగించేవారనే ఆరోపణలున్నాయి. తాజా సోదాల్లో డేరా సముదాయంలో ఐదుగురిని గుర్తించారు. అందులో ఇద్దరు మైనర్లను సంబంధిత అధికారికి అప్పగించగా, మిగతా ముగ్గురిని ప్రశ్నించి, ఇళ్లకు పంపివేస్తామని మెహ్రా పేర్కొన్నారు. కాగా, డేరా ప్రాంగణంలో చేపట్టిన తనిఖీల్లో నాణేల తరహాలో ఉన్న ప్లాస్లిక్‌ డబ్బుల్నీ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. నారింజ రంగు నాణెం రూ.10, నీలిరంగు నాణెం రూ.1 విలువను కలిగి ఉన్నట్లు చెబుతున్నారు. కాగా, డేరా సంస్థ.. గతంలో నిబంధనలకు విరుద్ధంగా 14 మృతదేహాలను లక్నో వైద్య కళాశాలకు పంపినట్లు వెల్లడైన మీడియా కథనాలపై స్పందించిన హర్యానా ఆరోగ్యమంత్రి అనిల్‌విజ్‌ విచారణకు ఆదేశించారు. అంతేగాక, డేరా ప్రాంగణంలో పదుల సంఖ్యలో స్థిపంజరాలు కూడా లభించినట్లు సమాచారం.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Security forces stand guard at Satnam Chowk, the main entrance to the Dera Sacha Sauda headquarters, in Sirsa

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి