ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత తీరేదెప్పుడు ? చెప్పేసిన చంద్రబాబు..!
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా పెట్రోల్, డీజిల్ (petrol, diesel) కొరత కనిపిస్తోంది. దీంతో వాహనదారులు, రవాణా రంగం, దానిపై ఆధారపడిన వర్గాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు (Chandrababu) ఇవాళ మరోసారి రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో పౌర సరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సివిల్ సప్లై ఉన్నతాధికారులు, పెట్రోలియం కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
పెట్రోల్, డీజిల్ సమస్య పరిష్కారానికి నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలపై సీఎం చంద్రబాబు అధికారుల వివరణ కోరారు. ఈ రోజు సాయంత్రానికి మెజారిటీ ప్రాంతాల్లో సాధారణ స్థితి ఏర్పడుతుందని ముఖ్యమంత్రికి వారు వివరించారు. పెట్రోల్, డీజిల్ సరఫరాలో సాధారణ పరిస్థితిని తెచ్చేందుకు అధికారులు, ఆయిల్ కంపెనీల యాజమాన్యాలు సమన్వయంతో పని చేయాలని సీఎం ఆదేశించారు. ఉదయం డిస్పాచ్ సెంటర్ల నుంచి వెళ్లిన ఆయిల్ ట్యాంకర్లు ఈ రోజు సాయంత్రం వరకూ రిటైల్ బంకులకు చేరుకుంటాయని ఆయిల్ కంపెనీల ప్రతినిధులు తెలిపారు.

స్వయంగా కలెక్టర్లు, ఎస్పీల పర్యవేక్షణలో ప్రజలు ఇబ్బంది పడకుండా ఆయిల్ సరఫరా జరిగేలా చూడాలని సీఎం ఆదేశించారు. కలెక్టర్లు, ఉన్నతాధికారులు ఆయిల్ డిస్పాచ్ సెంటర్లకు వెళ్లి సరఫరాను పర్యవేక్షించాలని సూచించారు. రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో పరిస్థితులపై ఆర్టీజీ సెంటర్ ద్వారా నిరంతరం పర్యవేక్షించి ప్రతీ 3 గంటలకు ఒకసారి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులు, మంత్రులకు సీఎం చంద్రబాబు ఆదేశాలిచ్చారు. మీడియా, సోషల్ మీడియాలో వస్తోన్న కథనాలు, క్షేత్రస్థాయి సమాచారం ఆధారంగా అధికారులు స్పందించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆయిల్ డిపోల నుంచి రిటైల్ బంకులకు ఎటువంటి జాప్యం లేకుండా ఆయిల్ ట్యాంకర్లు చేరుకునే విధంగా చూడాలని ఆదేశించారు. బ్లాక్ మార్కెట్, కృత్రిమ కొరత సృష్టించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. 0సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆయిల్ కంపెనీలు నిరంతరం పని చేయాలన్నారు.












Click it and Unblock the Notifications