రాజీనామా చేయను, కావాలంటే..! మమతా బెనర్జీ తాజా సవాల్..!
పశ్చిమ బెంగాల్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత కూడా సీఎం పదవికి రాజీనామా చేయబోనని భీష్మించుకుని కూర్చొన్న మమతా బెనర్జీ(Mamata Banerjee) అదే వైఖరి కొనసాగిస్తున్నారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని ఆమె ఇవాళ మరోసారి స్పష్టం చేశారు. బెంగాల్లో విజయం సాధించిన తమ ఎమ్మెల్యేలను నల్ల రిబ్బన్లు ధరించి అసెంబ్లీకి వెళ్లాలని ఆమె సూచించారు. దీంతో బెంగాల్లో ఏం జరగబోతోందో అన్న ఉత్కంఠ పెరుగుతోంది.
పశ్చిమ బెంగాల్లో ఓటమి పాలైన తమ ఎమ్మెల్యేలను బలవంతంగా ఓడించారని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ఇందుకు కారణం పశ్చిమ బెంగాల్ పోలీసులు, సీఆర్పీఎఫ్, బీజేపీ అనుకూల ప్రధాన ఎన్నికల అధికారి, ఈసీఐ అని ఆరోపించారు. 1500కు పైగా పార్టీ కార్యాలయాలను హైజాక్ చేశారన్నారు. తనను గేలి చేసి, తోసేశారని, తనకు ఛాతీ నొప్పి వచ్చిందని తెలిపారు. ఇది ఎన్నిక కాదు, ఒక ఘోరం, అని టీఎంసీ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో సీఎం మమతా బెనర్జీ అన్నారు.

బెంగాల్ తర్వాత ఇప్పుడు ఇండియా కూటమి ఏకమైందని, తాను రాజీనామా చేయనని మమత తెలిపారు. తనను తొలగించనివ్వండి అంటూ వ్యాఖ్యానించారు. ఇది ఒక బ్లాక్ డే గా మిగిలిపోవాలని తాను కోరుకుంటున్నట్లు వెల్లడించారు. మనం బలంగా ఉండాలని, అసెంబ్లీ మొదటి రోజున నల్ల దుస్తులు ధరించాలని, ద్రోహం చేసిన వారిని పార్టీ నుండి తొలగిస్తామని మమత కీలక వ్యాఖ్యలు చేశారు. తాను వారిని నైతికంగా ఓడించానని,తాను స్వేచ్ఛా పక్షిని అని మమత తెలిపారు. తాను అందరి కోసం పనిచేశానని , తాము ఓడిపోయి ఉండవచ్చు, కానీ పోరాడతామని దీదీ తెలిపారు. హోం మంత్రి, ప్రధాని ఇందులో ప్రత్యక్షంగా పాలుపంచుకుంటున్నారన్నారు.














Click it and Unblock the Notifications