Mamata Banerjee: రాజీనామా చేయను..! మమత మరో బిగ్ షాక్..!
పశ్చిమ బెంగాల్లో నిన్న జరిగిన ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) తన సీఎం పదవికి రాజీనామా చేసేందుకు నిరాకరించారు. ఈ మేరకు నిన్న జరిగిన ఎన్నికల కౌంటింగ్ అక్రమాలపై ఇవాళ ప్రెస్ మీట్ పెట్టిన మమత.. ఈసీ, బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని దీదీ స్పష్టం చేశారు.
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తాను 'నైతిక విజయం' సాధించినట్లు మమత పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో బీజేపీయే భారీ అవకతవకలకు పాల్పడిందని ఆమె ఆరోపించారు.తన రాజీనామా ప్రసక్తే లేదని, తాను రాజీనామా చేయనని మమత తేల్చిచెప్పేశారు. తాము ఎన్నికల్లో ఓడిపోలేదన్నారు. తమ పార్టీని 'మొత్తం కేంద్ర యంత్రాంగం' లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. రాజ్ భవన్ కు వెళ్తారా అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. నైతికంగా తామే గెలిచామన్నారు.

ప్రధానమంత్రి, హోంమంత్రితో సహా మొత్తం యంత్రాంగానికి వ్యతిరేకంగా తాము పోరాడామని, ఇందులో వారు ప్రత్యక్ష జోక్యం చేసుకున్నారని మమత ఆరోపించారు. వారు ఓటర్ల జాబితా నుండి 90 లక్షల పేర్లను తొలగించారని, తాము కోర్టును ఆశ్రయించినప్పుడు, 32 లక్షల పేర్లను పునరుద్ధరించారని గుర్తుచేశారు కానీ, ఒకేసారి సమర్పించిన మరో ఏడు లక్షల పేర్లను కూడా తర్వాత చేర్చారని, ఆ విషయం ఎవరికీ తెలియదని మీకు తెలుసా? అని అడిగారు. ఎంతటి నీచమైన, హేయమైన, కుయుక్తితో కూడిన ఆటలు ఆడారో ఇది చూపిస్తుందన్నారు. తన జీవితంలో ఇలాంటి ఎన్నికలను ఎప్పుడూ చూడలేదని, తన విద్యార్థి రోజుల నుండి ఎన్నో ఎన్నికలను చూశానని తెలిపారు. 2004లో తాను ఒంటరిగా ఉన్నప్పుడు కూడా చూశానని, కానీ ఇంతటి అకృత్యాలను ఎప్పుడూ చూడలేదన్నారు.














Click it and Unblock the Notifications