డయాబెటిస్ బారిన పడిన చిన్నారుల కోసం కేంద్రం కీలక నిర్ణయం.. ఇక నో టెన్షన్!
తెలంగాణా రాష్ట్రంలోనూ, దేశ వ్యాప్తంగా చిన్నారులు పెద్ద సంఖ్యలో మధుమేహం బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో మధుమేహులలో 18.5శాతం మంది చిన్నారులు టైప్ 1 డయాబెటిస్ బాధితులుగా ఉన్నారు. వీరంతా చిన్న వయసు నుండే డయాబెటిస్ తో బాధపడుతున్నారు. వీరికి చికిత్స అందించడం తల్లిదండ్రులకు ఆర్థికంగా పెనుభారంగా మారుతుంది.
డయాబెటిస్ చిన్నారుల కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
ఈ క్రమంలో మధుమేహ బాధితులైన చిన్నారుల కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారికి అండగా ఉండాలని నిర్ణయించింది. టైప్ 1 డయాబెటిస్ మరియు పీడియాట్రిక్ టైప్ 2 డయాబెటిస్ ను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సమగ్ర మార్గదర్శకాలను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. వ్యాధిని గుర్తించడంతో పాటు, నియంత్రించడం, చికిత్స చేయడం, అవగాహన కార్యక్రమాలపైన కూడా ప్రణాళికను రూపొందించింది.

రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం .. డయాబెటిస్ పరీక్షలు
రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం ద్వారా ఇప్పటికే అంగన్వాడీ కేంద్రాలలో, పాఠశాలలలో పిల్లలకు కంటి సమస్యలు, రక్తహీనత వంటి వ్యాధులను గుర్తించే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఆర్ బి ఎస్ కే 2.0 మార్గదర్శకాల ప్రకారం కేంద్రం నిర్ణయించిన మేరకు ఇకపైన చిన్నారులలో మధుమేహ పరీక్షలను విస్తృతంగా చేపడతారు. వ్యాధిని గుర్తిస్తే జిల్లా స్థాయిలో ఉచిత చికిత్సను అందిస్తారు.
రాష్ట్రంలోని 35 వైద్య కళాశాలలలో చిన్నారులకు చికిత్స
ఆర్బిఎస్కే బృందాలు పిల్లలు, ఉపాధ్యాయులను 10 రకాల ప్రశ్నలు అడిగి డయాబెటిస్ లక్షణాలను గుర్తిస్తారు. డయాబెటిస్ బారిన పడ్డారు అని అనుమానం వస్తే స్పెషలిస్ట్ వైద్యులకు రిఫర్ చేస్తారు. నిర్ధారణ అయితే వారికి చికిత్స తో పాటు సరైన ఆహారం, వ్యాయామాలపైన కూడా సలహాలు ఇస్తారు. అయితే కేంద్రం నిర్ణయంతో త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలోని 35 వైద్య కళాశాలలలో దీనికి సంబంధించిన చికిత్స విధానాన్ని ప్రారంభించే అవకాశం ఉంది.
చిన్నారుల మధుమేహ సమస్యలను ఎదుర్కోవడంలో ముఖ్యమైన మైలురాయి
ఒకప్పుడు పిల్లలలో టైప్ 1 డయాబెటిస్ ఎక్కువగా ఉంటే, ఇప్పుడు పిల్లలలో పీడియాట్రిక్ టైప్ 2 డయాబెటిస్ ప్రమాదకరంగా పెరుగుతుంది. ఎలాంటి లక్షణాలు కనిపించకుండా వారికి డయాబెటిస్ వస్తుంది. దీంతో వారికి కిడ్నీ సమస్యలు, అమ్మాయిలను పిసిఓడి సమస్యలు వస్తున్నాయి. సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకొని మందులు ఉపయోగిస్తూ, జీవనశైలి మార్పులు చేసుకుంటే వీరు మధుమేహం బారి నుండి కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఈ కేంద్ర ప్రభుత్వం చర్యలు చిన్నారుల మధుమేహ సమస్యలను ఎదుర్కోవడంలో ముఖ్యమైన మైలురాయిగా చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications