అమెజాన్ నుంచి వెరీ బ్యాడ్ న్యూస్
ప్రఖ్యాత ఇ- కామర్స్ ప్లాట్ ఫామ్ అమెజాన్ లేఆఫ్స్ ప్రకటించింది. హెచ్‌ఆర్ విభాగంలోని దాదాపు 15 శాతం మంది ఉద్యోగులను తొలగించనుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను అడాప్ట్ చేసుకుంటోన్నందున ఈ నిర్ణయం తీసుకుంది. సంస్థను పునర్వ్యవస్థీకరించనుంది. తాజా లేఆఫ్స్ వల్ల అమెజాన్ లో ఎంత మంది ఉద్యోగులు ప్రభావితమౌతారనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు గానీ 15 శాతం వరకు వేటు పడే అవకాశం ఉంది.
అమెజాన్ లో 'పీపుల్ ఎక్స్‌పీరియన్స్ అండ్ టెక్నాలజీ టీమ్ గా పిలుస్తారు హెచ్ ఆర్ విభాగాన్ని. ఇక్కడ ఉద్యోగులు చేసే మెజారిటీ పనులను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నిర్వహించాలని మేనేజ్మెంట్ నిర్ణయించింది. ఫలితంగా 15 శాతం మంది సిబ్బందిని తగ్గించేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తున్నట్లు ఫార్చూన్ వెల్లడించింది. దీనిపై ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. హెచ్‌ఆర్ యూనిట్ తో పాటు ఇతర విభాగాల్లో కూడా ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది.

దీనివల్ల ఎంతమంది ఉద్యోగులు ప్రభావితమౌతారు, లేఆఫ్స్ ఎప్పటి నుండి ఉండొచ్చు అనేది ఇంకా తెలియరాలేదు. దీనిపై అందిన వివరాలు ఇంకా అస్పష్టంగా ఉన్నాయని ఫార్చూన్ తెలిపింది. కంపెనీ కన్జ్యూమర్ డివైస్ గ్రూప్, వండరీ పాడ్‌క్యాస్ట్ విభాగం, అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS)లో చిన్నపాటి తొలగింపులు ఇదివరకే చోటు చేసుకున్నాయి. ఆ కొద్ది నెలలకే ఈ నిర్ణయం వెలువడటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఆటోమేషన్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వైపు అమెజాన్ మొగ్గు చూపుతున్నందున అంచనాలకు మించి లేఆఫ్స్ ఉంటాయని ఫార్చూన్ అంచనావేసింది. AI పై ఆధారపడటం వల్ల మానవ వనరులను తగ్గించుకుంటోంది అమెజాన్. దీంతో పాటు క్లౌడ్ కార్యకలాపాల కోసం బిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు చేస్తోంది. ఎంటర్‌ప్రైజ్ క్లయింట్‌ల కోసం AI మౌలిక సదుపాయాలకు మరింత ఊపు ఇచ్చేలా డేటా కేంద్రాలను నిర్మించడానికి అమెజాన్ ఈ సంవత్సరం మూలధన పెట్టుబడిపై 100 బిలియన్ డాలర్లు ఖర్చు చేయనుంది.
అలాగే- డిమాండ్‌కు అనుగుణంగా చిన్న తరహా రిటైల్ స్టోర్స్ ను నిర్మిస్తోంది. గోడౌన్లు, లాజిస్టిక్స్ నెట్‌వర్క్ కోసం భారీ ఎత్తున తాత్కాలిక ఉద్యోగులను నియమించుకోనున్నట్లు అమెజాన్ ఇటీవలే ప్రకటించింది. లాజిస్టిక్ విభాగంలో కూడా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను అడాప్ట్ చేసుకునే అవకాశాలను సంస్థ పరిశీలిస్తోంది. మ్యాపింగ్ వంటి కార్యకలాపాలన్నీ దీని మీదే ఆధారపడేలా ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications