AI ఎవ్వరిని వదలట్లేదు: మరో 4000 ఉద్యోగాలు...
Salesforce layoffs 2025: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్.. కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కొమ్ములు తిరిగిన కంపెనీలు కూడా దీని బారిన పడుతున్నాయి. భారీగా ఉద్యోగాల్లో కోత పెడుతున్నాయి. గూగుల్, మెటా, టీసీఎస్, మైక్రోసాఫ్ట్.. వంటి సంస్థలు సైతం ఇదివరకే దశలవారీగా లేఆఫ్స్ ప్రకటించాయి. ఇప్పుడు తాజాగా మరో దిగ్గజం ఈ జాబితాలో చేరింది. వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
అదే- సేల్స్‌ఫోర్స్. అమెరికన్ క్లౌడ్ సాఫ్ట్‌వేర్ దిగ్గజం. తాజాగా 4,000 కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాలను తగ్గించింది. మనుషులు నిర్వహించే పనులను ఇప్పుడు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేపట్టడానికి సేల్స్‌ఫోర్స్ మొగ్గు చూపుతోంది. దీనిపై ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ బెనియాఫ్ లోగాన్ వెల్లడించారు. ఈ మేరకు ఓ పాడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడారు. సపోర్ట్ టీమ్ ఉద్యోగుల సంఖ్యను 9,000 నుండి 5,000 మందికి తగ్గించినట్లు ఆయన వెల్లడించారు.

సపోర్ట్ డివిజన్ లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను అడాప్ట్ చేసుకుంటోన్నామని, ఈ డివిజన్ లో ఉద్యోగుల సంఖ్యను సర్దుబాటు చేశామని అన్నారు. ఏఐ రాక వల్ల 9,000 మంది ఉద్యోగులు అవసం లేదని భావించినట్లు తెలిపారు. తక్కువ మందితోనే నడిపించాలని నిర్ణయించామని, అందుకే ఉద్యోగుల సంఖ్యను 9,000 నుండి సుమారు 5,000 మందికి తగ్గించానని బెనియాఫ్ పేర్కొన్నారు.
ఈ నిర్ణయం- రెండు నెలల ముందు బెనియాఫ్ చేసిన వ్యాఖ్యలకు పూర్తి విరుద్ధం. AI ఉద్యోగులను భర్తీ చేయడానికి కాకుండా వారికి సహాయపడటానికేనని ఈ ఏడాది జులైలో ఫార్చ్యూన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఏఐ వల్ల వర్క్ ఫోర్స్ ను తగ్గించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. ఉద్యోగాలను కోల్పోతోండటం సరికాదని, దీనివల్ల భయానక పరిస్థితి నెలకొందనే వాదనలను ఆయన తోసిపుచ్చారు. ఏఐలో ఖచ్చితత్వం లేదనీ వ్యాఖ్యానించారు.
తాజాగా లేఆఫ్స్ ప్రకటించడం చర్చనీయాంశమైంది. సేల్స్‌ఫోర్స్ సపోర్ట్‌లో మాత్రమే కాకుండా సేల్స్‌లో కూడా AIని ఉపయోగిస్తోంది. గత 26 సంవత్సరాలలో సేకరించిన 100 మిలియన్లకు పైగా కాల్ చేయని సేల్స్ లీడ్‌ల భారీ బ్యాక్‌లాగ్‌ను ఉందీ కంపెనీకి. మనుషులు, AI ఏజెంట్లు పని భారాన్ని ఎలా పంచుకుంటున్నారో పర్యవేక్షించడానికి సేల్స్‌ఫోర్స్ ఓమ్నిచానెల్ సూపర్‌వైజర్ వ్యవస్థను ప్రవేశపెట్టింది.
జరిగిన పరిణామాలపై సేల్స్‌ఫోర్స్ అధికార ప్రతినిధి ఒకరు స్పందించారు. ఈ ఏడాది ప్రారంభంలో తాము help.agentforce.comను ప్రారంభించినట్లు వెల్లడించారు. ఏజెంట్‌ఫోర్స్ వల్ల కలిగిన ప్రయోజనాలు, సామర్థ్యాల కారణంగా, తాము నిర్వహిస్తున్న సపోర్ట్ కేసులు తగ్గాయని వివరించారు. దీంతో సపోర్ట్ ఇంజనీర్ పాత్రలను తిరిగి భర్తీ చేయాల్సిన అవసరం లేకుండా పోయిందని చెప్పిన అధికార ప్రతినిధి... తాము వందలాది మంది ఉద్యోగులను ప్రొఫెషనల్ సర్వీసెస్, సేల్స్, కస్టమర్ సక్సెస్ వంటి ఇతర విభాగాల్లో విజయవంతంగా తిరిగి నియమించినట్లు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications