చిన్న పిల్లలను అలాంటి కంటెంట్ కు దూరంగా ఉంచేలా.. స్పెషల్ AI టూల్
Baby Grok: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సెగ్మెంట్ లో మరో సంచలనానికి అడుగు ముందుకు పడింది. మొన్నటికి మొన్న అపర కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన xAI సరికొత్త మోడల్ గ్రోక్ 4 (Grok 4) ను ఆవిష్కరించింది. ఈ లాంచ్ ఈవెంట్ ను ఎక్స్ .. ప్రత్యక్ష ప్రసారం చేసింది.
ప్రస్తుతం ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ హవా నడుస్తోన్న విషయం తెలిసిందే. దేనికైనా ఇట్టే సమాధానం ఇవ్వగల సామర్థ్యం వీటికి ఉంది. గ్రోక్, ఛాట్ జీపీటీ-3, జెమిని ఏఐ 2.5 ప్రో, కొపైలెట్.. వంటి ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ ఫామ్స్ ప్రస్తుతం అందుబాటులో ఉంటోన్నాయి.

దీనికి తోడుగా కొత్తగా గ్రోక్ 4ను అందుబాటులోకి తీసుకొచ్చింది ఎక్స్ ఏఐ. ఇప్పుడున్న కాంపిటీటివ్ ప్లాట్ ఫామ్స్ కంటే కూడా ఇది ఎంతో మెరుగ్గా, మెరుపు వేగంతో పని చేస్తుందని ఎక్స్ ఏఐ తెలిపింది. యూజర్లు అడిగిన ఏ ప్రశ్నకు అయినా దాదాపుగా వంద శాతం ఖచ్చితత్వంతో కూడుకున్న సమాధానాలను ఇవ్వగలుగుతుందని, దీనికి అవసరమైన సోర్స్ కూడా అందిస్తుందని పేర్కొంది.
ఇప్పుడు తాజాగా చిన్న పిల్లల కోసం బేబీ గ్రోక్ (Baby Grok)ను రూపొందించనున్నట్లు ఎలాన్ మస్క్ ప్రకటించారు. దీనికి సంబంధించిన యాప్ ను రూపొందించే పనిలో ఉన్నట్లు తెలిపారు. ఈ యాప్ చిల్డ్రన్ ఫ్రెండ్లీ కంటెంట్ ను అందిస్తుందని చెప్పారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (X) పై దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు.
ఈ యాప్ గురించి పూర్తి వివరాలను మస్క్ వెల్లడించలేదు. Grok 4 చాట్‌బాట్‌ను విడుదల చేసిన ఇది తెర మీదికి రావడం గమనార్హం. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాధిస్తోన్న పురోగతికి ఇది అద్దం పడుతోంది. నిజానికి- గ్రోక్ చాట్‌బాట్ గతంలో యూదు వ్యతిరేక వ్యాఖ్యలను షేర్ చేసినందుకు విమర్శలు ఎదుర్కొంది.
ఈ నేపథ్యంలో తాజా అప్‌డేట్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉండగా, ఎలాన్ మస్క్ 2018లో OpenAI నుండి వైదొలిగారు. ఆ తరువాత ChatGPT, క్లౌడ్, పర్‌ప్లెక్సిటీ, గూగుల్ జెమిని వంటి వాటికి పోటీగా గ్రోక్‌ను రూపొందించారు. ప్రస్తుతం గ్రోక్ వెబ్ బ్రౌజర్, iOS, ఆండ్రాయిడ్ మొబైల్ యాప్, డెస్క్‌టాప్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంది.
టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ కూడా గ్రోక్ త్వరలో టెలిగ్రామ్ యూజర్లకు అందుబాటులోకి వస్తుందని ప్రకటించారు. మరోవైపు గూగుల్ కూడా పిల్లల కోసం ప్రత్యేక జెమిని యాప్‌పై పనిచేస్తోంది. ఇది పిల్లలకు హోంవర్క్ చేయడానికి, ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి సహాయపడుతుంది.












Click it and Unblock the Notifications