నో VFX.. ఓన్లీ AI: ఆ నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ కు జనం బ్రహ్మరథం
టాప్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్.. సంచలనాలకు తెర తీసింది. తన సినిమాలు, వెబ్ సిరీస్ ల కోసం పూర్తిస్థాయిలో ఆర్టిపీషియల్ ఇంటెలిజెన్స్ పై ఆధారపడబోతోంది. చౌకగా, మరింత మెరుగ్గా సన్నివేశాలను తెరకెక్కించడానికి AIని ఉపయోగించనున్నట్లు తెలిపింది.
అర్జెంటీనాకు చెందిన సైన్స్ ఫిక్షన్ సిరీస్ 'ది ఎటర్నౌట్' లో ఈ దిశగా ఓ ప్రయోగం చేసింది నెట్ ఫ్లిక్స్. ఇది కాస్తా గ్రాండ్ సక్సెస్ కావడంతో ఇక ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను వినియోగించడానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది. ది ఎటర్నౌట్ సిరీస్ లో తొలిసారిగా జనరేటివ్ AIని ఉపయోగించినట్లు నెట్‌ఫ్లిక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టెడ్ సరాండోస్ వెల్లడించారు.

నెట్‌ఫ్లిక్స్ తాజాగా తన రెండో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. ఈ సందర్భంగా సరాండోస్ మాట్లాడారు. సినిమాలు, వెబ్ సిరీస్‌లను మరింత మెరుగ్గా రూపొందించడానికి AI ఒక గొప్ప అవకాశమని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఇది ఖర్చులను కూడా తగ్గిస్తుందని పేర్కొన్నారు.
బునోస్ ఎయిర్స్‌లో ఒక భవనం కూలిపోయే సన్నివేశాన్ని చిత్రీకరించడానికి ది ఎటర్నౌట్ లో జనరేటివ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించినట్లు తెలిపారు. ప్రాణాంతకమైన మంచు తుఫాను బారిన పడి ప్రాణాలను కోల్పోతున్న ప్రజలను ఎలా రక్షించారు? దాని నుంచి హీరో, అతని టీమ్ ఎలా బయటపడిందనేది ఎటర్నౌట్ కథాంశం. అర్జెంటీనాకు చెందిన సైన్స్ ఫిక్షన్ సిరీస్ ఇది.
ఇప్పటిదాకా నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్స్ లేదా సినిమాలతో పోల్చుకుంటే AI ద్వారా రూపొందించిన మొట్టమొదటి ఫైనల్ ఫుటేజీ సిరీస్ ఇదేనని సరండాస్ అన్నారు. విజువల్ ఎఫెక్ట్స్ టీమ్ ను ఆయన ప్రశంసించారు. ఆర్టిపీషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉపయోగించి అద్భుతమైన ఫలితాన్ని సాధించారని సరాండోస్ కొనియాడారు.
సంప్రదాయ వీఎఫ్ఎక్స్, వర్క్ ఫ్లోలతో పోలిస్తే జనరేటివ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సీక్వెన్స్ 10 రెట్లు వేగంగా పూర్తయిందని ఆయన అన్నారు. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ సిరీస్ లో AI ద్వారా నమ్మశక్యం కాని సన్నివేశాలను తెరకెక్కించామని, అదే దీని గొప్పతనమని సరాండోస్ చెప్పారు. AI లేకపోతే ఈ స్థాయి ఎఫెక్ట్స్ చూపించడం అనేది సాధ్యమయ్యేది కాదని ఆయన స్పష్టం చేశారు.
మూవీ, టీవీ, వెబ్ సిరీస్ ఇండస్ట్రీని AI ఆక్రమించుకుంటుందనే వాదనలను సరండాస్ కొట్టిపారేశారు. అలా జరగుతుందని అనుకోవట్లేదని చెప్పారు. ఏఐ ఆధారిత టూల్స్ ఉపయోగిస్తున్న వారు ప్రీ-విజువలైజేషన్, షాట్ ప్లానింగ్ కు మాత్రమే పరిమితం కావొచ్చని చెప్పారు. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్‌లో దీని ప్రభావం చాలా ఉంటుందని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications