అమెరికాపై డ్రాగన్ దాడి.. ఇరాన్ చేతికి యుద్ధ వ్యూహాలు!
ఆధునిక యుద్ధతంత్రం ఇప్పుడు తుపాకులు, క్షిపణుల నుంచి అదృశ్యమైన 'డిజిటల్ కోడ్స్', 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (AI) వైపు మళ్లింది. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ జ్వాలల వెనుక చైనా తన 'ఏఐ' మేధస్సుతో ఆడుతున్న ప్రమాదకరమైన చదరంగం ఇప్పుడు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. అమెరికా సైనిక రహస్యాలను ఇరాన్‌కు చేరవేస్తూ.. డ్రాగన్ వెన్నుపోటు రాజకీయాలకు తెరలేపిందన్న సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి.
పశ్చిమాసియాలో అమెరికా మోహరించిన అత్యాధునిక యుద్ధ విమానాలు, భారీ విమానవాహక నౌకలు, రహస్య ఆయుధ నిల్వలు.. ఇప్పుడు ఏవీ రహస్యం కావు! చైనాకు చెందిన ప్రైవేట్ టెక్ కంపెనీలు తమ 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' శక్తితో అమెరికా ప్రతి కదలికను క్షణక్షణం పర్యవేక్షిస్తున్నాయి. కేవలం సామాన్యులకు అందుబాటులో ఉండే ఉపగ్రహ చిత్రాలు (Satellite Images), ఫ్లైట్ ట్రాకర్లు, నౌకా రవాణా సమాచారం వంటి 'ఓపెన్ సోర్స్' డేటాను ఏఐ అల్గారిథమ్స్ ద్వారా విశ్లేషించి, అమెరికా యుద్ధ వ్యూహాలను ఇరాన్ సైనిక ఉన్నతాధికారుల చేతుల్లో పెడుతున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

పైకి శాంతి మంత్రం.. లోపల యుద్ధ తంత్రం!..
యుద్ధాన్ని ఆపాలని ప్రపంచ దేశాల ముందు నీతులు చెబుతున్న చైనా, తెరవెనుక మాత్రం ఇరాన్‌కు అండగా నిలుస్తూ అమెరికాను దెబ్బతీసేందుకు పక్కా ప్లాన్ వేసింది. ఒకప్పుడు కేవలం అగ్రరాజ్యాల నిఘా సంస్థలకు మాత్రమే సాధ్యమయ్యే అత్యంత రహస్య సమాచారం, ఇప్పుడు ఏఐ రాకతో ప్రైవేట్ వ్యక్తులకు, టెక్ కంపెనీలకు చిక్కుతోంది. ఈ టెక్నాలజీని ఉపయోగించి ఎవరైనా, ఎక్కడి నుంచైనా యుద్ధ విమానాల కమ్యూనికేషన్లను విశ్లేషించవచ్చని, ఇది కేవలం అమెరికాకే కాకుండా ప్రపంచ దేశాలన్నింటి భద్రతకు పెను ముప్పు అని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
స్టెల్త్ టెక్నాలజీకే సవాలు.. ఆందోళనలో వాషింగ్టన్!..
రాడార్లకు కూడా దొరకని అమెరికా 'స్టెల్త్ బాంబర్ల' కమ్యూనికేషన్లను సైతం చైనా ఏఐ విశ్లేషిస్తోందన్న వార్త వాషింగ్టన్ వర్గాలను కలవరపెడుతోంది. "ఏఐ దృష్టిలో ఏదీ రహస్యం కాదు" అనే నినాదంతో చైనా కంపెనీలు ఈ ఇంటెలిజెన్స్‌ను విక్రయిస్తున్నాయి. తన 'సివిల్-మిలిటరీ ఇంటిగ్రేషన్' వ్యూహంలో భాగంగా చైనా ప్రభుత్వం ఇలాంటి స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహిస్తూ, వాటిని పరోక్షంగా ఇరాన్ వంటి దేశాలకు సహాయం చేయడానికి వాడుకుంటోంది. ఈ అదృశ్య డిజిటల్ ముప్పును ఎలా ఎదుర్కోవాలో తెలియక అగ్రరాజ్య రక్షణ నిపుణులు తలలు పట్టుకుంటున్నారు.












Click it and Unblock the Notifications