బాలయ్య క్లాప్ కొడితే.. బాక్సాఫీస్ బద్ధలవ్వాల్సిందే!
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బాలయ్య క్లాప్ కొడితే చాలు.. బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే అనే సెంటిమెంట్ దశాబ్దాల నుంచి ఉంది. ఆ సెంటిమెంట్‌ను నిజం చేస్తూ, తెలుగు సినిమా చరిత్రలో సరికొత్త మైలురాయిని సృష్టించిన చిత్రం 'ఘరానా మొగుడు'. సరిగ్గా 34 ఏళ్ల క్రితం 'ఘరానా మొగుడు' చిత్రానికి నందమూరి బాలకృష్ణ ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టి ఆ శుభారంభాన్ని ఇచ్చారు.
దీంతో వసూళ్ల విషయంలో టాలీవుడ్ స్థాయిని ప్రపంచానికి చాటిచెప్పింది 'ఘరానా మొగుడు'. 1992 ఏప్రిల్ 9న విడుదలైన ఈ చిత్రం, తెలుగు సినిమా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 10 కోట్ల షేర్ వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. అప్పట్లో ఒక ప్రాంతీయ సినిమా ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం వాణిజ్య పండితులను సైతం విస్మయానికి గురిచేసింది. దీంతో మెగాస్టార్ క్రేజ్ ఆకాశాన్ని తాకింది.

బిగ్గర్ దేన్ బచ్చన్ అని వార్తలు వచ్చాయి
'ఘరానా మొగుడు' సృష్టించిన ప్రభంజనం కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు. అప్పట్లో బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్‌ను మించి చిరంజీవి రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని వార్తలు రావడంతో, 'మలయాళ మనోరమ' మేగజైన్ చిరంజీవి ఫోటోతో 'బిగ్గర్ దేన్ బచ్చన్' అనే కవర్ స్టోరీని ప్రచురించింది. ఒక దక్షిణాది హీరో గురించి జాతీయ స్థాయిలో ఇంత చర్చ జరగడం అదే మొదటిసారి. దీనితో చిరంజీవి కేవలం టాలీవుడ్ మెగాస్టార్ మాత్రమే కాదు, ఇండియన్ సూపర్ స్టార్ అని నిరూపితమైంది.
నవశకానికి నాంది
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, చిరంజీవి కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఒక విజయవంతమైన 'బ్రాండ్'గా మారింది. వీరిద్దరూ కలిసి వరుసగా మూడేళ్లపాటు మూడు బ్లాక్ బస్టర్లు ఇవ్వడం ఒక అరుదైన రికార్డు. 1990లో 'జగదేక వీరుడు అతిలోక సుందరి', 1991లో 'రౌడీ అల్లుడు', 1992లో 'ఘరానా మొగుడు' చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద హ్యాట్రిక్ హిట్స్ సాధించి తెలుగు సినిమా మార్కెట్ పరిధిని భారీగా విస్తరించారు.
ఈ సినిమాలో చిరంజీవి చేసిన "కొంచెం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో" అనే డైలాగ్, ఎడమ చేతిని వెనక్కి పెట్టి నమస్కారం చేసే స్టైల్ ఆ జనరేషన్‌ను ఊపేసింది. కీరవాణి అందించిన 'బంగారు కోడిపెట్ట' పాట మాస్ ఆడియన్స్‌తో థియేటర్లలో డాన్సులు వేయించింది. వాణి విశ్వనాథ్‌తో చేసిన 'అబ్బా ఇదేమీ వాన' సాంగ్ అప్పట్లో ఒక సంచలనం. ఇలా మాస్, క్లాస్, కామెడీ, సెంటిమెంట్ కలిసి తయారైన ఈ సినిమా చిరంజీవి నవశకానికి నాంది పలికింది.












Click it and Unblock the Notifications