ధురంధర్2, ఉస్తాద్ భగత్ సింగ్.. వీటిల్లో ఏ సినిమాకు వెళ్లాలి?
ప్రస్తుతం రెండు అగ్ర చిత్రాల మధ్య ఆసక్తికరమైన పోరు సాగుతోంది. ఒకవైపు యుద్ధతంత్రం, దేశభక్తి కలగలిసిన 'ధురంధర్ 2' ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంటే, మరోవైపు పక్కా మాస్ అంశాలతో 'ఉస్తాద్ భగత్ సింగ్' థియేటర్లను హోరెత్తిస్తోంది. అయితే, కథాబలం, వసూళ్ల పరంగా చూసుకుంటే'ధురంధర్ 2' పైచేయి సాధించి విజేతగా దూసుకుపోతోంది.
ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి
దర్శకుడు ఆదిత్యధర్ తీర్చిదిద్దిన'ధురంధర్ 2' కేవలం ఒక సినిమాగా కాకుండా, ప్రేక్షకుడికి ఒక సరికొత్త అనుభూతిని పంచడంలో విజయవంతమైంది. వాస్తవ ఘటనలను కళ్లకు కట్టినట్లు చూపడం, హమ్జా పాత్రలో రణ్‌వీర్ సింగ్ మైండ్ గేమ్, ఊహకందని ట్విస్ట్‌లు ఈ సినిమాను భారీ బ్లాక్ బస్టర్ దిశగా పయనింపచేస్తున్నాయి. నాలుగు గంటల నిడివి ఉన్నప్పటికీ, దర్శకుడు మెయింటైన్ చేసిన ఉత్కంఠ వల్ల కుటుంబ ప్రేక్షకులు, క్లాస్ ఆడియన్స్... మాస్ ఆడియన్స్ తో కలిసి ఈ చిత్రానికే నీరాజనాలు పడుతున్నారు. 'కల్ట్ క్లాసిక్' స్టేటస్‌ను ధురంధర్ 2 సొంతం చేసుకుంది. నిజ జీవితంలోని పాత్రలను వెండితెరపై చూస్తున్న ప్రేక్షకులు మైమరిచిపోతున్నారు.

మాస్ సెంటర్లు షేక్
పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో 'ఉస్తాద్ భగత్ సింగ్'తో మాస్ సెంటర్లను షేక్ చేస్తున్నారు. హరీష్ శంకర్ మార్క్ డైలాగులు, పవర్ స్టార్ మేనరిజమ్స్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నాయి. అయితే, ఈ సినిమా ప్రధానంగా మాస్ ప్రేక్షకులను, ఫ్యాన్స్‌ను మాత్రమే దృష్టిలో పెట్టుకుని తీయడంతో, కంటెంట్ పరంగా 'ధురంధర్ 2'తో పోలిస్తే కొంచెం వెనుకబడింది. బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ సాధించినప్పటికీ, లాంగ్ రన్‌లో నిలబడాలంటే ఈ చిత్రం పెద్ద మాయాజాలం చేయాల్సిందే.
ప్రస్తుతానికి కలెక్షన్ల పరంగా, విమర్శకుల ప్రశంసల పరంగా 'ధురంధర్ 2' రికార్డులను తిరగరాస్తోంది. 'ఉస్తాద్ భగత్ సింగ్' పవన్ కళ్యాణ్ స్టామినాతో తన ఉనికిని చాటుకుంటున్నప్పటికీ, 'ధురంధర్ 2' సృష్టించిన ప్రభంజనాన్ని ఉస్తాద్ తట్టుకోలేకపోతోంది. విభిన్నమైన కథలను ఇష్టపడే ప్రేక్షకులు 'ధురంధర్2'కు పట్టం కడుతుండగా, కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే వారు 'ఉస్తాద్' వైపు మొగ్గు చూపుతున్నారు.












Click it and Unblock the Notifications