మెగాస్టార్ "మన శంకర వరప్రసాద్ గారు" సినిమా చూస్తూ అభిమాని మృతి...
మెగాస్టార్ చిరంజీవి నటించిన "మన శంకర వరప్రసాద్ గారు" ఈరోజు ( జనవరి 12, 2026 ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అపజయమే ఎరుగని దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది. వింటేజ్ బాస్ ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మొత్తానికి మరోసారి తన మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో చిరు - అనిల్ కాంబో ప్రేక్షకులను అలరించాడన్న అభిప్రాయం వినిపిస్తోంది. థియేటర్లలో అభిమానుల పూనకాలతో సినిమా సందడి నెలకొన్న ఈ సమయంలో ఒక విషాదకర ఘటన చోటుచేసుకోవడం అందరినీ కలచివేసింది.
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ప్రాంతంలో ఉన్న అర్జున్ థియేటర్‌లో ఈ సినిమా చూస్తున్న ఓ అభిమాని గుండెపోటుతో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఉదయం 11:30 గంటల షోకు మెగాస్టార్ చిరంజీవి వీరాభిమాని అయిన ఆనంద్ కుమార్ (రిటైర్డ్ ఏఎస్సై) థియేటర్‌కు వచ్చారు. సినిమా ప్రారంభమైన తర్వాత ఉత్సాహంగా సాగుతున్న సమయంలో ఆయన అకస్మాత్తుగా సీట్లోనే కుప్పకూలిపోయారు.

ఈ ఘటనను గమనించిన పక్కన ఉన్న ప్రేక్షకులు వెంటనే థియేటర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన యాజమాన్యం, ఆనంద్ కుమార్‌ను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రాథమికంగా తీవ్రమైన గుండెపోటే మరణానికి కారణమని వైద్యులు వెల్లడించారు. పోలీసుల సమాచారం ప్రకారం.. ఆనంద్ కుమార్ పోలీస్ శాఖలో పనిచేసి పదవీ విరమణ పొందారు. చిరంజీవి సినిమాలంటే ఆయనకు విపరీతమైన అభిమానం ఉండేదని.. అందుకే మొదటి షోకే సినిమా చూడటానికి వచ్చారని కుటుంబ సభ్యులు తెలిపారు. అభిమాన హీరో సినిమాను వెండితెరపై చూస్తూ ఆనందంగా గడపాల్సిన క్షణాల్లోనే ఆయన ఇలా ప్రాణాలు కోల్పోవడం అందరినీ తీవ్రంగా కలిచివేసింది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న కూకట్‌పల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మరణానికి గల ఖచ్చితమైన కారణం వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోంది. సోషల్ మీడియాలో కూడా ఈ ఘటనపై సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు సినిమా ఘన విజయం అభిమానులను ఆనందంలో ఉంచితే.. మరోవైపు ఈ విషాద ఘటన టాలీవుడ్ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది.












Click it and Unblock the Notifications