ఐ బొమ్మ రవిని ఎన్ కౌంటర్ చేయాలి..!
తెలుగు రాష్ట్రాల్లో 'ఐబొమ్మ' వెబ్‌సైట్ ప్రధాన నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ వ్యవహారం అత్యంత చర్చనీయాంశంగా మారింది. పైరసీ కేసులో ఆయనను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2019 నుంచి ఈయన భారీ నెట్‌వర్క్‌ను నడుపుతూ వేలాది సినిమాలను చట్టవిరుద్ధంగా అప్‌లోడ్ చేస్తూ.. ఫిల్మ్ ఇండస్ట్రీకి రూ.3,000 కోట్లకు పైగా నష్టం కలిగించారని పోలీసులు వెల్లడించారు. ఈ వ్యవహారంలో నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపగా చంచల్ గూడ జైలుకు తరలించారు.
ఎలా పట్టుబడ్డాడు..?
కాగా రవి కొన్ని నెలలుగా తన భార్యతో తీవ్రమైన విభేదాలు ఎదుర్కొంటున్నాడు. విడాకులు కోసం విదేశంలో ఉన్న రవి ఇటీవల ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్‌కు రావాల్సి వచ్చింది. ఈ సమాచారాన్ని రవితో విభేదాలు ఉన్న భార్య స్వయంగా సైబర్ క్రైమ్ పోలీసులకు అందించినట్లు తెలుస్తోంది. రవి నగరానికి చేరుకున్న వెంటనే, ప్రత్యేక నిఘా వేసిన పోలీసులు పక్కా ప్రణాళికతో అతడిని అరెస్ట్ చేశారు. అయితే అత్త, భార్యాల అవమానాల కారణంగానే డబ్బు సంపాదన కోసం వెబ్ సైట్ క్రియేట్ చేసి సినిమాలు అప్లోడ్ చేసినట్టు రవి అంగీకరించారు.

ఈ విషయంపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధి సి. కల్యాణ్ రవి అరెస్ట్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పైరసీకి పాల్పడేవారిలో భయపెట్టాలంటే ఇలాంటి దోషులను ఎన్‌కౌంటర్ చేయాల్సిందే అని ఆయన వ్యాఖ్యానించడం పెద్ద సంచలనం రేపింది. ఇది పైరసీ వల్ల పరిశ్రమకు జరుగుతున్న నాశనం చూసి బాధ, ఆవేదనతో మాట్లాడుతున్నానని ఆయన స్పష్టం చేశారు. రవిని పట్టుకున్న సైబర్ క్రైమ్ అధికారులను ఫిల్మ్ ఛాంబర్ త్వరలో ఘనంగా సన్మానిస్తామని కూడా ప్రకటించారు.
ఈ సందర్భంగా సి. కల్యాణ్, ఛాంబర్ ఆధ్వర్యంలో నడుస్తున్న యాంటీ వీడియో పైరసీ సెల్ గురించి వివరించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాంటీ వీడియో పైరసీ సెల్‌ను నిర్వహిస్తున్న ఏకైక సంస్థ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ మాత్రమే అని ఆయన తెలిపారు. గతంలో ఆస్ట్రేలియాలో పైరసీ రాకెట్‌ను కూలగొట్టి ఒక నిందితుడిని పట్టుకున్న విషయాన్ని గుర్తుచేశారు.
మరోవైపు ఇమ్మడి రవి అరెస్టుపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. పరిశ్రమకు నష్టం కలిగించిన వ్యక్తి అరెస్టు కావడం ఆనందించే విషయమైనప్పటికీ.. కొందరు నెటిజన్లు మాత్రం రవికి మద్దతుగా పోస్టులు పెడుతుండటం సినీ వర్గాలను షాక్‌కు గురి చేసింది. పైరసీ వెబ్‌సైట్లు పెరగడానికి ప్రధాన కారణం సినిమా టికెట్ రేట్లు భారీగా పెరగడం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications