రూ.100 కోట్లు ఎక్కువసార్లు సాధించిన ఏకైక హీరో
భారతీయ సినీ పరిశ్రమలో ఒక సినిమా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరడమనేది చాలామందికి ఒక కల. కానీ, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు మాత్రం అది ఒక అలవాటుగా మారిపోయింది. సినిమాకు వచ్చే టాక్‌తో సంబంధం లేకుండా, హిట్ ఫ్లాపుల లెక్కల అవసరం లేకుండా బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్ల మార్కును అందుకోవడం సల్మాన్‌కు సాధారణమైపోయింది. ఇటీవల ఆయన నటించిన 'సికందర్' మూవీ కూడా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిందనే విషయం మనకు తెలిసిందే. దీనికి మురుగదాస్ దర్శకుడు. ఈ సినిమా రూ.100 కోట్లు సాధించడంద్వారా భారతీయ సినిమా చరిత్రలో సల్మాన్ ఖాన్ ఒక అరుదైన మైలురాయిని అందుకున్నారు.
ఏకంగా 18 సినిమాలు
ఏకంగా సల్మాన్ ఖాన్ నటించిన 18 సినిమాలు వరుసగా రూ.100 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించాయి. ఇండియన్ హీరోల్లో ఎక్కువసార్లు రూ.100 కోట్లు సాధించిన ఏకైక హీరోగా ఆయన్ను అగ్రస్థానంలో నిలబెట్టాయి. 'దబంగ్'తో మొదలైన వంద కోట్ల ప్రయాణం 'ఏక్ థా టైగర్', 'భజరంగీ భాయిజాన్', 'సుల్తాన్' వంటి ఇండస్ట్రీ హిట్లతో సాగుతూ, 'సికందర్' వరకు ఏమాత్రం తగ్గకుండా కొనసాగుతోంది. కేవలం హిట్లు మాత్రమే కాదు, ఆశించిన స్థాయిలో మెప్పించని 'రేస్ 3', 'దబంగ్ 3', 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' వంటి సినిమాలు కూడా వంద కోట్ల మార్కును దాటాయంటే, సల్మాన్ కు ఉన్న మాస్ ఫాలోయింగ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

సోలో హీరోగానే
ఈ రికార్డు సాధించడంలో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఇవన్నీ సల్మాన్ సోలో హీరోగా నటించిన సినిమాలే. బాక్సాఫీస్ దగ్గర సరైన ఫామ్‌లో లేని సమయంలో కూడా ఆయన సినిమాలు అవలీలగా వంద కోట్ల మార్కును అందుకుంటున్నాయి. ఇది సల్మాన్ ఖాన్ బ్రాండ్ వాల్యూని, ఆయన వెనుక ఉన్న భారీ అభిమాన గణాన్ని తెలియజేస్తోంది. భవిష్యత్తులో ఏ హీరో అయినా 18 సార్లు రూ.100 కట్లు అందుకోవడం అనేది ఒక సవాలుగా మిగిలిపోనుంది. ఈ రికార్డును భవిష్యత్తులో ఏ హీరో బద్దలు కొడతాడా? అనే ఆసక్తి సినీ ప్రియుల్లో నెలకొంది. తర్వాత విడుదలయ్యే రెండు సినిమాలు రెండుసార్లు రూ.100 కోట్ల చొప్పున అందుకుంటే మొత్తం 20 సార్లు రూ.100 కోట్లు అందుకున్న ఏకైక హీరోగా సల్మాన్ నిలబడిపోతారు.












Click it and Unblock the Notifications