తెలుగులో తొలిసారిగా రూ.100 కోట్లు సాధించిన సినిమా ఏదో తెలుసా?
ఒకప్పుడు కోటి రూపాయలు వసూలు చేసిందంటే సినిమా బ్లాక్ బస్టర్ కింద లెక్క. ఆ తర్వాత క్రమేపీ లెక్కలు మారుతూ వచ్చాయి. రూ.2 కోట్లు, రూ.3 కోట్లు, ఇలా గ్రాస్ వసూల్లు పెరుగుతూ వచ్చాయి. తొలిసారిగా చిరంజీవి నటించిన ఘరానా మొగుడు సినిమా రూ.10 కోట్లు సాధించి రికార్డు నెలకొల్పింది. ఆ తర్వాత ఇతర సినిమాలు కూడా 10 కోట్లకు చేరుకున్నాయి. అలా నెమ్మదిగా ప్రయాణం చేస్తూ చివరకు రూ.100 కోట్ల గ్రాస్ అందుకునే స్థాయికి ఎదిగాయి. ఈ క్రమంలో మన తెలుగు సినీ పరిశ్రమలో తొలిసారిగా రూ.100 కోట్లు సాధించి, చరిత్రలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్న సినిమా మగధీర.
అరుదైన రికార్డు తనపేరు మీద రాసుకుంది
ఈ సినిమాకు దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించారు. రామ్ చరణ్, కాజల్ అగర్వాల్, శ్రీహరి, దేవ్ గిల్, సూర్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. కీరవాణి సంగీతం అందించారు. ఆరోజుల్లోనే గీతా ఆర్ట్స్ బ్యానరుపై అల్లు అరవింద్ రూ.45 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమాను రూపొందించారు. రాజమౌళి సినిమా అంటేనే భారీ బడ్జెట్ ఉంటుందని అర్థం. అందుకు తగినట్లుగానే సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతోపాటు తెలుగు సినీ పరిశ్రమలో తొలిసారిగా రూ.100 కోట్ల వసూల్లు సాధించిన సినిమాగా అరుదైన రికార్డును తన పేరుమీద నెలకొల్పింది.

తెలుగు సినిమా స్టామినాను చాటిచెప్పింది
ప్రపంచవ్యాప్తంగా అన్ని వెర్షన్లు తెలుగు, తమిళ్, మలయాళం కలిపి రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన మొదటి తెలుగు సినిమాగా రికార్డు సృష్టించింది. చివరగా రూ.150 కోట్ల దగ్గర ఈ సినిమా వసూళ్లు ముగిశాయి. రూ.75 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ గా వచ్చింది. కర్నూలులో ఏకంగా 1001 రోజులు ఆడి సరికొత్త రికార్డును నెలకొల్పింది. మగధీరకు 'ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్', 'ఉత్తమ కొరియోగ్రఫీ' విభాగాల్లో రెండు జాతీయ అవార్డులు లభించాయి. అప్పటివరకు ఇండస్ట్రీ హిట్ గా ఉన్న 'పోకిరి' రికార్డులను దాటి తెలుగు సినిమా స్టామినాను మగధీర పెంచింది.












Click it and Unblock the Notifications