కేంద్ర ఉన్నత విద్యా సంస్థల్లో 14,606 ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీ: త్వరలోనే భర్తీ
కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తోన్న ఉన్నత విద్యా సంస్థల్లో 14,606 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని లోక్‌సభలో కేంద్రం తెలిపింది.
న్యూఢిల్లీ: కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తోన్న ఉన్నత విద్యా సంస్థల్లో భారీగా అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం సోమవారం పార్లమెంటులో వెల్లడించింది. ఈ విద్యా సంస్థల్లో మొత్తం 14,606 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని లోక్‌సభలో కేంద్రం తెలిపింది.
లోక్‌సభ ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాస్ సర్కార్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. మిషన్ మోడ్‌లో ఖాళీలను భర్తీ చేయాలని మంత్రిత్వ శాఖ అన్ని కేంద్ర ఉన్నత విద్యా సంస్థలను ఆదేశించిందని స్పష్టం చేశారు.

విద్యాశాఖ పరిధిలోని ఉన్నత విద్యా సంస్థల్లో 14,606 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఇప్పటి వరకు 6వేల అధ్యాపక, అధ్యాపకేతర పోస్టుల్ని భర్తీ చేసినట్లు తెలిపారు. ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని చెప్పారు.
విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లోనే కొందరు పదవీ విరమణ చేయడం, మరికొందరు రాజీనామాలు చేయడం తోపాటుగా విద్యార్థుల సంఖ్య పెరుగుతుండటంతో అదనపు అవసరాల రీత్యా ఈ పోస్టుల్లో భారీగా ఖాళీలు ఏర్పాడ్డాయని ఆయన వివరించారు.
విద్యార్థుల చదువుకు ఇబ్బంది లేకుండా సిబ్బంది కొరతను అధిగమించేందుకు ఆయా విద్యాసంస్థలు తగిన చర్యలు తీసుకుంటున్నాయని కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ఇందులో పరిశోధన స్కాలర్లు, కాంట్రాక్ట్, రీ-ఎంప్లాయ్, అనుబంధ, విజిటింగ్ ఫ్యాకల్టీని ఎంగేజింగ్ చేయడం వంటివి ఉన్నాయని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications