ఏపీలో సంక్రాంతి పండగ సెలవులు ఇవే: కోతపై క్లారిటీ
Sankranti holidays 2025 in Andhra Pradesh: ఏపీలో సంక్రాంతి సెలవులపై వస్తోన్న వార్తలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.
సంక్రాంతి పండగకు ఇచ్చే సెలవుల్లో ఎలాంటి కోత పెట్టట్లేదని తెలిపింది. వాటిని కుదించే అవకాశాలు ఉన్నాయంటూ వస్తోన్న వార్తలను తోసిపుచ్చింది. సోషల్ మీడియాలో వస్తోన్న, ప్రచారంలో ఉన్న వార్తలను విశ్వసించవద్దని విజ్ఞప్తి చేసింది. విద్యా సంవత్సరానికి అనుగుణంగానే సంక్రాంతి సెలవులు ఉంటాయని స్పష్టం చేసింది.

జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు సంక్రాంతి సెలవులను ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. ఈ విషయాన్ని ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి అధికారికంగా వెల్లడించారు. సంక్రాంతి సెలవులను కుదించకూడదని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. 2024- 2025 విద్యా సంవత్సరం క్యాలెండర్‌కు అనుగుణంగా యధాతథంగా ఇవి కొనసాగుతాయని చెప్పారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన వరుస అల్పపీడనాల ప్రభావంతో కొద్దిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తో వస్తోన్న విషయం తెలిసిందే. ఫలితంగా పలు జిల్లాల్లో స్థానికంగా సెలవులను ఇవ్వాల్సి వచ్చింది. ప్రత్యేకించి ఏపీ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఇలాంటి పరిస్థితులు అధికంగా కనిపించాయి.
ఈ సెలవుల వల్ల సిలబస్‌ను గడువులోగా పూర్తి చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయని ప్రభుత్వం అంచనా వేసిందని, దీన్ని సకాలంలో భర్తీ చేయడంలో భాగంగా సంక్రాంతి సెలవులను కుదించాలంటూ పాఠశాల మంత్రిత్వ శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదికలను పంపించాయంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగింది.
కుదింపులో భాగంగా జనవరి 11 నుంచి 16వ తేదీ వరకు మాత్రమే సంక్రాంతి సెలవులు ఉండొచ్చంటూ వార్తలు సైతం వచ్చాయి. దీన్ని ఎస్‌సీఈఆర్టీ కొట్టివేసింది. అలాంటి ప్రతిపాదనలనేవీ తాము రూపొందించలేదని, ప్రభుత్వానికి పంపించలేదని తెలిపింది. యధాతథంగా అంటే జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి తెలిపారు.
2025 సెలవుల షెడ్యూల్‌ను ఏపీ ప్రభుత్వం ఇదవరకే ప్రకటించిన విషయం తెలిసిందే. సంవత్సరానికి సెలవుల సంఖ్య 44గా నిర్ధారించింది. ఇందులో 21 ఐచ్ఛిక సెలవులు, 23 అధికారిక సెలవులు ఉంటాయి.












Click it and Unblock the Notifications