AP Polycet 2024 : దరఖాస్తు గడువు పొడిగింపు..ఈనెల 10వరకు అవకాశం..!
ఏపీ పాలిసెట్-2024 ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును పొడిగించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 5తో అంటే నిన్నటితో గడువు ముగియాల్సి ఉండగా.. పలు వర్గాల నుంచి వచ్చిన వినతులు మేరకు ఈనెల 10వ తేది వరకు పొడిగించినట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్ష రాసే అభ్యర్థులు ఎటువంటి అపరాధ రుసుము చెల్లించకుండా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. ప్రవేశ పరీక్ష యథావిధంగా నిర్వహిస్తామని, అందులో ఎలాంటి మార్పు లేదని, సాంకేతిక విద్యాశాఖ వెల్లడించింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 27నే పాలిసెట్-2024 పరీక్ష జరగనుంది.
రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో వివిధ ఇంజినీరింగ్, నాన్-ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులలో ప్రవేశాలకు ఈ పరీక్షను నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 17వ తేదిన పాలిసెట్-2024 నోటిఫికేషన్‌ను రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణా మండలి విడుల చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 20 నుంచే ప్రారంభమైంది. ఈ పరీక్షకు పదోతరగతి చదువుతున్న, ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్థులు రూ.400 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 100 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఈ పరీక్షకు ఏప్రిల్ 10 వరకు దరఖాస్తులు చేసుకునే అవకాశాన్ని విద్యాశాఖ కల్పించింది. పాలిసెట్ ద్వారా ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్, ప్రయివేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో మూడేళ్లు, మూడున్నరేళ్ల కాలవ్యవధి గల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ పాలిసెట్‌లో వచ్చిన స్కోర్ ఆధారంగా ఆయా కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
పాలిసెట్ పరీక్ష విధానం ఇలా ఉంది...
పాలిసెట్ పరీక్షను ఆఫ్‌లైన్ (పెన్ అండ్ పేపర్) విధానంలో నిర్వహిస్తారు. ఈ పరీక్షలో మల్టిపుల్ ఛాయిస్ పద్ధతిలో ప్రశ్నలు అడుగుతారు. ఇందులో మొత్తం మూడు విభాగాలు ఉంటాయి. మొత్తం120 ప్రశ్నలకు పరీక్షను నిర్వహిస్తారు. మ్యాథ్స్-50 మార్కులకు, ఫిజిక్స్-40 మార్కులకు, కెమిస్ట్రీ-30 మార్కులకు ఈ ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం మొత్తం రెండున్నర గంటలు ఉంటుంది. పదోతరగతి స్థాయి సిలబస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఈ పరీక్షలో నెగటివ్ మార్కింగ్ లేదు. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు చొప్పున కేటాయిచడం జరుగుతుంది.












Click it and Unblock the Notifications