Tech Layoffs: లేఆఫ్స్ వద్దు- ఆ పని చేయండి-కంపెనీల్ని కోరిన నైట్స్..!
ఏఐ పేరుతో కొన్ని కంపెనీలు, టెక్నాలజీ వాడకం పేరుతో మరికొన్ని కంపెనీలు ఉద్యోగుల్ని ఎప్పటికప్పుడు లేఆఫ్స్ (layoffs) ఇచ్చి సాగనంపుతున్నాయి. ప్రశ్నిస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రెండే అంటూ సమర్ధించుకుంటున్నాయి. దీంతో ఆయా కంపెనీలపై ఆధారపడిన ఉద్యోగులు, వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ ఉద్యోగుల సంస్థ నైట్స్ (NITES) లేఆఫ్స్ విషయంలో ఐటీ కంపెనీలకు ఓ కీలక సూచన చేసింది. అదే సమయంలో ప్రభుత్వ జోక్యం కూడా కోరింది.
ఉద్యోగాలను తగ్గించడానికి బదులు, తమ ఉద్యోగులకు కొత్త నైపుణ్యాలను నేర్పించడం (reskilling)పై ఎక్కువ పెట్టుబడి పెట్టాలని, మరింత శ్రద్ధ వహించాలని ఐటీ ఉద్యోగుల సంస్థ 'నైట్స్' టెక్ కంపెనీలకు సూచించింది. వైట్‌కాలర్ ఉద్యోగులకు బలమైన రక్షణ కవచాన్ని రూపొందించాలని, ఉద్యోగ తొలగింపు సమయంలో తప్పనిసరి సెవెరెన్స్ ప్యాకేజీ వంటి నిబంధనలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. టెక్ కంపెనీలు ఇప్పటికీ మంచి లాభాలను ఆర్జిస్తున్నప్పటికీ, ఉద్యోగ భద్రత బలహీనపడుతోందని నైట్స్ పేర్కొంది. ఇది కార్పొరేట్ బాధ్యత, జవాబుదారీతనంపై ప్రశ్నలను లేవనెత్తుతోంది.

నైట్స్ అధ్యక్షుడు హర్‌ప్రీత్ సింగ్ సలూజా మాట్లాడుతూ, కంపెనీలు తమ బాధ్యతను గుర్తించాలని పిలుపునిచ్చారు. ఏఐలో భారీ పెట్టుబడులు పెడుతున్నప్పుడు, తమ ప్రస్తుత ఉద్యోగుల నైపుణ్యాల పెంపునకు కూడా నిధులు కేటాయించాలని కోరారు. ఉద్యోగ కోతలను చివరి అవకాశంగా మాత్రమే పరిగణించాలని, మొదటిది కాదన్నారు. భారతదేశంలో ప్రైవేట్ రంగ వైట్‌కాలర్ ఉద్యోగులకు బలమైన చట్టపరమైన రక్షణ లేదని ఆయన ప్రభుత్వానికి తెలిపారు. ఉద్యోగ తొలగింపులకు స్పష్టమైన మార్గదర్శకాలు, తప్పనిసరి నోటీస్ పీరియడ్, సరైన సెవెరెన్స్ ప్యాకేజీ, భారీ తొలగింపుల విషయంలో కంపెనీల జవాబుదారీతనాన్ని నిర్ధారించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఉద్యోగులు తమ హక్కుల గురించి తెలుసుకోవాలని, నిరంతరం నైపుణ్యాలను అప్‌గ్రేడ్ చేసుకోవాలని సలూజా కోరారు. అన్యాయమైన తొలగింపులు, బలవంతపు రాజీనామాలకు వ్యతిరేకంగా భవిష్యత్తులో విధాన స్థాయిలో మార్పుల కోసం నైట్స్ ఒత్తిడి తెస్తుందన్నారు. ఇప్పటికే ఈ సమస్యలను ప్రభుత్వ అధికారుల ముందు ఉంచామని, ఇప్పుడు బలమైన చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్, కఠిన నిబంధనల కోసం కృషి చేస్తామన్నారు. గత కొద్ది నెలలుగా ఒరాకిల్, గూగుల్, మెటా వంటి పెద్ద కంపెనీలు వేలాది ఉద్యోగుల్ని లేఆఫ్ చేసిన నేపథ్యంలో నైట్స్ డిమాండ్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

లేఆఫ్స్ ట్రాకింగ్ సైట్ Layoffs.fyi గణాంకాల ప్రకారం ఈ ఏడాది ఇప్పటివరకు 70కి పైగా టెక్ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 40,480 ఉద్యోగాలను తొలగించాయి. చాలా మంది నిపుణులు ఏఐ ని ఉద్యోగ కోతలకు ఒక సులభమైన సాకుగా చూస్తున్నారని, అయితే వాస్తవానికి ఖర్చుల తగ్గింపు, పెట్టుబడిదారుల ఒత్తిడి, గతంలో చేసిన ఎక్కువ నియామకాలు కూడా ఇందుకు ప్రధాన కారణాలని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications