TG CPGET 2024 : తెలంగాణ సీపీగెట్ 2024 కౌన్సిలింగ్ తేదీల్లో మార్పులు...
అభ్యర్థులకు అలర్ట్.. తెలంగాణ సీపీగెట్ 2024 కౌన్సిలింగ్ తేదీల్లో పలు మార్పులు చేశారు. రాష్ట్రంలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి సీపీగెట్ 2024 పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఇక, ఈ పరీక్షలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ కూడా విడుదలయ్యింది. వీటికి తాజాగా అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు కూడా ఇచ్చుకున్నారు. అయితే మొదటి విడత సీట్ల కేటాయింపు ఈనెల 8వ తేదీన ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ మేరకు అధికారులు బుధవారం ఒక ప్రకటనను కూడా విడుదల చేశారు.
తెలంగాణ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ 2-24 ఫలితాలు ఇటీవలే విడుదలయిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు మొత్తం 73,342 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 64,765 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 61,246 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు రాష్ట్రంలోని ఉస్మానియా, తెలంగాణ, కాకతీయ, శాతవాహన, పాలమూరు, మహాత్మాగాంధీ, మహిళా యూనివర్సిటీలు, జేఎన్‌టీయూహెచ్ పరిధిలో ఉన్న 297 పీజీ కళాశాలల్లో ఎమ్మెస్సీ, ఎంఏ, ఎంకాం, ఎంపీఈడీ కోర్సు వంటి 45 కోర్సుల్లో ప్రవేశాలకు పొందేందుకు అర్హత సాధిస్తారు. సీపీగెట్ పరీక్షలు 2024 జూలై 6వ తేదీ నుంచి జులై 17వ తేదీ వరకు జరిగాయి. ఈ పరీక్షలను ఆన్‌లైన్ విధానంలోనే నిర్వహించారు. ఈ ఏడాది కూడా ఉస్మానియా వర్శిటే ఆధ్వర్యంలోనే ఈ పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 44,604 పీజీ సీట్లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఈ నెల 13లోపు కళాశాలల్లో..
ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సీపీగెట్ తొలివిడత సీట్ల కేటాయింపు సెప్టెంబర్ 4వ తేదీనే నిర్వహించాల్సి ఉంది. కానీ కొన్ని కారణాలతో ఆ తేదీలను వాయిదా వేయాల్సి వచ్చిందని అధికారులు స్పష్టం చేశారు. సీట్లు పొందే విద్యార్థులు ఈ నెల 13వ తేదీలోపు ఆయా కళాశాలల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.ఇక, రెండో విడత కౌన్సెలింగ్ సెప్టెంబర్ 18వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని వివరించారు. అలాట్ మెంట్ అర్డర్ కాపీని సీపీగెట్ అధికారిక వెబ్‌సైట్‌లో https://cpget.ouadmissions.com/ కి వెళ్లి డౌన్లోడ్ చేసుకోగలరని తెలిపారు.
తెలంగాణ సీపీగెట్ 2024 ముఖ్యమైన తేదీలివే..
సెప్టెంబర్ 8వ తేదీన తొలివిడత సీట్ల కేటాయింపు నిర్వహిస్తారు.
సెప్టెంబర్ 13వ తేదీలోపు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
సెప్టెంబర్ 18వ తేదీ నుంచి రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలవుతుంది.
అభ్యర్థులు ఇతర పూర్తి సమాచారం కోసం సీపీగెట్ అధికారిక వెబ్‌సైట్‌ను https://cpget.tsche.ac.in/ సంప్రదించగలరు.












Click it and Unblock the Notifications