నీ తెలుగు ఏంటి ఇలా ఉంది..మంచు లక్ష్మిపై అల్లు అర్జున్ కూతురు కౌంటర్
మంచు లక్ష్మికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిర్మాతగా, నటిగా, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉంటరామె. సినిమా విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు షేర్ చేస్తుంటారు. ఉన్నది ఉన్నట్టు చెప్పడంలో మంచు లక్ష్మి తర్వాతే ఎవరైనా. దీనిపై ఆమె చాలానే విమర్శలు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ తన పంథాను ఏమాత్రం మార్చుకోకుండా ముందుకు సాగుతున్నారు. ఇక మాట్లాడే తెలుగుకు సపరేటు ఫ్యాన్స్ ఉన్నారు.
మంచు లక్ష్మి ప్రసన్న అచ్చమైన తెలుగమ్మాయే అయినా, ఆమె మాట్లాడే భాష, యాస ఎప్పుడూ చర్చనీయాంశమే. అమెరికాలో చదువుకుని, అక్కడి యాసకు అలవాటు పడిన లక్ష్మి, తిరిగి వచ్చాక కూడా అదే శైలిని కొనసాగించడంతో ఆమెపై సోషల్ మీడియాలో తరచుగా ట్రోలింగ్ జరుగుతుంటుంది. అయితే, లక్ష్మి ఈ విషయాలను సరదాగానే తీసుకుంటారు. తనపై తాను కౌంటర్లు వేసుకోవడానికి కూడా వెనుకాడరు. తాజాగా, అల్లు అర్జున్ ముద్దుల కుమార్తె అల్లు అర్హ, మంచు లక్ష్మిపై వేసిన కౌంటర్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఈ సంఘటన బన్నీ ఇంట్లో జరిగింది. మంచు లక్ష్మి, అల్లు అర్హతో మాట్లాడుతున్న వీడియోను అల్లు అర్జున్ రికార్డ్ చేశారు. ఆ వీడియోలో అల్లు అర్హ, లక్ష్మిని ఉద్దేశించి "నువ్వు తెలుగేనా?" అని అమాయకంగా అడిగింది. ఈ ప్రశ్నకు ఆశ్చర్యపోయిన లక్ష్మి, "నేను తెలుగే, నీతో తెలుగులోనే కదా మాట్లాడుతున్నా.. ఎందుకు అలా అడిగావు?" అని ప్రశ్నించింది. దానికి అర్హ తడుముకోకుండా, "నీ యాక్సెంట్ ఎందుకు అలా ఉంది?" అని క్యూట్ కౌంటర్ వేసింది.
అర్హ సమాధానానికి లక్ష్మి నవ్వేసి, "మరి నీ యాక్సెంట్ కూడా నా లాగే ఉంది కదా" అని తిరుగు ప్రశ్న వేసింది. దానికి అర్హ సిగ్గు పడుతూ నవ్వేసింది. ఈ ఇద్దరి సరదా సంభాషణ చూసి బన్నీ కూడా గట్టిగా నవ్వారు. ఈ క్యూట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. స్టార్ కిడ్ అయినప్పటికీ, అల్లు అర్హ అంత అమాయకంగా అడిగిన ప్రశ్న నెటిజన్లను ఎంతగానో ఆకర్షిస్తోంది.












Click it and Unblock the Notifications