నాంపల్లి కోర్టు నిర్ణయంతో అల్లు అర్జున్ ఆశలన్నీ అతడిపైనే?
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ లో నాలుగోతేదీ రాత్రి పుష్ప2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 35 సంవత్సరాల వయసున్న రేవతి మృతిచెందగా, ఆమె తొమ్మిది సంవత్సరాల కుమారుడు శ్రీతేజ్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈరోజుకు ఆ బాలుడు పూర్తిస్థాయిలో కోలుకోలేదు. వైద్యులు బ్రెయిన్ డెత్ అని తెలిపారు. మొన్న కళ్లు తెరిచి చూసినప్పటికీ ఎవరినీ గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాడు. ఈ కేసులో పోలీసులు అల్లు అర్జున్ ను ఏ11గా నమోదు చేసి అరెస్ట్ చేయగా మధ్యంతర బెయిల్ పై బయట ఉన్నారు. ఈరోజు వర్చువల్ గా కోర్టు ఎదుట హాజరుకాగా ఆయన బెయిల్ పిటిషన్ పై విచారణ 30వ తేదీకి వాయిదా పడింది.
భాస్కర్ కేసును వెనక్కి తీసుకోలేదా?
నాంపల్లి కోర్టు విధించిన జ్యుడిషియల్ రిమాండ్ శుక్రవారంతో ముగియడంతో కోర్టు ముందు హాజరు కావాల్సి వచ్చింది. అలాగే తొక్కిసలాట ఘటనలో విచారణ వచ్చే నెల 10వతేదీన చేపట్టనున్నట్లు వెల్లడించింది. దీంతో అల్లు అర్జున్ పరిస్థితి అడకత్తెరలో పడినట్లైంది. అతని ఆశలన్నీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ తండ్రి భాస్కర్ పైనే ఉన్నాయి. కేసును వెనక్కి తీసుకుంటున్నట్లు కొన్నిరోజుల క్రితమే అతను ప్రకటించాడు. తాను పెట్టిన కేసువల్ల అల్లు అర్జున్ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు భాస్కర్ వెల్లడించారు. అయితే ఆ కేసును ఆయన వాపసు తీసుకున్నారా? లేదా? అనే విషయంలో స్పష్టత రావడంలేదు. అయితే ఇది చిక్కడపల్లి పోలీసులు పెట్టిన కేసు అని, అతను వాపసు తీసుకున్నా అల్లు అర్జున్ బయటపడే పరిస్థితి ఉంటుందా? అనే సందేహాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.

ఎవరి కేసు వల్ల అల్లు అర్జున్ పేరు నమోదైంది?
శ్రీతేజ్ తండ్రి ఫిర్యాదువల్ల అల్లు అర్జున్ కేసులో ఉన్నాడా? లేదంటే తెలంగాణ పోలీసులు స్వచ్ఛంధంగా నమోదు చేసిన కేసువల్ల ఉన్నాడా? అనే విషయంపై ఎవరికీ స్పష్టత లేదు. బన్నీ కేసును వాదిస్తున్న లాయర్ నిరంజన్ రెడ్డి అతనికి రెగ్యులర్ బెయిల్ వచ్చేలా గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. అయితే ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కూడా బన్నీ బెయిల్ ను ప్రభావితం చేయబోతోంది. తొక్కిసలాట విషయంలో బన్నీ వ్యవహారశైలిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు పోలీసు అధికారులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసును ప్రభుత్వం వెనక్కి తీసుకునే అవకాశం లేదని నిన్న సినీ పరిశ్రమ ప్రముఖులతో సమావేశం సందర్భంగా అర్థమైంది. దీంతో రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.












Click it and Unblock the Notifications