బాలయ్య వద్దంటే.. పవన్ కల్యాణ్ బ్లాక్‌బస్టర్
సినిమా కథను రాసుకునేటప్పుడు రచయితకానీ, దర్శకుడుకానీ ముందుగా ఓ హీరోను అనుకొని అతనికి అనుగుణంగా దాన్ని సిద్ధం చేసుకుంటారు. హీరోను కలిసి కథ చెప్పిన తర్వాత కాల్షీట్లు ఖాళీ లేకపోవడం లేదంటే కథలో మార్పు చేర్పులు చేయాల్సి ఉండటం లేదంటే హీరోకు నచ్చకపోవడం వంటి కారణాలు చోటుచేసుకుంటాయి. దీంతో రచయిత, దర్శకుడు ఆ కథను వేరే హీరోకు చెప్పి ఒప్పించి సినిమాను రూపొందిస్తారు. అటువంటి సందర్భాల్లో కొన్ని ఫ్లాపవుతాయి.. మరికొన్ని సూపర్ హిట్ అవుతాయి.
కొత్తగా ప్రయత్నిద్దామన్న బాలయ్య
దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు కూడా ముందుగా అన్నవరం సినిమాను బాలకృష్ణతో చేద్దామని కథను వినిపించారు. అయితే చెల్లెలి సెంటిమెంట్ తో అనేక సినిమాలు చేసివుండటంతో కొత్తగా ఏదైనా ప్రయత్నిద్దామని, ఇద్ది వద్దని బాలయ్య భీమినేనికి చెప్పారు. దీంతో ఆ దర్శకుడు కథను పవన్ కల్యాణ్ కు వినిపించారు. అది ఆయనకు బాగా నచ్చడంతో తెరెకెక్కింది. 2006 డిసెంబరు 29న విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. అప్పటికే జానీ, గుడుంబా శంకర్, బంగారం లాంటి సినిమాలు ఫ్లాపవడంతో పవన్ సతమతమవుతున్నాడు. అటువంటి సమయంలో ఆయనకు మంచి సూపర్ హిట్ ను ఈ సినిమా ఇచ్చింది.

అనుష్క డేట్లు ఖాళీగా లేకపోవడంతో..
ఈ సినిమాలో ముందుగా హీరోయిన్ గా అనుష్కను తీసుకోవాలనుకున్నారుకానీ ఆమె బిజీగా ఉండటంతో అసిన్ ను తీసుకున్నారు. సూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై ఆర్ బీ చౌదరి నిర్మించిన అన్నవరంకు రమణ గోగుల సంగీతాన్ని అందించారు. పవన్ కల్యాణ్ చెల్లెలిగా సంధ్య నటించింది. ఈ సినిమాతోనే పవన్ కల్యాణ్ తిరిగి విజయాన్ని అందుకోవడమే కాకుండా ఆచితూచి సినిమాలు చేస్తూ పవర్ స్టార్ అయ్యాడు. బాలయ్య ఈ సినిమా చేస్తే బాగుండేదని, చెల్లెలి సెంటిమెంట్ తో ఎన్ని సినిమాలు వచ్చినప్పటికీ కథ, కథనం బాగుంటే తెలుగు ప్రేక్షకులు తప్పక ఆదరించేవారని, బాలయ్య నుంచి మరో మంచి సినిమాను వదులుకున్నామని అభిమానులు సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications