దేశం విడిచి వెళ్లిపోయిన స్టార్ హీరోయిన్.. ఇకపై అంతా బ్యాంకాక్ నుంచే!
ప్రముఖ నటి, చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ అవికా గోర్ తన కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలో దేశం విడిచి వెళ్లడం అభిమానులకు పెద్ద షాకిచ్చింది. ఆమె తన భర్త మిలింద్ చంద్వానీతో కలిసి శాశ్వతంగా థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌కు షిఫ్ట్ అయిపోయినట్లు ప్రకటించింది. సౌత్ సినిమాలతో పాటు హిందీ టీవీ షోలతో బిజీగా ఉన్నప్పటికీ.. తన వ్యక్తిగత, వృత్తిపరమైన ఎదుగుదల కోసం ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లు అవికా గోర్ వివరించింది.
బ్యాంకాక్‌కు ఎందుకు షిఫ్ట్ అయింది?
బ్యాంకాక్ షిఫ్ట్ గురించి అవికా గోర్ మాట్లాడుతూ.. తన భర్త మిలింద్‌కు అక్కడ కెరీర్ పరంగా మెరుగైన అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. "మిలింద్, నేను అక్కడ పని పరంగా మంచి అవకాశాలు ఉన్నట్లు గుర్తించాం. బ్యాంకాక్ ఎప్పుడూ వెకేషన్‌లో ఉన్న అనుభూతిని ఇస్తుంది. అందుకే అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నాం. మా ఏడేళ్ల ప్రేమ ప్రయాణంలో మేమిద్దరం ఎప్పుడూ ఒకరి ఎదుగుదలకు మరొకరు మద్దతుగా ఉన్నాం. మిలింద్ నా కెరీర్ కోసం ఎంతో సహకరించారు.. ఇప్పుడు నేను కూడా ఆయన ఎదుగుదలకు అడ్డుపడకూడదని భావిస్తున్నాను" అని అవికా గోర్ స్పష్టం చేసింది. ఇప్పటికే వారు బ్యాంకాక్‌లో ఓ ఇంటిని కొనుగోలు చేసి, తమ అభిరుచులకు అనుగుణంగా అలంకరించుకుంటున్నారు.

కెరీర్‌పై ప్రభావం పడుతుందా?
దేశం విడిచి వెళ్లడం వల్ల తన సినీ కెరీర్‌పై ఎలాంటి ప్రభావం పడదని అవికా గోర్ ధీమా వ్యక్తం చేసింది. తాను ముంబైలో ఉన్నప్పుడు కూడా హైదరాబాద్, విశాఖపట్నం వంటి నగరాల్లోనే ఎక్కువగా షూటింగ్స్ చేసేదాన్నని గుర్తు చేసింది. ముంబైని తన బేస్‌గా ఉంచుకోవాల్సిన అవసరం లేదని ఆమె అభిప్రాయపడింది. బ్యాంకాక్‌లో నివసిస్తున్నప్పటికీ.. సినిమాల కోసం ఇండియాకు వస్తూ పోతూ ఉంటానని.. వర్క్ కమిట్‌మెంట్స్ తన ప్రాధాన్యత అని అవికా గోర్ తెలిపింది. ఇండస్ట్రీ వ్యక్తులు కూడా తన నిర్ణయాన్ని సానుకూలంగా స్వాగతించారని వెల్లడించింది.
వరుస ప్రాజెక్టులతో అవికా గోర్ బిజీ
అవికా గోర్ ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఆమె త్వరలోనే రియాలిటీ షో 'ఖత్రోన్ కే ఖిలాడీ' కొత్త సీజన్‌లో కనిపించనుంది. దీంతో పాటు ఓ క్రేజీ సౌత్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అవికా సెప్టెంబర్ 2025లో సామాజిక కార్యకర్త, ఎన్జీవో నిర్వాహకుడు అయిన మిలింద్ చంద్వానీని వివాహం చేసుకుంది. బ్యాంకాక్‌కు వెళ్లినా తన తల్లిదండ్రులు ఇండియాలోనే ఉన్నారని, పని నిమిత్తం తన ప్రయాణాలు కొనసాగుతాయని అవికా గోర్ స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications