దుబాయ్ దాడుల నుంచి తృటిలో తప్పించుకున్న స్టార్ హీరోయిన్!(వీడియో)
ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న భీకర దాడులు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం సామాన్యులనే కాకుండా సెలబ్రిటీలను కూడా కలవరపెడుతోంది. ముఖ్యంగా ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడులు, ప్రతిగా దుబాయ్ విమానాశ్రయంపై జరిగిన దాడుల నేపథ్యంలో నోరా ఫతేహి సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. ప్రస్తుత పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆమె ఒక వీడియోను విడుదల చేశారు.
నేను సురక్షితమే.. కానీ ఆ వీడియోలు భయపెడుతున్నాయి
నోరా ఫతేహికి దుబాయ్‌తో విడదీయలేని సంబంధం ఉంది. ఆమె అక్కడ తరచుగా స్టేజ్ షోలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే దుబాయ్‌లో ఉద్రిక్తతలు పెరగడంతో అభిమానులు ఆమె భద్రత గురించి ఆందోళన చెందారు. దీనిపై స్పందిస్తూ.. తాను ప్రస్తుతం దుబాయ్ నుంచి భారత్‌కు చేరుకున్నానని, క్షేమంగానే ఉన్నానని స్పష్టం చేశారు. కానీ బయట జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే వెన్నులో వణుకు పుడుతోందని ఆమె అన్నారు.

మానసికంగా అలసిపోయాను
వైరల్ అవుతున్న యుద్ధ దృశ్యాలపై నోరా ఆవేదన వ్యక్తం చేస్తూ ఇలా అన్నారు. "ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో నేను ఆధ్యాత్మికంగా, మానసికంగా పూర్తిగా అలసిపోయాను. సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలు నన్ను లోపల నుంచి కుదిపేస్తున్నాయి. మనందరికీ, ఈ ప్రపంచానికి ఇప్పుడు శాంతి కావాలి. ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛగా బతికే హక్కు ఉంది. దురదృష్టవశాత్తూ మనం అస్థిరత, భయం నీడలో బతుకుతున్నాం. రేపు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది." అని నోరా ఫతేహీ పేర్కొన్నారు.
నిర్దోషుల ప్రాణాలు పోకూడదు
యుద్ధం వల్ల సామాన్య ప్రజలు బలికావడంపై ఆమె ఆందోళన చెందారు. "వీడియోలు చూస్తుంటే చాలా భయంగా ఉంది. అమాయక ప్రజల ప్రాణాలు పోవాలని ఎవరూ కోరుకోరు. ప్రతి ఏటా ఏదో ఒక దేశం మధ్య యుద్ధం లేదా మారణకాండ జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఇది ఆగిపోవాలి. అందరూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, దేవుడిపై నమ్మకం ఉంచాలని కోరుకుంటున్నాను," అని నోరా పిలుపునిచ్చారు.
నోరా ఫతేహి మొరాకో మూలాలున్న నటి అయినప్పటికీ.. భారత్‌లో ఉంటూ తన కెరీర్‌ను నిర్మించుకున్నారు. అంతర్జాతీయంగా షోలు చేసే ఆమె, యుద్ధం కారణంగా నెలకొన్న అనిశ్చితికి భయాందోళన వ్యక్తం చేశారు. గతంలో నటి సోనాల్ చౌహాన్ కూడా దుబాయ్ పరిస్థితులపై స్పందిస్తూ, సురక్షితంగా భారత్ రావడానికి సాయం చేయాలని ప్రధాని మోదీని కోరిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications