అల్లు అర్జున్‌కు బిగుస్తున్న ఉచ్చు!
హైదరాబాద్ సంధ్య థియేటర్ లోయర్ బాల్కనీలో ఈనెల నాలుగోతేదీ రాత్రి తొక్కిసలాట జరిగి దిల్ షుక్ నగర్ కు చెందిన రేవతి అనే 35 సంవత్సరాల మహిళ మరణించారు. ఆమె తొమ్మిదేళ కుమారుడు శ్రీతేజ్ తాజాగా ఆసుపత్రిలో బ్రెయిన్ డెడ్ అయినట్లు పోలీసు కమిషనర్ తెలిపారు. ఈ కేసులో అల్లు అర్జున్ ఒక రాత్రి చంచల్ గూడ జైలులో ఉండివచ్చారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన బయటకు రావడం జరిగింది. అయితే థియేటర్ కు రావడానికి ముందురోజు పోలీసులను అనుమతి కోరగా వారు నిరాకరించిన విషయం తెలిసిందే.
పోలీసులు రావొద్దని చెప్పినప్పటికీ
ఈ విషయమై పోలీసులు తాజాగా లేఖను విడుదల చేశారు. హీరో, హీరోయిన్లు అక్కడకు వస్తే అభిమానులు భారీగా తరలివస్తారు.. వారిని అదుపు చేయడం కష్టమవుతుంది.. కాబట్టి రావొద్దంటూ సంధ్య థియేటర్ యాజమాన్యం ఇచ్చిన లేఖకు పోలీసులు బదులిచ్చారు. వాస్తవానికి సంధ్య థియేటర్ దగ్గర భద్రతను ఏర్పాటు చేయడంలో పోలీసులదే వైఫల్యం అంటూ ఆ థియేటర్ యజమాని హైకోర్టులో వేసిన బెయిల్ లో పేర్కొన్నారు. అయితే పోలీసులు రావొద్దని చెప్పినా వచ్చారని, వారు రావడంవల్లే ఈ ఘటన జరిగిందని ప్రభుత్వ న్యాయవాది కోర్టులో వాదించారు. ప్రస్తుతం పోలీసులు విడుదల చేసిన లేఖపై అల్లు అర్జున్ అభిమానులు అనేక సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అది నిజం కాదని కొందరు అంటుంటే, కొందరు నెటిజన్లు మాత్రం నిజమైనదే అంటున్నారు.

నాంపల్లి కోర్టులో బలపడనున్న కేసు
పోలీసులు విడుదల చేసిన లేఖ ప్రకారం నాంపల్లి కోర్టులో కేసు బలపడుతుంది. తిరిగి ఈ కేసు ఏ11గా ఉన్న అల్లు అర్జున్ మెడకే చుట్టుకుంటుంది. ఈ కేసుపై అల్లు అర్జున్ లాయర్లు, సంధ్య థియేటర్ యాజమాన్యం లాయర్లు కోర్టులో ఎలా వాదిస్తారో చూడాలి. అయితే పోలీసులు మాత్రం బన్నీని వదిలేలా కనిపించడంలేదు. ఎందుకంటే తాము రావొద్దని చెప్పినప్పటికీ కావాలనే వచ్చారనేది వారి వాదన. ఈ కేసుకు సంబంధించి క్వాష్ పిటిషన్ లో బెయిల్ ఎలా ఇస్తారంటూ ప్రభుత్వ న్యాయవాది జడ్జి శ్రీదేవిని ప్రశ్నించారు. ఈ పరిణామాలన్నీ పరిశీలిస్తుంటే పోలీసులు చాలా పకడ్బందీగా కేసును టైట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరలవుతున్న లేఖపైనే ఓ స్పష్టత రావాల్సి ఉంది. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు మిగతా విషయాలన్నీ నాంపల్లి కోర్టులో తేల్చుకోమని చెప్పింది. నాలుగు వారాలు గడిచిన తర్వాత ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. అయితే తెలంగాణ ప్రభుత్వం ఈ కేసును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications