చిరంజీవి Vs బాలకృష్ణ... మోక్షజ్ఞ విషయంలో భగ్గుమన్న విభేదాలు?
నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ కథానాయకుడిగా పరిచయం అవుతున్న సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, లెజెండ్ సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్, మతుకుమల్లి తేజస్విని సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. హనుమాన్ చిత్రంతో సంచలన దర్శకుడిగా మారిన ప్రశాంత్ వర్మ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబరు 5వ తేదీన ఈ సినిమాను గ్రాండ్ గా పూజా కార్యక్రమాలతో ప్రారంభించాలని నిర్ణయించారు. అందుకు తగినట్లుగా రూ.30 లక్షలతో సెట్ కూడా నిర్మించారు. అయితే పూజా కార్యక్రమాలు జరగలేదు. మోక్షజ్ఞకు జ్వరంగా ఉండటంతో సినిమా ప్రారంభోత్సవం వాయిదా పడిందని బాలకృష్ణ ప్రకటించారు.
అసంతృప్తికి లోనైనా బాలయ్య
అయితే వాస్తవానికి ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన చెరుకూరి సుధాకర్ మెగా స్టార్ చిరంజీవి హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, హీరో నాని సమర్పకుడిగా వ్యవహరిస్తున్న చిత్రాన్ని కూడా నిర్మించబోతున్నారు. తన కుమారుడిని భారీగా అరంగ్రేటం చేస్తున్న తరుణంలో చెరుకూరి సుధాకర్ నుంచి చిరంజీవి సినిమా ప్రకటన రావడంతో బాలయ్య తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు తెలుస్తోంది. దీంతో ప్రారంభోత్సవాన్ని వాయిదా వేయించారని ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి. ఏదైనా ముహూర్తం చూసుకొని పనులు చేసే బాలయ్య మంచి ముహూర్తం ఉన్నప్పటికీ సినిమాను ప్రారంభించకుండా వాయిదా వేయించారంటే నిర్మాతపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారంటున్నారు.

మోక్షజ్ఞ ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత..
చిత్ర యూనిట్ మాత్రం మోక్షజ్ఞ ఆరోగ్యం మెరుగుపడిన వెంటనే షూటింగ్ ప్రారంభమువుతుందని ప్రకటించారు. ఈ సినిమా కోసం ఇప్పటికే పోరాటాలు, నృత్యాలు, నటనలో మోక్షజ్ఞ శిక్షణ పొందాడు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి అతిరథ మహారథులతోపాటు బాలయ్య అల్లుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా హాజరు కావాల్సి ఉంది. సోషియో ఫాంటసీ కథతో, అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. అంతేకాదు.. ప్రశాంత్ వర్మ ఆలోచనల ప్రకారం విజువల్ వండర్ గా తీయబోతున్నారు. మోక్షజ్ఞ ను పరిచయం చేసే బాధ్యతను తనపై ఉంచినందుకు బాలయ్య నమ్మకాన్ని నెరవేరుస్తానంటూ ప్రశాంత్ వర్మ ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశాడు. తొలి సినిమాకు మోక్షజ్ఞ రూ.20 కోట్ల పారితోషికం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. సోషియో ఫాంటసీ కథాంశంతో వస్తున్న సినిమా కాబట్టి దీన్ని కూడా పాన్ ఇండియా సినిమాగా తీర్చిదిద్దుతున్నారు.












Click it and Unblock the Notifications