హీరోయిన్‌గా డిజాస్టర్.. కట్ చేస్తే గూగుల్ కంపెనీ ఇండస్ట్రీ హెడ్
సినీ పరిశ్రమలోకి హీరోయిన్లుగా ప్రవేశించిన తర్వాత కొంతమంది విజయాలు సాధిస్తారు. కొంతకాలం పరిశ్రమలో నిలదొక్కుకొని జీవితంలో స్థిరపడతారు. మరికొందరు చెప్పుకోదగిన సంఖ్యలోనే సినిమాలు చేసి పరిశ్రమ నుంచి వెళ్లిపోతారు. ఇది సహజంగా జరుగుతుంటుంది. అలాగే ఓ హీరోయిన్ సినిమాల్లోకి అడుగుపెట్టిందికానీ నిలదొక్కుకోలేకపోయింది. ఆ తర్వాత ఆమె తీసుకున్న నిర్ణయం జీవితాన్నే మార్చేసింది. గూగుల్ కంపెనీ ఇండియా హెడ్ ఆఫ్ ఇండస్ట్రీ పాత్ర పోషిస్తోంది.
వంశీ సినిమాలో కూడా నటించింది
ఆమె ఎవరో కాదు.. మయూరి కాంగో. మహేష్ బాబు వంశీ సినిమాలో కూడా నటించింది. 1995లో నసీమ్ అనే హిందీ సినిమాద్వారా పరిశ్రమలోకి అడుగుపెట్టింది. పాపా కెహతేహై సినిమా చాలా పేరు తెచ్చిపెట్టింది. తర్వాత ఫ్లాప్స్ వచ్చాయి. తెలుగులో వంశీ చేసింది. అయినప్పటికీ కెరీర్ అనుకున్నరీతిలో ముందుకు సాగలేదు. తర్వాత టెలివిజన్ సీరియల్స్ లో నటించింది. కానీ అక్కడ కూడా అనుకున్నస్థాయిలో గుర్తింపు రాలేదు. వెండితెర, బుల్లితెరపై కెరీర్ విజయవంతం కాకపోవడంతో కీలక నిర్ణయం తీసుకుంది. పరిశ్రమకు టాటా చెప్పేసింది. 2003లో ఎన్నారై ఆదిత్య థిల్లాన్ ను వివాహం చేసుకుంది. న్యాయార్క్ లోని ప్రముఖ కళాశాల బరూచ్ కాలేజ్ జిక్లిన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఎంబీఏ చదివింది.

అక్కడి నుంచి మలుపు తిరిగిన మయూరి జీవితం
అక్కడి నుంచి మయూరి కాంగో కొత్త జీవితం ప్రారంభమైంది. అంతర్జాతీయంగా మంచి పేరున్న పెర్ఫామిక్స్ అనే కంపెనీలో ఎండీస్థాయికి ఎదిగిన తర్వాత అనేక అవకాశాలు వచ్చాయి. సహజంగానే ఆమెలో నాయకత్వ లక్షణాలున్నాయి. కెరీర్ లో ఉన్నతస్థాయికి చేరుకోవడానికి అవి బాగా ఉపయోగపడ్డాయి. అక్కడి నుంచి గూగుల్ లో చేరింది. ఆ కంపెనీలో డిజిటల్ స్ట్రాటజీస్, ఇన్నోవేషన్స్ విభాగాలను పర్యవేక్షిస్తోంది. తనదైన సలహాలను, సూచనలను అందిస్తూ డిజిటల్ గా కంపెనీకి సమర్థవంతమైన నాయకత్వాన్ని అందిస్తోంది. కార్పొరేట్ కంపెనీలో తనదైన ముద్ర వేస్తున్న మయూరి భవిష్యత్తులో మరింత పేరు తెచ్చుకోవాలని నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు.












Click it and Unblock the Notifications